కోలుకున్నా కొందరిలో తీవ్ర దుష్ప్రభావం
ఉన్నట్టుండి రక్తం గడ్డ కడుతుండడంతో ప్రాణాపాయం
ఈ తరహా కరోనా బాధితుల్లో ముందస్తుగా ఔషధ చికిత్స
అయితే అత్యధికుల్లో స్వల్ప లక్షణాలే
కొన్ని జాగ్రత్తలతో ముప్పు తప్పించవచ్చంటున్న నిపుణులు
రెండోదశలో డెల్టా వేరియంట్ పెట్టిన కష్టాలతో పోల్చితే మూడో దశలో ఒమిక్రాన్‌తో పడుతున్న బాధలు తక్కువే. అత్యధికులు 3-4 రోజుల్లోనే కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ అత్యధిక శాతం మందిలో గొంతు వరకే పరిమితమవుతుండటంతో ఆసుపత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి. కొందరిలో జబ్బు తగ్గినా.. తీవ్రమైన లక్షణాల బారిన పడుతున్నారు. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, హఠాత్తుగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులకు గురవుతున్నారు. ఈలక్షణాలను త్వరగా గుర్తిస్తే.. ప్రాణాపాయ ముప్పు నుంచి తప్పించడానికి వీలుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. నెల కిందట కొవిడ్ బారినపడిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దనే చికిత్స పొంది కోలుకున్నారు. సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోవడంతో.. కొవిడ్ చికిత్సానంతరం సమస్యలేమైనా వచ్చాయా? అనే అంశం వైద్యవర్గాల్లో చర్చకొచ్చింది. కొవిడ్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యనిపుణులతో ప్రత్యేక కథనం.
ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి(45)కి కాళ్లు విపరీతంగా లాగుతుండడంతో వైద్యుడిని సంప్రదించారు. పరీక్షల్లో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తించారు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి గడ్డలను తొలగించారు. లేదంటే అవి గుండెలోకి చేరి పెనుముప్పునకు దారితీసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
స్వల్ప లక్షణాలతో కొవిడ్ నుంచి బయటపడిన బాధితుడు(50) దగ్గు, తలనొప్పి, నీరసంతో బాధపడుతున్నారు 4 వారాలైనా కరోనా బాధలు తగ్గకపోవడంతో వైద్యుడిని సంప్రదించారు. పరీక్షలన్నీ సాధారణంగానే ఉండడంతో.. లక్షణాలకు తగ్గట్లుగా మందులు రాసిచ్చారు డాక్టరు. ఈ లక్షణాలు మరికొన్నాళ్లు ఉంటాయని చెప్పారు.
కొవిడ్ చికిత్సానంతర జాగ్రత్తలు :
కరోనా వచ్చి తగ్గాక నీళ్లు బాగా తాగాలి. తద్వారా రక్తం చిక్కబడడం.. గడ్డకట్డడం వంటివి తగ్గే అవకాశాలుంటాయి. డీడైమర్ పరీక్ష చేయించుకోవడం మేలు చేస్తుంది. బాగా ఆయాసం, కాళ్ల వాపులు, నొప్పులు, కాళ్లు లాగేసినట్లు, పిక్కలు పట్టేసినట్లు ఉండడం వంటి లక్షణాలున్న వారిలో ఒకసారి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
వేర్వేరు రూపాల్లో గుండెపై దుష్ప్రభావం :
కొందరిలో రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొవిడ్ చికిత్స తర్వాత ఇలాంటి వారిలో ఉన్నట్టుండి కాలి సిరల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. ఈ గడ్డలు హృదయం వరకూ చేరుకొని.. అక్కణ్నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో గుండె ఆగిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చు. దీన్నే ‘పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం’ అంటారు. కాలి సిరల్లో రక్తం గడ్డకట్టి, గుండె ఆగిపోవడానికి మధ్య వ్యవధి..కొన్నిసార్లు నిమిషాలే పట్టవచ్చు. అందుకే ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంటారు. రెండోదశలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా చూశాం. మూడోదశలో ఇలాంటివి చాలా తక్కువ. ఇది కాకుండా గుండె రక్తనాళాల్లో చిన్న చిన్న పూడికలున్నా కూడా.. వీరిలో ఉన్నట్టుండి రక్తనాళం పూడిపోయి హఠాత్తుగా తీవ్ర గుండెనొప్పి వస్తుంది. కొవిడ్ నేరుగా గుండెపైనా, హృదయ కండరంపైనా ప్రభావం చూపుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ను ‘మయో కార్డియైటిస్’ అంటారు. ఇలాంటి వారిలో ఉన్నట్టుండి గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చి.. ఆగిపోయే అవకాశాలుంటాయి. కొవిడ్ తర్వాత కొందరిలో నేరుగా గుండె కొట్టుకోవడంలోనే తేడాలు కూడా వస్తాయి. సాధారణంగా కరోనా బారినపడి కోలుకున్న తర్వాత.. డీ డైమర్ పరీక్ష చేయిస్తే కొంతవరకూ ముందే కనుగొనవచ్చు. డీ డైమర్ చాలా ఎక్కువగా ఉంటే.. కొద్దిరోజుల పాటు రక్తం పలచన చేసే ఔషధాలను ఇవ్వాలి. కొందరిలో కరోనా తగ్గాక.. ఒకటి రెండు వారాల్లో డీ డైమర్ సాధారణ స్థితికి చేరుతుంది. మరికొందరిలో మూణ్నాలుగు నెలలు కూడా పడుతుంది.
- డాక్టర్ రమేశ్ గూడపాటి, సీనియర్ కార్డియాలజిస్ట్, స్టార్ హాస్పిటల్
కాలి సిరల్లో గడ్డలతో ప్రమాదం :
కొవిడ్ చికిత్సానంతరం ఎక్కువమంది కీళ్లనొప్పులు, దగ్గు, ఆందోళన, కుంగుబాటు, మతిమరుపు, నిద్రపట్టకపోవడం, కాళ్లు చేతులు లాగడం, తలనొప్పి, పనిలో ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలతో వస్తున్నారు. అయితే ఇవన్నీ సాధారణ లక్షణాలే. కొద్దికాలం మందులు వాడితే తగ్గిపోతాయి. కొన్నిసార్లు మాత్రం కొవిడ్ చికిత్సానంతరం తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో అనారోగ్యం బారినపడిన రోగుల్లో రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతోంది. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో.. వయసు పైబడినవారిలో తీవ్రంగా వస్తోంది. కొవిడ్ తర్వాత గుండె, మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడవచ్చు. తద్వారా గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయి. రెండోదశ ఉద్ధృతితో పోల్చితే ఒమిక్రాన్‌లో రక్తం గడ్డకట్టే స్వభావం తగ్గింది. కొవిడ్ నుంచి కోలుకోగానే కొన్నిసార్లు శారీరకంగా ఎక్కువగా శ్రమిస్తున్నారు. తగినంతగా నీరు తాగకపోతే ఒంట్లో నుంచి నీరు, ద్రావణాలు బయటకు వెళ్లి రక్తం చిక్కబడుతుంది. 4 గంటల కంటే ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు.. కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలున్నాయి. దీన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఇది సిరల ద్వారా గుండెలోకి వెళ్లి అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తనాళాల్లో చిక్కుకుంటే.. తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. కొందరిలో ఆక్సిజన్ శాతం బానే ఉన్నా పరీక్షల్లో డీ డైమర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. వీరికి రక్తం పలచన చేసే ఔషధాలిస్తున్నాం. కొవిడ్ చికిత్స అనంతరం అధిక రక్తపోటు, మధుమేహం తదితరాలను అదుపులో ఉంచుకోవాలి.
- డాక్టర్ ఎంవీ రావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద ఆసుపత్రి
0 Comments