Omicron : వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకోవు _ WHO ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్
‘ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను అడ్డుకుంటాయా?’.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషిస్తోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు.
‘ఒమిక్రాన్‌పై కొవిడ్ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయా? లేదా? అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఒమిక్రాన్‌లో బహుళ సంఖ్యలో ఉత్పరివర్తనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలవని భావించడం సరైందే. అయితే, వ్యాక్సిన్లను ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. టీకాలు తీసుకున్నా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా వారికే బూస్టర్ డోస్ ఇవ్వాలి. ప్రస్తుతం బూస్టర్ డోసు వల్ల కలిగే ప్రయోజనాలు.. ప్రాథమిక వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నారు’’అని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు.
0 Comments