GET MORE DETAILS

జాతీయ పాఠ్యప్రణాళికలో ‘స్థానిక’ అంశాలు _ స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు చోటు : 17 అకడమిక్‌ అంశాల గుర్తింపు

జాతీయ పాఠ్యప్రణాళికలో ‘స్థానిక’ అంశాలు _  స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు చోటు : 17 అకడమిక్‌ అంశాల గుర్తింపు




జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో సమూల మార్పుల దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. జాతీయత, దేశీయ విజ్ఞానం, పౌరసత్వం, కళలు, సంస్కృతి సంప్రదాయాలు, వివిధ చేతి వృత్తుల్లో ఇంటర్న్‌షిప్‌ వంటి అంశాలకు పెద్దపీట వేయనుంది. ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని లోకల్‌ ఫ్లేవర్‌తో జాతీయ పాఠ్యప్రణాళికకు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. 2022 ఆగస్టు నాటికి అమల్లోకి తేవాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సంకల్పించింది.ఈ లోగానే పాఠశాల స్థాయి పాఠ్యాంశ ప్రణాళిక, పుస్తకాల తయారీ వంటి ప్రక్రియలను కూడా పూర్తిచేసేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్యలతో పాటు ఉపాధ్యాయ విద్య, వయోజన విద్యలోనూ మార్పులు జరిగేలా జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేపట్టనుంది. రానున్న 4 వారాల్లో జిల్లా స్థాయిలో సంప్రదింపులు చేయడం, మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా సర్వేలను పూర్తి చేసి ఆ నివేదికలను పంపించేలా రాష్ట్రాలకు సూచనలు చేసింది.

పాఠశాల స్థాయిలోనూ సబ్జెక్టుల ఎంపిక :

పాఠ్యాంశాలు, బోధనా విధానాలు, ఇతర ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన అంశాలను పాఠ్యప్రణాళిక రూపకల్పనలో పొందుపర్చనున్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 17 కొత్త అకడమిక్‌ అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటివరకు ఉన్నత విద్యారంగంలోనే ఉన్న.. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థులకు స్వేచ్ఛ వంటివి పాఠశాల స్థాయిలో సెకండరీ విద్యార్థులకూ వర్తింపచేయనున్నారు.

కోర్‌ సబ్జెక్టులకు సంబంధించి కరికులమ్‌ సంక్షిప్తీకరణ, బహుభాషా నైపుణ్యాల పెంపుదల వంటివి ఉండనున్నాయి. ఆన్‌లైన్లో జిల్లా స్థాయి సంప్రదింపులను కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, నిరక్షరాస్యులు ఇందులో పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల సేకరణకు ఎన్‌సీఈఆర్టీ 100 ప్రశ్నలతో ఒక పత్రాన్ని రూపొందించి ఇచ్చింది. ఇందులో 40 ప్రశ్నలు పాఠశాల విద్యకు సంబంధించినవి. తక్కినవి వయోజన విద్య, ఉపాధ్యాయ విద్య, పూర్వ ప్రాథమిక విద్యలకు సంబంధించినవి.

Post a Comment

0 Comments