GET MORE DETAILS

పుస్తక ప్రియుల పాదయాత్ర నేడు : పఠనాసక్తిని పెంచేందుకు విజయవాడలో ర్యాలీ

పుస్తక ప్రియుల పాదయాత్ర నేడు : పఠనాసక్తిని పెంచేందుకు విజయవాడలో ర్యాలీ



ఈనాడు, అమరావతి: విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా పఠనంపై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు మంగళవారం నగరంలో పుస్తక ప్రియులు పాదయాత్ర నిర్వహించనున్నారు. 1992 నుంచి ఏటా జనవరి 4న పుస్తక ప్రియులు క్రమం తప్పకుండా ర్యాలీ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు ఎంతో చరిత్ర ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో మొదటిసారి యాత్ర జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో ప్రముఖులు పాదయాత్రలో పాల్గొన్నారు. జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, ముళ్లపూడి వెంకటరమణ, కాళోజి నారాయణరావు, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు, ఎందరో ఐఏఎస్‌ అధికారులు ఇందులో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోల్‌కతా పుస్తక ప్రదర్శన నుంచి ఈ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారు. 1992లో నిర్వహించిన విజయవాడ మూడో పుస్తక మహోత్సవానికి ముందు కోల్‌కతాకు ఇక్కడి నుంచి ఓ బృందం వెళ్లింది. అక్కడ అగ్ర దర్శకుడు సత్యజిత్‌రే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వాక్‌ ఫర్‌ బుక్స్‌ ర్యాలీ వారికి బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితో ఇక్కడి పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్రను ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా నాయకత్వం వహించనున్నారు.

ఆకర్షిస్తున్న శ్రీశ్రీ మహాప్రస్థానం :

పుస్తక మహోత్సవంలోని విశాలాంధ్ర స్టాల్‌లో ఉంచిన శ్రీశ్రీ మహాప్రస్థానం భారీ సైజు పుస్తకం అందరినీ ఆకర్షిస్తోంది. ‘మహాప్రస్థానం’ ప్రచురించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శ్రీశ్రీ ప్రింటర్స్‌ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని మూడు నెలల కిందట ప్రచురించారు. 36× 49 సెం.మీ.(14×19 అంగుళాలు) పరిమాణంలో ముద్రించారు. ప్రతి పేజీ ఆకర్షణీయంగా ఉండేలా చిత్రకారుడు అరవెల్లి గిరిధర్‌తో పెయింటింగ్స్‌ వేయించారు. రూ.900 ధర ఉన్న పుస్తకాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Post a Comment

0 Comments