GET MORE DETAILS

చిట్టి గువ్వా! నీ చిరునామా ఎక్కడ...? మార్చి 20 పిచ్చుకల దినోత్సవం.

 చిట్టి గువ్వా! నీ చిరునామా ఎక్కడ...? మార్చి 20 పిచ్చుకల దినోత్సవం.ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైంది. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి

ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం మరియు జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తెరిగి,  ఊరపిచ్చుకలు  మరి ఇతర పక్షులను సంరక్షించాలన్న లక్ష్యంతో మనం చేయాల్సిందల్లా...

● మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా వున్నా మొక్కలు, చెట్లు పెంచడం.

● ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటుచేయడం. మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం.

● ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం.

తెల్లవారక ముందే చెట్లమీద కిచకిచమంటూ సూర్యోదయానికి స్వాగతాలు... అందరూ పనులకు సమాయత్తం కావాలన్న సూచనలు...

పంట చేళ్ళలోనూ, కల్లాలలోనూ, ఇంటి ముంగిట వాటి కిచకిచలతో.. పిల్లలకు, పెద్దలకు వాటి అరుపులు ఉత్సాహం, ఆనందాన్ని పంచేవి. అవే పిచ్చుకలు. 

ఒకనాడు పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా తమదే రాజ్యం అన్న చందంగా వ్యవహరించేవి.

 రైతన్న పంట పండగానే వరి, జొన్న, సజ్జ వంటి కంకులను తనకు మేలు చేస్తున్న ఊరపిచ్చుకల కోసమని తన ఇళ్ళలో వేలాడదీసేవారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఊర పిచ్చుకలు నేడు తమ ఉనికిని కోల్పోతూ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. 

ప్రకృతిలో, మానవ జీవితంతో విడదీయని అనుబంధాన్ని కలిగిఉండే ఊరపిచ్చుకల దినోత్సవ వేడుకలను నేడు పక్షి ప్రేమికులు జరుపుకుంటున్నారు.

మానవునికి, పక్షులకు విడ దీయరాని అనుబంధాలు. ఒక్కొక్క పక్షిది ఒక్కొక్క రకమైన అనుబంధమైతే ఊరపిచ్చుకలది మానవుడితో విడదీయరాని అనుబంధం. ప్రకృతిలో పక్షిజాతి, మానవజాతి ఏర్పడినప్పటి నుంచి ఈ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో మానవులకు, పక్షులకు మధ్య అనుబంధం తెగుతోంది. ప్రత్యేకించి ఊరపిచ్చుకలు రైతులతో, రైతు కుటుంబాలతో ఉన్న అనుబంధం అంతా, ఇంతా కాదు. పిల్లలు, పెద్దలు అన్నతేడా లేకుండా అందరి మధ్య తమదైన ప్రత్యేకతను చాటుతూ రివ్వురివ్వున ఎగురుతూ ఉండేవి. 

పంటలు పండగానే రైతన్నలు తమకు అన్ని విధాలా మేలు చేస్తున్న పిచ్చుకలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని జొన్న, వరి, సజ్జ వంటి కంకులను తమ ఇళ్ళలో వేలాడదీసేవారు. ఆ గింజలు తిని ఆ ఇంటి ముంగిట ఉన్న తొట్లలో లేదా, కుండలలో ఉండే నీటిని తాగేవి. ఆపై చేదురు బావుల వద్దకు చేరుకొని వేసవిలో అక్కడ నిలువ ఉండే నీటిలోనూ, పారే కాలువలలోనూ మునిగి తేలుతూ చేసే సందడి అంతా ఇంతాకాదు. అటువంటి ఆ పిచ్చుకల కిచకిచలు వినిపించని పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో నాలుగైదు సంవత్సరాలలో ఒక్క పిచ్చుక కూడా కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

పాసర్ డొమెస్కిస్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఊరపిచ్చుక రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తూనే వాతావరణ పరిరక్షణ లోనూ, ఆహారపు గొలుసులోనూ తమవంతు పాత్రను నిర్వహించేవి.

15 సంవత్సరాల క్రితం వరకు పంట చేళ్ళలోనూ, ఇండ్లలోనూ సందడి, సందడిగా కనిపించే ఊరపిచ్చుకలు పంటచేళ్ళకు హానికలిగించే క్రిమికీటకాదులను తినివేసి అధిక పంట రైతు చేతికి రావ డానికి తమవంతు పాత్రను నిర్వహించేవి. 

రైతులకు మిత్రులుగా ఉండడంతో పాటు పిల్లలకు వినోదాన్ని కలిగించేవి. గద్దలు, పాముల వంటి వాటికి ఆహారమవుతూ ఆహారపు గొలుసులో తనవంతు పాత్రను నిర్వహించేవి. అటువంటి పిచ్చుకలు తమ ఇళ్ళలో గూళ్లు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను తయారు చేసుకునేలా అవకాశాలను రైతులు, పల్లె ప్రజలు కల్పించేవారు. అప్పట్లో ఉండే పూరి గుడిసెలు, మిద్దెలలో గూళ్లు అల్లుకొని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగేవి. 

బయటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి తమ పిల్లలకు ఆహారం పెట్టే దృశ్యాలు, మాతృత్వపు మమకారాలను చాటేవి.

 ఆరుబయట ఆరబోసిన ధాన్యాలను తినేందుకు వచ్చినప్పుడు పిల్లలు చాటలను అడ్డంపెట్టి తాడు సహాయంతో ఆ చాటను లాగి పిచ్చుకలు చాటకింద పడగానే ఉత్సాహంగా వాటిని పట్టుకొని పసుపు, కుంకాలను రాసి ఉత్సాహంగా వాటిని వదిలేసి కేరింతలు కొట్టడం... తిరిగి అవి మరుసటి రోజు కనిపించగానే అదోరకమైన ఆనందానుభూతిని పొందేవారు. ఇళ్ళల్లో ఉండే అద్దాలను చూసుకుంటూ ఆ పిచ్చుకలు అక్కడ కనిపిస్తున్న దృశ్యం తనదేనని గుర్తించక అద్దాలను పొడిచే దృశ్యాలు ఆకట్టుకునేవి. ఇటువంటి దృశ్యాలు అటుంచి కనీసం పిచ్చుకలు కనిపించని పరిస్థితులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. 

రేడియేషన్, క్రిమి సంహారక మందులతో కనుమరుగు : 

ఊరపిచ్చుకలతో పాటు అనేక పక్షిజాతులు అంతరించిపోవడానికి ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ప్రధాన కారణమని పలువురు జంతుశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

సెల్‌ఫోన్ టవర్లు, ఇతర రేడియేషన్ కలిగించే అంశాలు ఊరపిచ్చుకలు అంతరించిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ రేడియేషన్ కారణంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యాలను పిచ్చుకలు కోల్పోతున్నాయి. వీటితో పాటు సహజసిద్ధమైన ఎరువులను రైతులు పొలాలలో వాడకుండా రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను వాడడం, చనిపోయిన క్రిమికీటకాలను తిని పిచ్చుకలు విషపూరితమై మరణిస్తున్నాయి. 

వీటికి తోడు ఇళ్ళల్లో అవి నివసించడానికి ఏర్పాట్లు లేకపోవడం, కనీసం ధాన్యం, మంచినీరు కూడా లభించని పరిస్థితులు ఉండడంతో ఈ జాతి పక్షులు అంతరిస్తున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

2011 నుంచి పిచ్చుకల దినోత్సవ వేడుకలు భూగోళంలో  అంతరించి పోతున్న పక్షిజాతులలో పిచ్చుకలు మొదటిస్థానంలో ఉన్నట్లు పరిశోధనల ద్వారా పలువురు గుర్తించారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వారు ఈ ప్రమాదాన్ని గుర్తించి పిచ్చుకలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహ్మద్ దిలావర్ అనే పక్షి సంరక్షణ ఉద్యమకారుడు ఇందుకు తనవంతు పాత్రను నిర్వహించారు.

 ఈ కారణంగానే 2011 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 20న పిచ్చుకల దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతియేటా వేడుకలను నిర్వహిస్తున్నారు. 

Post a Comment

0 Comments