GET MORE DETAILS

China: చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లోకి - వణికిస్తున్న ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’

 China: చైనాలో 3 కోట్ల మంది లాక్‌డౌన్‌ లోకి - వణికిస్తున్న ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’




రెండేళ్ల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసులు

13 నగరాల్లో కఠిన ఆంక్షలు

కరోనా వైరస్‌ తొలిసారి బయటపడిన చైనాను ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ రూపంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు రెట్టింపయ్యాయి. కొత్తకేసు ఒక్కటీ రాకూడదన్న(జీరో-టాలరెన్స్‌) వ్యూహంతో.. రెండేళ్లకు పైగా కొవిడ్‌ను కట్టడి చేస్తూ వస్తున్న డ్రాగన్‌కు ఈ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. చైనాలో 2020 ఫిబ్రవరి 12న అత్యధికంగా దాదాపు 15 వేల కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాతి రోజున 5,090 కేసులు నమోదయ్యాయి.ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను మూసివేసింది. 3 కోట్ల మందికి పైగా ప్రజలను ‘లాక్‌డౌన్‌’లో ఉంచింది. చాలామేర పరిశ్రమలు మూతపడ్డాయి.ప్రజారవాణాను నిలిపివేశారు. ఈమేరకు జిలిన్‌, చాంగ్‌చున్‌, షెన్‌ఝెన్‌, షాంఘై, లాంగ్‌ఫాంగ్‌ నగరాల్లో ఆంక్షలు విధించారు. విస్తృతస్థాయిలో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నగరంతో పాటు, షాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు. సమీప భవిష్యత్తులో లాక్‌డౌన్‌లను సడలించడం అసాధ్యమని చైనా అగ్రశ్రేణి వైద్య నిపుణుడు ఝాంగ్‌ వెన్‌హాంగ్‌ చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఏమిటీ ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ ?

చైనాను వణికిస్తున్న ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ గురించి ఇప్పుడు అధిక సంఖ్యలో ప్రజలు అంతర్జాలంలో వెతుకుతున్నారు. అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు ఉపరకమైన ‘బీఏ.2’ను ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’గా పిలుస్తున్నారు. దీనిపై బ్రిటన్‌ ఆరోగ్య, భద్రత సంస్థ (యూకేహెచ్‌ఎస్‌ఏ) పరిశోధనలు జరుపుతోంది. మూడో వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ మూలరకం కంటే ఇది 1.5 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.  ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’కు సంబంధించి.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఈ వేరియంట్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్‌ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేవు.

దక్షిణ కొరియాలో ‘ఒమిక్రాన్‌’ కల్లోలం :

కొవిడ్‌ను కట్టడి చేయడంలో పేరొందిన దక్షిణ కొరియాలో ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కల్లోలం రేపుతోంది. గత ఏడాది (2021) డిసెంబరు వరకు ఈ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6.3 లక్షలు కాగా.. తాజాగా (మంగళవారం నాటికి) ఆ సంఖ్య 72 లక్షలు దాటింది. వారం రోజులుగా సగటున 3.37 లక్షల రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 293 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కొవిడ్‌మరణాల సంఖ్య 10 వేలు దాటింది. 

Post a Comment

0 Comments