GET MORE DETAILS

Omicron: ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీలు. మూడో డోస్‌తో ప్రయోజనం : తాజా అధ్యయనంలో మెరుగైన ఫలితాలు.

 Omicron: ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీలు. మూడో డోస్‌తో ప్రయోజనం : తాజా అధ్యయనంలో మెరుగైన ఫలితాలు.



ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి రోజురోజుకు రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూనే ఉంది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, చికిత్సా విధానాల పనితీరుకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌తోపాటు ఇతర కరోనావైరస్‌ వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఒమిక్రాన్‌నే కాకుండా భవిష్యత్తులో వెలుగుచూసే వివిధ వేరియంట్లను ఎదుర్కొనే వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సల రూపకల్పనలో ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాజా అధ్యయనం జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

వైరస్‌ మ్యుటేషన్‌ చెందినప్పటికీ మార్పులకు గురికాని స్పైక్‌ ప్రొటీన్‌లోని ప్రధాన భాగాలను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా వైరస్‌ నిరంతర పరిణామక్రమాన్ని అధిగమించేందుకు మార్గం దొరికినట్లేనని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ వీస్లెర్‌ పేర్కొన్నారు. వీటివల్ల కేవలం ఒక్క ఒమిక్రాన్‌నే కాకుండా ఇతర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సల రూపకల్పనకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు*

అధిక మ్యుటేషన్లు...

అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తోన్న ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ప్రొటీన్‌లో దాదాపు 37 మ్యుటేషన్లు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మానవ కణాలను తేలికగా బంధించి వాటిలోకి చొచ్చుకుపోతూ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్లు కనుగొన్నారు. ఇలా భారీ స్థాయిలో మ్యుటేషన్లకు గురికావడం వల్లే వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పాటు ఇదివరకు వైరస్‌ సోకిన వారు కూడా రీ-ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని స్పైక్‌ప్రొటీన్‌ మానవ కణాలకు ఎలా అంటుకున్నాయో తెలుసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని డేవిడ్‌ వీస్లెర్‌ పేర్కొన్నారు.

మ్యుటేషన్ల ప్రభావాన్ని అంచనా వేయడంపై పరిశోధనలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు.. కరోనా వైరస్‌ మాదిరిగా స్పైక్‌ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేందుకు పునరుత్పత్తి కాలేని ‘సుడో వైరస్‌’ను తయారు చేశారు. వీటితోపాటు ఒమిక్రాన్‌ మ్యుటేషన్ల స్పైక్‌ ప్రొటీన్‌లతోపాటు అంతకుముందు వెలుగుచూసిన ఇతర వేరియంట్‌ల స్పైక్‌ ప్రొటీన్లనూ సృష్టించారు. వీటిపై ప్రయోగాలు జరిపిన పరిశోధకులు.. మానవ కణాలను ఈ స్పైక్‌ ప్రొటీన్లు ఏవిధంగా బంధిస్తున్నాయో పరిశీలించారు. వైరస్‌ తొలినాళ్లనాటి స్పైక్‌ ప్రొటీన్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌ 2.4రెట్లు అధికంగా కణాలకు అంటుకొని ఉంటున్నట్లు కనుగొన్నారు.

మూడో డోసు ప్రయోజనమే...

అనంతరం వీటిపై గతంలో ఇతర రకాల వైరస్‌లు సోకిన బాధితులు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి సేకరించిన యాంటీబాడీలు ఏవిధంగా నిరోధిస్తున్నాయో పరిశీలించారు. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న వారితోపాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తున్నట్లు గుర్తించారు. మోడెర్నా, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) రెండు డోసుల్లో తీసుకున్న వారిలోనూ పలు వేరియంట్లను తటస్థీకరిస్తున్నట్లు కనుగొన్నారు. ఇలా ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో థర్డ్‌డోసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. వీటితోపాటు యాంటీబాడీ చికిత్సలపై పరిశోధనలు చేశారు. ఇతర వేరియంట్లను తటస్థీకరించడంలో యాంటీబాడీలు కూడా సమర్థంగానే పనిచేస్తున్నట్లు గుర్తించిన పరిశోధకులు.. భిన్న రకాల వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్లు, యాంటీబాడీ చికిత్సలను రూపొందించడంలో తాజా పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments