GET MORE DETAILS

సిఎం హామీ అమలయ్యే వరకూ పోరాటం - రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల స్పష్టీకరణ

సిఎం హామీ అమలయ్యే వరకూ పోరాటం - రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల స్పష్టీకరణ 

దీక్షల్లో మేమూ పాల్గంటాం : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు



టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులకు సిఎం ఇచ్చిన హామీ అమలయ్యే వరకూ పోరాటం ఆగదని' అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు. 'మీ దీక్షల్లో ఐదుగురు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పాల్గని మద్దతుగా నిలుస్తా'రని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. టిటిడి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక రామతులసి కల్యాణ మండపంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 14 రోజులుగా కార్మికులు నిరసన చేస్తుంటే టిటిడి అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా..వారిపట్ల చిన్నచూపు తగదన్నారు. కార్మికులకు మద్దతు తెలిపిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం శోచనీయమన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని తెలిపారు. కార్మికులకు మద్దతుగా ఐదుగురు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గంటారని తెలిపారు. డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ (జనసేన), ఆర్‌సి మునికృష్ణ (టిడిపి), పి.మురళి (సిపిఐ), వందవాసి నాగరాజు (సిపిఎం), పి.నవీన్‌కుమార్‌రెడ్డి, డిఎంసి భాస్కర్‌ (కాంగ్రెస్‌), రాఘవశర్మ (సీనియర్‌ జర్నలిస్టు)లతో పాటు పలువురు మాట్లాడారు. టిటిడిలో కాంట్రాక్టు విధానం కొనసాగించడం అంటే దళారీ విధానాన్ని ప్రోత్సహించడమేనని విమర్శించారు. కార్మికులకు టైంస్కేల్‌ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదేపదే ప్రకటనలు చేస్తుంటే..అందుకు విరుద్ధంగా టిటిడి ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటూనే, టైంస్కేల్‌ ఇవ్వలేమని టిటిడి చేతులెత్తేయడం అంటే విచారణ జరపకుండా తీర్పు ఇవ్వడం కాదా? అని విమర్శించారు. సమస్య పరిష్కారానికి సిఎం స్వయంగా జోక్యం చేసుకోవాలని కోరారు. టిటిడి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నేత టి.సుబ్రమణ్యం అధ్యక్షతన సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మి, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments