ఒమిక్రాన్ సహా అన్ని వేరియంట్లకూ చెక్ : సమర్థ యాంటీబాడీలను గుర్తించిన శాస్త్రవేత్తలు
కొవిడ్ మహమ్మారిపై మానవాళి పోరును మేలి మలుపు తిప్పే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఒమిక్రాన్ సహా కరోనా వైరస్‌లలోని ఏ వేరియంట్‌నైనాసరే సమర్థంగా అంతం చేయగల యాంటీబాడీలను గుర్తించారు. ‘‘కరోనా బారినపడి కోలుకున్నవారు, టీకా రెండు డోసులు తీసుకున్నవారి నుంచి యాంటీబాడీలను మేం అధిక సంఖ్యలో సేకరించాం. అనంతరం- ప్రతిరూపాలను ఉత్పత్తి చేయలేని సూడోవైరస్ ద్వారా.. స్పైక్ ప్రొటీన్‌లను సృష్టించాం. ఆ స్పైక్ ప్రొటీన్‌లపై వివిధ రకాల యాంటీబాడీలను ప్రయోగించి పరిశీలించాం. నాలుగు రకాల యాంటీబాడీల పనితీరు మాకు ఆశ్చర్యం కలిగించింది. స్పైక్ ప్రొటీన్‌లో నాలుగు ప్రత్యేక ప్రాంతాలు ఉత్పరివర్తనాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. వాటిలో ఓ ప్రాంతాన్ని ఈ నాలుగు రకాల యాంటీబాడీలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తద్వారా అన్ని రకాల కరోనా వేరియంట్లను అంతం చేస్తున్నాయి. స్థిరంగా ఉండే ఆ నాలుగు ప్రాంతాలు కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్‌లో మాత్రమే కాకుండా అన్ని కరోనా వైరస్‌లలోనూ కనిపిస్తాయి. కాబట్టి వాటన్నింటినీ అడ్డుకోగల టీకాలు, యాంటీబాడీ చికిత్సలను అభివృద్ధి చేసేందుకు మా అధ్యయనం బాటలు పరుస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త డేవిడ్ వీస్లర్ తెలిపారు.
0 Comments