GET MORE DETAILS

మృగశిర కార్తె అంటే ఏంటి ?

మృగశిర కార్తె అంటే ఏంటి ?మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్లు.

అసలు ఈ కార్తెలు ఎలా ఏర్పడతాయి చూద్దాం. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది. అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరువది ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దానివలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది.

ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే రైతులు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు.మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు.ఈ రోజు ప్రత్యేకించి ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం.

పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి. పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను, పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు. ప్రకృతి మార్పు ప్రభావం ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. ప్రస్తుతం ఈ కార్తె ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడేక్కి మానవ శరీరాలు తాపంతో ఉంటాయి. జూన్ మొదటి వారంలో అంటే సుమారుగా 8 తేదీ నుండి ప్రకృతి పరంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కృత్తిక‌, రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగ‌శిర‌ కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి, ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. మృగ‌శిర‌ కార్తెను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొల‌క‌రి జ‌ల్లులు కురవగానే పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తారు.

వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది. శరీరం ప్రకృతి యొక్క మార్పును తట్టుకోవడానికి ఈ రోజు ఇంగువబెల్లం తింటారు.మాంసాహారం తీసుకునే వారు చేపలను తింటారు.శాఖాహరులు మాత్రం ఇంగువను బెల్లంలో కలిపి గుండ్రని గోళిలాగ చేసి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుని కుటుంబ సభ్యులందరు అన్ని వయస్సులవారు తప్పక తింటారు. ఈ ఆయుర్వేద ప్రక్రియ వలన శరీరం బలంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. మన పెద్దలు అన్ని రకాల ప్రయోగ అనుభవంతో మన పెద్దలు, పూర్వీకులు ప్రతీ విషయాన్ని వారి జీవిత అనుభంలో అన్ని రకాల ప్రయోగ అనుభవసార ఫలితంగా పరిశీలించి వారి తర్వత తరం వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే భావనచే మనకు తరుణోపాయాలు,చిట్కాలు సూచనలు చేసారు. వాటిని ఆచరించించిన వారు ఆరోగ్య ఆనందంతో గడుపుతారు.పెద్దలమాట సద్ధన్నం మూట అని ఊరికే అనలేదు.

అసలు ఈ రోజున చేపమందు కానీ, చేపలు కానీ ఎందుకు తింటారు దీని వెనక ఉన్న ఆరోగ్యరహస్యం ఏంటి నేటి యువతకు అస్సలు తెలియదు. ఆ రహస్యం ఏంటంటే ఈ కార్తెలో ఎక్కువగా మనిషి శరీరంలో మార్పులు జరిగి, ఎక్కువ మంది వ్యాధుల బారిన పడే ప్రమాదమున్నది. గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంది. వీటన్నింటిని తట్టుకోవాలంటే ఈ రోజున ఖచ్చితంగా చేపలు తినాల్సిందే. అయితే జబ్బులు వస్తే వైద్యులు దగ్గరకు వెళతారు కానీ మృగశిర రోజు చేపలు తింటే రోగాలు రావా అని అనుకోవచ్చు అయితే అసలు ఈ చేపలకు, మృగ శిరకార్తెకు ఉన్న సంబంధం ఏమిటో, తింటే ఏం ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి.

ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం. మృగశిర కార్తెలో ఏ చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం కొవిడ్‌-19 నేపథ్యంలో స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు మేధావులు చెబుతున్నారు

మంచి పని చేయడానికి కుల, మత, ప్రాంత, లింగ, వయోభేదం లేకుండా సంకల్పించాలి. నాకెందుకులే అనే భావన మాత్రం పొరబాటున కూడా మనస్సుకు రానివ్వవద్దు. మీరు నేడు చేసిన ప్రకృతి సేవయే రేపటి తరం మిమ్మల్ని,భావితరలవారిని కాపాడుతుంది

వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు. తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు.

Post a Comment

0 Comments