GET MORE DETAILS

ఉద్యోగ ప‌రీక్ష‌ల్లో కంప్యూటర్ హ్యాకింగ్‌.. హైటెక్ కాపీయింగ్‌తో వంద‌ల మంది పాస్.. అదెలాచేశారంటే...

 ఉద్యోగ ప‌రీక్ష‌ల్లో కంప్యూటర్ హ్యాకింగ్‌.. హైటెక్ కాపీయింగ్‌తో వంద‌ల మంది పాస్.. అదెలాచేశారంటే...



ప్రభుత్వ ఉద్యోగ ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్థుల‌కు హైటెక్ కాపీయింగ్ ద్వారా పాస్ చేయించే ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ప‌నితీరును చూసి పోలీసులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ముఠాలో మొత్తం అయిదు మంది ఉండ‌గా.. ఒక‌రు ప‌రీక్ష రాసే మాస్ట‌ర్ మైండ్, ఇద్ద‌రు లావాదేవీల‌ను జ‌రుపుతుంటారు, మ‌రో ఇద్ద‌రు పరీక్ష స‌మ‌యంలో వ‌చ్చే అడ్డంకుల‌ను తొల‌గిస్తుంటారని పోలీసులు చెప్పారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ప‌రీక్షలకు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థులను క‌నుగొని వారికి అత్య‌ధిక మార్కులతో పరీక్షలు పాస్ చేయించడమే ఈ ముఠా పని. చాలా చాక‌చ‌క్యంగా కాపియింగ్ జ‌రిగే విధానం గురించి పోలీసులు మాట్లాడుతూ.. నేవీ కోస్ట్ గార్డ్, సెంట్ర‌ల్ ఎయిర్ మెన్ సెలెక్ష‌న్ బోర్డ్, ఆర్‌పిఎఫ్, యుజిసి నెట్, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ఫారెస్ట్ గార్డ్ వంటి ఉద్యోగ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌ జాబితాను కోచింగ్ సెంట‌ర్ల నుంచి సేక‌రించి అభ్య‌ర్థుల‌ను నిందితులు సంప్ర‌దించేవారు. ఒక్కో అభ్య‌ర్థి వ‌ద్ద రూ.5 ల‌క్ష‌ల దాకా తీసుకొనేవారు. ఆ డబ్బుని దుబాయ్, సింగ‌పూర్ బ్యాంక్ అకౌంట్ల‌లో అభ్య‌ర్థులు జ‌మ‌చేసేవారు. ప్ర‌తి అభ్య‌ర్థికి 90 శాతానికి పైగా మార్కులు తెచ్చిపెట్టేవారు.

ప‌రీక్ష స‌మ‌యంలో అభ్య‌ర్థి ప‌రీక్ష సెంట‌ర్‌లో కంప్యూట‌ర్ ముందు కూర్చొని ఉండ‌గా.. ఆ కంప్యూట‌ర్‌ని హ్యాక్ చేసి మ‌రో చోట నుంచి ముఠా స‌భ్యుడు ప‌రీక్ష రాసేవాడు. ఇందుకోసం ఆ ముఠా ఒక హైటెక్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకొంది. రెండు గంటల్లో రాయాల్సిన ప‌రీక్ష‌ని కేవలం 20 నుంచి 30 నిమిషాల‌లో ముగించేవాళ్లు. ఇటీవ‌ల యూపిటెట్ ప‌రీక్షా ప‌త్రం లీక్ కావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు త్వ‌ర‌గా ప‌రీక్ష ముగించి.. ఎక్కువ పాస్ మార్కులు పొందిన అభ్య‌ర్ధుల‌ను అనుమానించి విచార‌ణ చేయ‌గా.. ముఠా గుట్టు తెలిసింది.

ఈ హైటెక్ కాపీయింగ్ మాస్ట‌ర్ మైండ్ గ‌తంలో పోలీసు ఉద్యోగం చేసి అధిక డ‌బ్బు సంపాదించాల‌నే క్ర‌మంలో కాపీయింగ్ ముఠా ప్రారంభించాడు. దీనికోసం గ‌తంలో ఐఐటీ విద్యార్థుల నంచి కంప్యూట‌ర్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు. ఈ కాపీయింగ్ బిజినెస్ కోసం పంజాబ్‌లోని మొహాలీలో నిందితుల‌కు ఒక ల్యాబ్ ఉంద‌ని, ఇప్ప‌టికే వంద‌ల మందిని ప‌రీక్ష‌లు పాస్ చేయించి ఉద్యోగాలు ఇప్పించార‌ని పోలీసులు తెలిపారు

Post a Comment

0 Comments