GET MORE DETAILS

అక్షయతృతీయ రోజున బంగారం తప్పక కొనాలా...? నిజమైన అక్షయము ? అక్షయతృతీయ అంటే ఏమిటి? వివరణ?

 అక్షయతృతీయ రోజున బంగారం తప్పక కొనాలా...? నిజమైన అక్షయము ? అక్షయతృతీయ అంటే ఏమిటి? వివరణ?



ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం. అదే రోజున పరశురామ  జయంతి .

మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత :

1. పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా...?

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో  బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. 

ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

అసలు ఈ రోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు.

ఇది కేవలం వ్యాపార జిమ్మిక్ మాత్రమే. అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన ఏ కార్య  ఫలమైనా, [ అది  పుణ్యం కావచ్చు ; లేదా  పాపం  కావచ్చు]. అక్షయంగా,  నిరంతరం, జన్మలతో  సంబంధం లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 

పుణ్య  కర్మలన్నీ విహితమైనవే. అందునా,  ఆ రోజు ఓ  కొత్త  కుండలో గానీ, కూజాలో గానీ,  మంచి నీరు  పోసి,దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన జీవుడికి దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు.

అతిధులకు,అభ్యాగతులకు, పెరుగన్నంతో  కూడిన భోజనం  సమర్పిస్తే, ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన రోజు  రాదు. 

వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.

అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన  ఉత్తర జన్మలలో, వాటికి  లోటు  రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం  చేసుకోవచ్చు. ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. 

ఓ  సారి  పరిశీలిస్తే, భాగవతం ప్రధమ స్కంధం ప్రకారం, పరీక్షిన్మహా రాజు కలి పురుషుడికి ఐదు  నివాస స్థానాలను కేటాయించాడు.  

అవి: 

1)జూదం,  

2)మద్య పానం, 

3)స్త్రీలు, 

4)ప్రాణి వధ,  

5)బంగారం.  

వీటితో పాటు కలి కి  లభించినవి ఇంకో ఐదు...

1)అసత్యం,

2)గర్వం, 

3)కామం, 

4)హింస, 

5)వైరం.  

జాగ్రత్తగా  పరిశీలిస్తే, ఆ పైన  ఉన్న  ఐదిటికీ ఇవి అనుషంగికాలు. ఆ  పై  ఐదిటినీ ఇవి  నీడలా వెన్నంటే  ఉంటాయి.

అక్షయ తృతీయ  రోజు ఎవరైనా, ఈ  ఐదిటిలో దేని  జోలికి  వెళ్ళినా, కలి పురుషుడి దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే  ఉంటుంది.

Post a Comment

0 Comments