GET MORE DETAILS

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఖరారు. ద్రౌపది ముర్ము ప్రస్థానం

 ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఖరారు. ద్రౌపది ముర్ము ప్రస్థానం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 20 పేర్లపై చర్చించి చివరకు ముర్ము పేరును ఖరారు చేశారు. ఒడిశా మయూర్‌బంజ్ జిల్లాలో జన్మించిన ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఐదేళ్లు పనిచేశారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఉంటే బావుంటుందని భావించామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

ఎవరీ ద్రౌపది ముర్ము...?

ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే సంప్రదాయ గిరిజన కుటుంబంలో ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్గా పనిచేస్తూ BJP పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. కార్యకర్త నుంచి జాతీయ కమిటీలో చోటు పొందే స్థాయికి ఎదిగారు.

ఒడిశాలో 2000-2002 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో BJP నుంచి ఈమె మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ముర్ము భర్త, ఇద్దరు కొడుకులు చనిపోగా, ఒక కూతురు ఉంది.

ద్రౌపది ముర్ము ప్రస్థానం :

1958 జూన్ 20న పుట్టిన ద్రౌపది ముర్ము.. బీఏ వరకు చదువుకున్నారు. శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లాడిన ఈమెకు ఒక కుమార్తె వున్నారు. ఒడిశా ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన.. ద్రౌపది అనంతరం 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాయ్‌రంగాపూర్ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. 1997లో ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షరాలిగా పనిచేశారు.

2000లో తొలిసారి రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002-09 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. 2004లో మరోసారి రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి 2009 వరకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.

2007లో ఎమ్మెల్యేగా అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ''నీలకంఠ అవార్డ్''ను అందుకున్నారు ద్రౌపది. 2010 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 నుంచి 2015 వరకు బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.


Post a Comment

0 Comments