GET MORE DETAILS

పవిత్రమైన రోజు అక్షయ తృతీయ

పవిత్రమైన రోజు అక్షయ తృతీయఅక్షయ తృతీయ హిందువులకు, జైనులకు పవిత్రమైన రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే 3వ రోజును అక్షయ తృతీయగా పిలుస్తారు. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ. 'అక్షయ' అనగా సంస్కృతంలో క్షయం కానిది, తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలం. అంతేకాదు సూర్య చంద్రులిద్ద‌రూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజు ఇది. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని.. ఈ రోజు మొత్తం శుభకరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసినవ‌స‌రంలేదని ప్ర‌తీతి.

పురాణ గాథ‌లు :

అక్షయ తృతీయతకు అనేక శాస్త్రాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణుమూర్తి విగ్రహంపై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని పుట్టినరోజు ఈ రోజే . గోవాతో పాటు ఇతర కొంకణ ప్రాంతాలను పరశురామ క్షేత్రాలుగా ఈనాటికీ గుర్తిస్తారు. అక్షయ తృతీయని పరమ పవిత్ర దినంగా అక్కడివారి నమ్ముతారు. త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు మొదలైందనీ, ఆనాడే పవిత్ర గంగానది దివి నుంచి భూమికి దిగి వచ్చిందనీ మరో గాథ‌.

అక్షయ తృతీయ నాడే మహాభారత రచన ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఆ రోజునే వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత రచన చేశాడని ప్రతీతి రూ. స్థితికారకుడైన విష్ణుమూర్తి పరిపాలిస్తాడని విశ్వసిస్తారు. పరశురామ జయంతిగా జరుపుకోవడం ఆన‌వాయితి. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమయిందనే విశ్వాసం కూడా ఉంది. పరమ పవిత్రమైన గంగానది ఈ రోజునే స్వర్గం నుంచి భూమి మీదకు ప్రవహించిందని విశ్వసిస్తారు. అన్నపూర్ణాదేవి కూడా ఈ రోజునే జన్మించిందని చరిత్ర ఉంది. శివపురంలో నివసించే శివుడిని కుబేరుడు ప్రార్థించగా.. ఆయనచే ఆశీర్వదింపబడి సిరిసంపదలను పొందడమే కాకుండా, లక్ష్మీదేవితో పాటుగా సంపదలను రక్షించే పదవిని చేపట్టింది కూడా ఈ రోజునేనని చెబుతారు. సముద్రం నుంచి భూమిని వెలికి తీసుకువచ్చినది కూడా ఈ రోజే. యముడి కుమారుడైన ధర్మరాజు అక్షయపాత్రను పొందిన రోజు ఇదే.

అక్షయ తృతీయ గురించిన కథలలో కృష్ణ సుదాముల కథ ప్రముఖమైనది. పేద బ్రాహ్మడైన సుదాముడు ఆర్ధిక సహాయంను అర్ధించాలని అత్యంత ప్రయాస మీద శ్రీ కృష్ణుని చూడ వస్తాడు. చిన్ననాటి స్నేహితుడైనా ప్రస్తుతం మహారాజైన శ్రీకృష్ణుడికి తను కానుకగా తెచ్చిన అటుకుల మూటను అందించడానికి ఎంతో సిగ్గుపడతాడు. కృష్ణుడే స్నేహితుడి నుంచీ ఆ మూటను చనువుగా లాక్కుని తనకిష్టమైన అటుకులని ఆప్యాయంగా భుజిస్తాడు. సుదాముడిని అతిధి దేవుడిగా ఆదరిస్తాడు. మహారాజు ఆతిధ్యానికి ఉక్కిరిబిక్కిరైన సుదాముడు తను వచ్చిన పని బయట పెట్టలేక రిక్త హస్తాలతో ఇల్లు చేరతాడు. ఆ సమయానికి అతని పూరి పాక సుందరభవనంగా మారిపోయి కనిపిస్తుంది. భార్యాపిల్లలు విలువైన వస్త్రాలు కట్టుకుని ఎదురొస్తారు. సుదాముడు అదంతా శ్రీకృష్ణుడి కృప అని గ్రహిస్తాడు. తాను కోరదలచిన దాని కన్నా ఎన్నో రెట్లు విలువైన సంపదను అనుగ్రహించి తన దారిద్ర్యాన్ని నిర్మూలించిన శ్రీకృష్ణుడికి మనసులోనే ప్రణామాలందిస్తాడు సుదాముడు.

అక్షయ తృతీయకు సంబంధించి మ‌రో పురాణా గాథ‌లున్నాయి. విష్ణుమూర్తి అవతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజునే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే వేదవ్యాసుడు మహాభారత రచనకు పూనుకుని, వినాయకునికి వివ రిస్తూంటే ఆయన రచించాడని కూడా ప్రతీతి.

ఇక వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. 

ప‌విత్ర‌మైన రోజు :

చైత్ర శుద్ధపాడ్యమి, ఆశ్యయుజ శుద్ధ దశమి (విజయదశమి), వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ 3 రోజులూ హిందువులకు పవిత్రమైనవి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఈ 3 రోజులూ తిథి సంపూర్ణంగా ఉంటుంది. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది.

 ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు కనక ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వారికి వరాలనిస్తాడని, ఆశీర్వాదాలు అందచేస్తాడని విశ్వసిస్తారు. నూత‌న కార్యాలు ఆరంభించడానికి ఈ తిథిని అమోఘమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రారంభించిన పని అక్షయంగా వృద్ధిచెందుతూ ఉంటుందని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజిస్తారు. ఈ రోజున గంగలో స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతారు. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా, దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవుతుందని ప్రతీతి. ఈ రోజు బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు... ఏది దానం చేసినా మంచిదే. బెంగాలీయులు ఈ తిథినాడు ఎన్నో హోమాలు నిర్వర్తిస్తారు. వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. సుదర్శన కుబేర యంత్రాన్ని పూజించడం ఆనవాయితీ. ఇక‌ పెళ్ళిళ్లకు కూడా అద్భుతమైన ముహూర్తంగా పరిగణిస్తారు. 

ఎన్నో ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు ఉన్న అక్షయ తృతీయ అందరికీ సకల శుభాలూ కలుగచేయాలని ఆశీర్వ‌దిస్తూ.

Post a Comment

0 Comments