GET MORE DETAILS

పల్లె బడుల్లోనే విలువలకు వన్నె. ప్రభుత్వ పాఠశాలపై చిన్నచూపు వద్దు : సుప్రీం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఉద్బోధ.

 పల్లె బడుల్లోనే విలువలకు వన్నె. ప్రభుత్వ పాఠశాలపై చిన్నచూపు వద్దు : సుప్రీం జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఉద్బోధ.



తెలుగు మరువరాదు..ఇంగ్లీషూ కావాలి

చదువుకుంటేనే ఏదైనా సాధించగలం

సామాజిక ప్రజాస్వామ్యం నేటి అవసరం

వెనుకబడ్డవర్గాలకు చేయూత అందరి బాధ్యత

విజేతలపై ఈర్ష్య వద్దు.. స్ఫూర్తి పొందాలి

తాడికొండలోని ఎస్‌వీవీ హైస్కూల్‌ ప్లాటినం

జూబ్లీ వేడుకల్లో స్ఫూర్తిమంత ప్రసంగం


చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు అవసరమైన విలువలను కార్పొరేట్‌ పాఠశాలల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో బాగా నేర్పుతారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడికొండలోని శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత  పాఠశాల (ఎస్‌వీవీ) స్థాపించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఎస్‌వీవీ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 80 శాతం మంది విద్యార్థులు చదువుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని జడ్పీ పాఠశాలల్లోనే సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ చలమేశ్వర్‌, నేను చదువుకున్నాం. వెనుకబడిన వర్గాల వారికి చేయూతనివ్వ టం మనందరి బాధ్యత. సమానత్వం అనేది అంబేడ్కర్‌ కల. ఈ కలను నిజం చేయడానికి, బడుగువర్గాలను పైకి తీసుకురావటానికి ప్రభుత్వా లు కష్టపడుతున్నాయి. పౌరులంతా సఖ్యతగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది’’ అని ఆయన ఉద్బోధించారు. 

'సంతోషం’ తగ్గింది... 

సంతోషం డబ్బు నుంచి రాదని, డబ్బు సంపాదన ఒక వ్యసనమని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సంపద నుంచి కాకుండా... డబ్బును లేనివారికి పంచితేనే సంతోషం వస్తుందన్నారు. ‘‘సంతోషంగా ఉన్న 150 దేశాల్లో ఐక్యరాజ్యసమితి సర్వే చేసింది. ఈ సర్వేలో భారత్‌ 139వ స్థానంలో ఉంది. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు ర్యాంకులో మనకన్నా మెరుగ్గా ఉన్నాయి’’ అని వివరించారు.  

భాషా, సంస్కృతులు తోడుండాలి... 

విద్యార్థులు కులగోత్రాలు పట్టించుకోరాదని జస్టిస్‌ లావు నాగేశ్వరరా వు అన్నారు. ‘‘పిల్లలకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు. తెలుగు భాష ను ఈ రోజుల్లో మరిచిపోతున్నారు. మాతృభాష గురించి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. భాషా, సంస్కృతి జీవితకాలం తోడుండాలి. పిల్లలకు తెలుగుభాషపై అభిమానం పెంచాలి. అదే సమయంలో ఇంగ్లీష్‌ భాష ప్రసుత్తం ఉన్న సమాజంలో ఎంతో అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న వారికి అహం ఉండకూడదని, విజయం సాధించిన వారిపట్ల పక్కవారు ఈర్ష్య పడకూడదని హితవు పలికారు. 

సంస్కారం నేర్పేదే నిజమైన చదువు : జస్టిస్‌ శేషసాయి

అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి అన్నారు. ఎవరికైనా చదువు అందిస్తే వారి తరాలన్నీ బాగుపడతాయని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారానికి ప్రాధాన్యం ఇవ్వని చదువు.. అసలు చదివే కాదని వ్యాఖ్యానించారు. మనిషి అభివృద్ధిలోకి రావాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని తెలిపారు. ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరిస్తే సమస్యలు దూరం అవుతాయన్నారు. రాయప్రోలు సుబ్బారావు రచించిన ఏ దేశమేగినా.... పద్యాన్ని పాడి జస్టిస్‌ ఏవీ శేషసాయి తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ శేషసాయి స్కూల్‌ ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్‌వీవీ పాఠశాల స్థాపనకు, అభివృద్ధికి పాటుపడిన విద్వాన్‌ గోగినేని కనకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం స్కూల్‌ ఆవరణలో నిర్మించనున్న ప్లాటినం జూబ్లీ భవనానికి శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌వీవీ హైస్కూల్‌ పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తుమ్మల తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించారు. 

సామాజిక ప్రజాస్వామ్యం కావాలి :

పేదరిక నిర్మూలన బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వాలపై ఉంచింద ని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. అయితే, ఈ బాధ్యత ప్రభుత్వానిదే అనుకుంటే పొరపాటని, ఉన్నవారు లేనివారనే తేడా లేకుండా ఒకరికొకరు సాయం చేసుకున్నప్పుడే పేదరికం పోయి అభివృద్ధి సాకారమవుతుందన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ నేటికీ కూడు, గుడ్డ లేని పేదలు ఎందరో ఉన్నారు. దేశంలో రోజుకు ఏడువేల మంది, ఏడాదికి 28 లక్షల మంది తినటానికి తిండిలేక చనిపోతున్నారంటే ఎంత సంక్షోభ పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతోంది’’ అన్నారు.

‘‘ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు. మేమంతా ప్రభుత్వ బడుల్లో చదివే ఈ స్థాయికి వచ్చాం. అహం, ఈర్ష్యాద్వేషాలను పక్కన పెట్టినప్పుడే జీవితంలో పైకి ఎదగగలుగుతాం’’ 

- జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

Post a Comment

0 Comments