హోలీ పండుగ రోజు భార్య మాంసం వండలేదట.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు
అత్యవసర సమయంలో బాధితులు ఫోన్ చేసి సాయం పొందేందుకు ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ను దుర్వినియోగం చేశాడో వ్యక్తి. మాంసం తెచ్చి వండమంటే వండలేదంటూ డయల్ 100కు ఫోన్ చేసి భార్యపై ఫిర్యాదు చేశాడో భర్త. నల్గొండ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని చర్లగౌరారానికి చెందిన ఓర్సు నవీన్ హోలీ పండుగ రోజు డయల్ 100కు ఆరుసార్లు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద అతడి ఇంటికి చేరుకున్నారు.
విషయం ఏంటని ఆరా తీయగా పండగ రోజు తన భార్య మాంసం వండి పెట్టలేదని మద్యం మత్తులో తీరిగ్గా చెప్పాడు. అతడు చెప్పింది విన్న పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని నవీన్‌ను హెచ్చరించారు. పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. డయల్ 100ను ఆపద సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని, అనవసరంగా ఫోన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
0 Comments