GET MORE DETAILS

గోరింటాకు ప్రయోజనాలు

గోరింటాకు ప్రయోజనాలు



 అనాది కాలం నుండి గోరింటాకు మన సంస్కృతి సంప్రదాయాలలో భాగమైపోయింది.పండుగలకు, శుభ కార్యాలకు గోరింటాకు పెట్టుకోవడమనేది ఆనవాయితీగా వస్తోంది. గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. చాలా మంది గోరింటాకును ఒక అలంకరణ ప్రాయంగానే చూస్తారు. కానీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆషాఢ మాసంలో గోరింటాకును ఎందుకు పెట్టుకోవాలి

భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో గోరింటాకుకు కూడా స్థానం ఉంది. గోరింటాకును కూడా ఔషధంగా ఉయోగిస్తారు. గోరింటాకులో చర్మానికి మేలు చేసే రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాయనాల కారణంగా చర్మానికి చల్లగా ఉండడమే కాకుండా అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా అడ్డకుంటాయి. గోరింటాకును గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లు చక్కగా కనిపించడమే కాకుండా ఈ ఆకులో ఉండే రసాయనాల కారణంగా గోర్లు క్షీణించకుండా ఉంటాయి.

గోరింటాకులో ఉండే లాసోన్ అనే రసాయనం కారణంగా గోరింటాకు ఎర్రగా పండుతుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు మన శరీరంలో ఉండే వేడిని అది గ్రహించి ఆవిరి చేస్తుంది. తరువాత గోరింటాకు మన చర్మం పొరల్లోకి ఇంకి కాసేపటికి ఎర్రగా మారుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక కూడా ఒక అర్థం దాగి ఉంది. వర్షాకాలం ప్రారంభంలో ఆషాఢ మాసం వస్తుంది. ఈ సమయంలో మన చేతులు, కాళ్లు వర్షపు నీటిలో నాని చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో గోరింటాకును పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

అలాగే వేసవి కాలంలో వేడిని గ్రహించిన చర్మం వర్షాకాలంలో ఒక్కసారిగా చల్లబడి అనారోగ్యాలు తలెత్తుతాయి. ఈ సమయంలో గోరింటాకును పెట్టుకోవడం వల్ల గోరింటాకు మన శరీరంలో ఉండే ఉష్ణాన్ని గ్రహించి వర్షాకాలానికి అనుగుణంగా మన శరీరాన్ని మారుస్తుంది. ఆషాఢంలో గోరింటాకును పెట్టుకోవాలని చాలా మంది మార్కెట్ లో దొరికే రసాయనాలు కలిపిన గోరింటాకు మీద ఆధారపడుతున్నారు. వీటిని వాడడం అంత మంచిది కాదు. సహజ సిద్దంగా లభించిన గోరింటాకును సేకరించి మెత్తగా నూరి చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల మాత్రమే మనం ఈ ప్రయోజనాలను పొందచ్చు.

ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఇదేనని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

Post a Comment

0 Comments