GET MORE DETAILS

హ్యాకర్ల పాలిట విలన్...‌!

 హ్యాకర్ల పాలిట విలన్...‌!టెక్నాలజీ యుగంలో సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్ల బారిన పడి, మోసపోతున్న బాధితులెందరో. వీటిని అడ్డుకొని, అక్రమార్కుల పని పడతానంటున్నాడు వాలుగొండ హరి. దీనికోసం ఎథికల్‌ హ్యాకర్లుగా మారాలనుకునే యువతకు సెమినార్లు నిర్వహిస్తూ ఉచిత శిక్షణనిస్తున్నాడు. అతడి ప్రతిభ, అంకితభావానికి మెచ్చి ప్రపంచస్థాయి వేదికల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇటీవలే అమెరికాలో జరిగిన ‘వరల్డ్‌ హ్యాకింగ్‌ పోటీ’ల్లో పాల్గొని తిరిగొచ్చాడు తను.

సామాజిక మాధ్యమ ఖాతాలను హ్యాక్‌ చేసి అక్రమార్కులు వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఫోన్‌, కంప్యూటర్‌, ఆన్‌లైన్‌.. ప్రతి చోటా భద్రత కొరవడుతోంది. వివిధ సంస్థల రహస్య సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్‌ నేరగాళ్లు  రకరకాల మాల్‌వేర్‌లను సృష్టిస్తున్నారు. ఈ నేరగాళ్ల బారిన పడకుండా, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ రహస్య సమాచారాన్ని భద్రంగా ఉంచుకునేలా, హ్యాకర్లపై ప్రతిదాడి చేసేలా సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటుంటాయి. అలా  ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో లీడ్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువకుడు హరి. ఓవైపు వృత్తి కొనసాగిస్తూనే.. ఏమాత్రం తీరిక దొరికినా ఎథికల్‌ హ్యాకర్లకు శిక్షణనిస్తూ, సైబర్‌ మోసాలు ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.


పరోపకారిగా...

హరికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తను ఎదగాలంటే చదువొక్కటే మార్గమని నమ్మాడు. తల్లి అండతో కష్టపడి చదివేవాడు. ఇంటర్‌లో ఉన్నప్పుడే ఎథికల్‌ హ్యాకింగ్‌ గురించి తెలిసింది. అదే బాటలో వెళ్తే ఉపాధితో పాటు సమాజానికి ఉపయోగపడేలా సైబర్‌ మోసాలు అరికట్టవచ్చని భావించాడు. అనుకున్నట్టే డిగ్రీ పూర్తి కాగానే సెక్యూరిటీ ప్రొఫెషనల్‌, ఎథికల్‌ హ్యాకర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. దీంతోపాటు వెబ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, మొబైల్‌ సెక్యూరిటీ వంటి వాటిలో నైపుణ్యం సాధించాడు. ఎక్కడైనా సైబర్‌ నేరం జరిగితే తన పరిధిలో సాయం చేయడానికి ముందుంటున్నాడు.


హ్యాకర్ల పాలిట విలన్...‌!

దేశం తరపున హ్యాకింగ్‌ పోటీలు ఎక్కడ జరిగినా ఆసక్తితో హాజరవుతూ తన నైపుణ్యాన్ని నలుగురితో పంచుకుంటున్నాడు హరి. అతడి ప్రతిభ గుర్తించి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి ఈమధ్యే అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ప్రపంచ హ్యాకింగ్‌ పోటీల్లో భారత్‌ తరపున హాజరయ్యాడు. కంప్యూటర్‌ సెక్యూరిటీ విభాగంలో ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘బ్లాక్‌ హ్యాట్‌’ సెమినార్‌లో పాల్గొని, ఇంటర్నెట్‌ భద్రతకు పాటించాల్సిన సూత్రాలు, హ్యాకర్లను అడ్డుకునే విధానాలపై మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే అంశంపై బెల్జియంలోని గెంట్‌లో నిర్వహించిన సదస్సుకు హాజరయ్యాడు. ‘నల్‌కాన్‌’, ‘నల్‌’ ఛాప్టర్లలో ప్రపంచ, దేశవ్యాప్తంగా 80కి పైగా ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాడు. తన వద్ద శిక్షణ పొందిన చాలామంది వివిధ సంస్థల్లో సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గర్వంగా చెబుతున్నాడు హరి.

సైబర్‌ భద్రత, ఎథికల్‌ హ్యాకింగ్‌లపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి.. సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఒక ఓపెన్‌ కమ్యూనిటీ గ్రూప్‌ ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉంది. నిపుణులు, అధికారులు, ఔత్సాహికులు ఇందులో పదివేలకుపైగా సభ్యులుగా ఉన్నారు. ఇందులో ‘నల్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ’ అనే ఓపెన్‌ గ్రూపు ప్రారంభించి ఇండియా చాప్టర్‌కి హరి నాయకత్వం వహించి.. ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారికి ఉచితంగా శిక్షణనిస్తున్నాడు. దీనికోసం నెలకు ఓరోజు సొంతంగా సెమినార్‌ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సాంకేతికతను మంచికి ఉపయోగిస్తే.. ఉచితంగా మెటీరియల్‌ అందించి, శిక్షణ కూడా ఇస్తానంటున్నాడు.

Post a Comment

0 Comments