GET MORE DETAILS

విదేశీ ఉద్యోగాలు _ కరోనా ఆంక్షలు ఉన్నా సరే తగ్గని భారతీయుల జోరు

 విదేశీ ఉద్యోగాలు _ కరోనా ఆంక్షలు ఉన్నా సరే తగ్గని భారతీయుల జోరు




ఒమైక్రాన్‌తో కరోనా మూడో వేవ్ వస్తుందనే భయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కఠినతరం అవుతున్నాయి. అయితే.. విదేశీ ఉద్యోగాలపై అమితాసక్తితో ఉన్న భారతీయుల ఉత్సాహాన్ని ఈ ఆంక్షలేవీ నీరుగార్చ లేకపోయాయని ప్రముఖ జాబ్ వెబ్‌సైట్ ఇండీడ్ జరిపిన తాజా అధ్యయనం తేల్చింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఇండీడ్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అమెరికా, బ్రిటన్, కెనడా, మధ్యప్రాచ్య దేశాల్లోని ఉద్యోగావకాశాల పట్ల భారతీయులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. 

నవంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 మధ్య కాలంలో విదేశీ ఉద్యోగాల కోసం సెర్చ్ చేసిన వారి సంఖ్య ఏకంగా 72 శాతం పెరిగింది. ఆ తరువాత వచ్చిన కరోనా సంక్షోభం కారణంగా ఇది తగ్గిపోయినప్పటికీ ఆ తరువాత మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ ముప్పు పొంచి ఉన్న తరుణంలోనూ భారతీయుల్లో విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ నివేదికలోని గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులకు విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నట్టే వివిధ దేశాల్లో భారతీయుల ప్రతిభాసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తోంది’’ అని ఇండీడ్ ఇండియా సేల్స్ విభాగం ఇన్‌చార్జ్ పేర్కొన్నారు. 

ఇండీడ్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. దాదాపు 40 శాతం మంది భారతీయులు అమెరికా ఉద్యోగాల వైపే మొగ్గు చూపారు. ఆ తరువాతి స్థానాల్లో కెనడా(16 శాతం), యూఏఈ( 14 శాతం), బ్రిటన్(14 శాతం) ఉన్నాయి. మరోవైపు.. అత్యధిక శాతం భారతీయులు టెక్ రంగంలోని ఉద్యోగాల కోసమే వెతికారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఫుల్‌స్టాక్ డెవలపర్, డాటా అనలిస్ట్ ఉద్యోగాలకు భారతీయులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక డ్రైవర్లు వంటి శారీరక శ్రమ అవసరమైన ఉద్యోగాలు(బ్లూకాలర్) కోరుకునే వారు గల్ఫ్‌లో అవకాశాలను వెతుక్కుంటున్నారు.  2019 నవంబర్ నుంచి 2021 ఆక్టోబర్  మధ్య కాలంలో ఇండీడ్ వెబ్‌సైట్‌పై భారతీయులు జరిపిన సెర్చ్ ఫలితాల విశ్లేషణ ద్వారా ‘ఇండీడ్’ ఈ నివేదిక వెలువరించింది.

Post a Comment

0 Comments