జీవగడియారం అంటే ఏమిటి ?
మన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించారా? లోకములో ప్రతిఒక్కటీ లయబద్దంగా జరగడం చూసారా? సముద్రములో అలలు లయబద్ధంగా వచ్చిపోతుంటాయి. భూమి తనచుటూ తాను లయబద్ధంగా తిరుగుతూఉంటుంది. . . అదేసమయములో సూర్యడడిచుట్టూ అంతే లయబద్ధంగా తిరుగుతుంది. ఋతువులు మారడం , పూలుపూయడం ఇలా ఎన్నో కార్యాలు లయతప్పకుండా జరుగుతాయి. మనిషికూడా ప్రకృతిలో ఓ చిన్నజీవి ... తన జీవనవిధానము ఆ లయకు లోబడి సాగించాలి, లేదంటే మానసిక అశాంతికి,శరీరక అనారోగ్యానికి గురికాకతప్పదు. అందుకు ఒక నియంత్రణ మిషను ఉండాలి . అదే మానవ జీవగడియారము.
ఒక క్రమబద్ధతతో మన జీవప్రక్రియలన్నీ జరిగేలా మెదడులోని గడియారంలో టైమ్ సెట్ అయి ఉంటుంది. ఈ గడియారాన్ని ‘జీవగడియారం’ (బయలాజికల్ క్లాక్) అంటారు. ఇది మెదడులోని హైపోథెలామస్ అనే భాగంలో ఉంటుంది. ఇది ఒక టైమ్‌టేబుల్ ప్రకారం జీవక్రియలన్నీ టెస్ట్ చేస్తుంది. ఉదాహరణకు మన పిల్లలు పెరగడానికి అవసరమైన గ్రోత్ హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్లు తెల్లవారుజామున అధికంగా స్రవిస్తాయి. ఇక మహిళల్లో నెలసరి అన్నది క్రమబద్ధంగా నెలకు ఒకసారి జరుగుతుంటుంది. రుతుస్రావాన్నే ఉదాహరణగా తీసుకుంటే అది క్రమపద్ధతిలో జరుగుతుండటమే ఆరోగ్యానికి చిహ్నం. అది తప్పిందంటే అది అనారోగ్యానికి సూచన. మన మెదడులోని జీవగడియారంలో సెట్ చేసిన విధంగానే నిద్రకు ఉపక్రమించడం వంటివి చేయాలి. మన జీవ కార్యకలాపాలన్నీ క్రమం తప్పకుండా జరిగేలా చూసుకోవాలి. అందుకే మన బాధ్యతగా మనం తినేవేళలు, నిద్రకు ఉపక్రమించే వేళలను క్రమబద్ధంగా పాటించాలి.
కొందరు ఎంతగా మేల్కోవాలని చూసినా... రాత్రి పదికల్లా నిద్ర పట్టేస్తుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా మెలకువతో ఉండలేరు. మరికొందరు పొద్దున్నే ఆరుకల్లా మేల్కొంటారు. అయినా వారికి హాయిగా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒక రోజు ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తే? మరికొందరు ఆలస్యంగా నిద్ర లేచేవారు ఒకవేళ మరీ ఉదయాన్నే లేవాల్సి వస్తే? ఆ రోజంతా వాళ్లకు డల్‌గా ఉంటుంది. చురుగ్గా ఉన్నట్లు ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నిద్రకూ, వేళలకూ, ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? మన జీవితంలోని అనేక విషయాల్లో ఈ క్రమబద్ధతకు కారణం మెదడులోని జీవగడియారం (బయలాజికల్ క్లాక్). ఇలా నిద్ర విషయంలో ఒక రోజులో జరగాల్సినవన్నీ అదే క్రమంలోనూ, అలాగే కొన్ని కొన్ని సీజన్లలో జరగాల్సినవి అదే సీజన్‌లో జరగడానికి కారణం ఏమిటన్నది శాస్త్రజ్ఞుల ప్రశ్న. దీనికి సమాధానమే... మనలోని జీవగడియారం. అందులో క్రమబద్ధంగా జరిగేలా సెట్ అయి ఉన్న టైమ్ ప్రకారం జీవకార్య కలాపాలు జరుగుతుండే క్రమబద్ధతను ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు.. జీవగడియారంలోని సర్కాడియన్ రిథమ్స్...దెబ్బతినడం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ర్పభావాలు చాలా ఉన్నాయి.
ఇందుకు సహకరించేది మన మెదడులో మెలటోనిన్ . వాతావరణంలో కాంతి పెరిగినప్పుడు మన మెదడులో మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోతుంది. అది స్రవించాలంటే చీకటిగా ఉండాలి. చీకటిగా ఉన్నవేళలోనే మెదడులోని పీనియల్ గ్లాండ్ అనే గ్రంథి మెలటోనిన్‌ను స్రవిస్తుంది.
ఆ మెలటోనిన్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ చురుకుదనం తగ్గుతూ క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రలోకి జారినప్పుడే గ్రోత్ హార్మోన్ల వంటివి స్రవించి బిడ్డలు పెరుగుతారు. ఇప్పుడీ కృత్రిమకాంతితో పగలు నిడివి పెరగడంతో నిద్ర తగ్గుతుంది. ఫలితంగా నిద్రతగ్గడం వల్ల వచ్చే పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఇక అదేవిధంగా మనలో స్వాభావికంగా సెట్ అయి ఉన్న నిద్ర, పనివేళల సమయాలను ఇష్టం వచ్చినట్లుగా మార్చుతుండటం, 24 గంటల పాటు టీవీల్లో ప్రసారమయ్యే వినోదకార్యక్రమాలను చూస్తూ... జీవగడియారాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా నిద్రలేక వచ్చే అనర్థాలన్నీ ఏర్పడుతుంటాయి.
0 Comments