గ్రామీణ విద్యార్థుల్లోనూ ఉత్తమ ప్రతిభ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులతో సమానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులూ మంచి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించగలరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్‌వివి హైస్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముద్రించిన సావనీర్‌ను నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఆవిష్కరించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారు తక్కువ, కార్పొరేట్ కళాశాలల్లో చదివిన వారు ఎక్కువ అనే అభిప్రాయాన్ని విడనాడాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదవడం మాత్రమే నేర్పుతారని, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో సమాజంలో ఎలా జీవించాలో నేర్పుతారని, అందుకు తామే ఉదాహరణని తెలిపారు. తాను గ్రామీణ ప్రాంతంలో సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చానని, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వారేనని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ రెహమాన్, పాఠశాల అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఎర్రా నాగేశ్వరరావు, కార్యకర్శి తుమ్మల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
0 Comments