GET MORE DETAILS

ఐదుగురు తెలుగువారికి ‘సుప్రీం’ సీనియర్‌ న్యాయవాది హోదా

 ఐదుగురు తెలుగువారికి ‘సుప్రీం’ సీనియర్‌ న్యాయవాది హోదా




సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులుగా ఐదుగురు తెలుగువారు నియమితులయ్యారు. వీరిలో ముగ్గురు న్యాయవాదులు, మరో ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఈనెల 8న సమావేశమైన ఫుల్‌కోర్టు మొత్తం 18 మంది న్యాయవాదులు, ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులకు సీనియర్‌ న్యాయవాదుల హోదా కల్పించింది. న్యాయవాదులుగా సుదీర్ఘ అనుభవం, ఆయా అంశాల్లో నైపుణ్యం ఆధారంగా ఈ హోదా కల్పిస్తారు.

న్యాయవాదుల నుంచి ఈ హోదా పొందిన వారిలో తెలంగాణ నుంచి పి.నిరూప్‌ ఉన్నారు. పూర్వ మెదక్‌ జిల్లాకు చెందిన ఆయన ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి పి.రామచంద్రారెడ్డి కుమారుడు. మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఆయనకు పర్యావరణ, మౌలిక వసతులు, భూ, సాగు, రాజ్యాంగపరమైన పలు అంశాల్లో విశేషమైన పట్టు ఉంది.  

ఒడిశాలోని బరంపురం పట్టణానికి చెందిన యడవిల్లి ప్రభాకరరావు (69) పూర్వీకులది శ్రీకాకుళం జిల్లా సోంపేట. 1980 నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. ఎఫ్‌సీఐ, ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వంలోని వివిధ శాఖలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గానూ వ్యవహరించారు. సివిల్‌, క్రిమినల్‌, ట్యాక్సేషన్‌ కేసుల్లో నిపుణులు. ఆయన తండ్రి సన్యాసిరావు ఒడిశా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది.

న్యాయవాద జాబితాలో ఈ హోదా పొందిన కృష్ణా జిల్లాకు చెందిన ఎ.డి.ఎన్‌.రావు 1988లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆయన తండ్రి అన్నం సుబ్బారావు కూడా సుప్రీంకోర్టు న్యాయవాదే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, జస్టిస్‌ నౌషద్‌ అలీలు కూడా సీనియర్‌ న్యాయవాదులుగా నియమితులయ్యారు. నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పట్నా హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు.

Post a Comment

0 Comments