GET MORE DETAILS

నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల - శ్రీ గుర్రం జాషువా

నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల - శ్రీ గుర్రం జాషువా ‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి

పంజరాన గట్టు వడను నేను

నిఖిలలోక మెట్లు నిర్ణయించిన

నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’

పుట్టుకతో దళితుడైన ఈయన పట్టుదలతో కవిశేఖరుడై, నవయుగ కవిచక్రవర్తై, తన కవితాప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా గారు. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడియైన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా, ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. అగ్రవర్ణ దురహంకారాలను చవిచూసిన శ్రీ జాషువా సౌమ్య పదజాలంతోనే వాటిని ఎదిరించాడు. ఓ సందర్భంలో ఆయనే చెప్పినట్లు "నాకు గురువులు ఇద్దరు--పేదరికం, కులమత బేధం. ఒకటి సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది.."అన్నది ఆయన కవిగా, వ్యక్తిగా విరాట్రూప ప్రదర్శనకు నేపధ్యాలు. వెంకటిగిరి రాజావారి ఆహ్వానంపై రైలుబండిలో నెల్లూరు వెళ్ళుతుంటే, తోటి ప్రయాణికుడైన మరోకవితో పరిచయమై, ఆయన కోరిక మేరకు తన స్వీయ కవితాగానం చేయగా, ముఘ్ధుడైన ఆ కవి--మీ కవిత్వం అద్భుతంగా వుందని అంటూ, వారి కులం గురించి అడిగి తెలుసుకొని వెంటనే అక్కడనుంచి లేచి వెళ్లి పోయాడట, ఆ కవి పుంగవుడు.

కళకు కులమతాలున్నాయా? అంటూ శ్రీ జాషువా ప్రశ్నిస్తూ-- "నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపు రేఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళీ; యన్నవారే, మీదేకుల మన్నప్రశ్నవెలయించి, చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగున్ పార్ధివ చంద్ర! వచింప సిగ్గుగన్!" అంటూ వెంకటిగిరి రాజా గారికి తన ఆవేదన చెప్పుకున్నాడు. తన కవితా యాత్ర విజయ కేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు గుర్రం జాషూవా. జాషూవాను గురించి తెలుకోవటం అంటే ఆశపడటం, ఆరాటపడటం, పోరాటం చేయటం, అవమానాలు పొందటం వంటివి తెలుసు కోవటమే. సాగరంలోని ఆటుపోట్లు అపారం, తెలిసేవి మాత్రం కొన్నే. జాషూవా జీవిత సాగరమూ అంతే. జాషూవా హృదయ అంతరంగిక కోణంలోని అవమానాల గాయాల పచ్చిదనం జాషూవా ‘నా కథ’ రాసే సమయానికి తగ్గలేదు. వృద్ధ్యాప్యానికి కూడా పచ్చిదనం తగ్గని గాయం ఎంత లోతైనదై ఉండాలి?

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు,శ్రీ జాషువా గురించి ప్రస్తావిస్తూ, శ్రీ జాషువా ఒక మధుర కవి అనేవారు. ఒకానొక మాధుర్యం ఆయన కవిత్వంలో శారదాదేవి అనుగ్రహం చేత లభించిందని, శ్రీ విశ్వనాధ వారు అన్నారు.జాషువా 28 -09 -1895 న వీరయ్య, లింగమ్మ దంపతులకు, గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. ఈ ఒక్క విషయం చాలు,మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా వూరుకునేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు.1910 లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశాడు.

ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915 -16లో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్నకథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చినడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా10 సంవత్సరాల పాటు పనిచేశాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశాడు. 1957-59మధ్య కాలంలోమద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకుడిగా పనిచేశాడు.

ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధానసభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు యిది ఒక ఉదాహరణ మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై వుండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు.ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు. జీవనం కోసం ఎన్నోరకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు,1964 లో, ఆంద్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. చిన్నతనం నుండీ జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్యస్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి  వద్ద మేఘసందేశం కుమారసంభవం, రఘువంశం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు వ్రాశాడు. వాటిలో ప్రముఖమైనవి-క్రీస్తుచరిత్ర , గబ్బిలం, పిరదౌసి, రుక్మిణీకళ్యాణం, మశానవాటిక, వివేకానంద, జేబున్నీసా, నాగార్జునసాగరం, కాందిశీకుడు. 'నా కథ' పేరుతో వారి ఆత్మకథను కూడా వ్రాసుకున్నారు.

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే యిందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశంలేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. చూడండీ,ఆయన మనో భావాన్ని దళిత యువకిడి ద్వారా యెంత చక్కగా చెప్పారో!

"వాని నుద్ధరించు భగవంతుడే లేదు

మనుజెడెట్లు వాని గనికరించు

వాడు జేసికొన్నపాపకారణ మేమో

యింతవరకు వాని కెరుకలేదు."


"ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి

యినుపగజ్జెల తల్లి జీవనము సేయు

గసరి బుసకొట్టు నాతని గాలిసోక

నాల్గు పడగల హైందవ నాగరాజు"

(హిందూ మతంలో వున్నచాతుర్వర్ణ వ్యవస్థను గురించి యెంత భావ యుక్తంగా చెప్పారో,చూసారుగా!)

"కులము లేని నేను కొడుకుల బుట్టించి

ఈ యఖాతమందే  త్రోయవలేనే

భార్యయేల బుట్టుబానిస కని వాడు

జరుపసాగే బ్రహ్మచర్య దీక్ష"

ఇలా చెప్పుకుంటూ పొతే, వారి గబ్బిలం లోని ప్రతి పద్యాన్ని ఉదహరించవచ్చు.

1932లో పిరదౌసి అనే మరొక ప్రధాన రచన చేశాడు. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం యిస్తానని చెప్పగా ఆ కవి పదిసంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

"సుకవి జీవించు ప్రజల నాల్కలయందు" అనే ఈ పద్యంలో కవిలోకానికి జాషువా సముచిత స్థానం కల్పించారు.

జాషువా గారి హాస్య ప్రవృత్తి-- "నవ్వవు, జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు....." అంటూ నవ్వు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఎన్నికష్టాలు వచ్చినా, ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే జీవితాన్ని గడిపారు. ఆయన ఆర్ధిక పరిస్థితులు తెలుసుకున్న సహృదయలు శ్రీ ఏకా దండయ్యపంతులుగారు గుంటూరు నుండి 25 రూపాయలు మనియార్డర్ చేస్తూ, "జాషువా! రాత్రి నాకు దేవుడు కలలో కనబడి నీకు 25 రూపాయలు పంపమన్నాడు." అని కూపన్ మీద వ్రాసేవారు.

జాషువా గారు దానిని హాస్యంగా మలుచుకొని తన కృతజ్ఞతలు తెలుపుతూ "మీ దేవుడు 25 పక్కన "సున్నా" పెట్టమని చెప్పలేదా?" అని చమత్కరిస్తూ జవాబు వ్రాసేవారు. జంట కవులుగా రాణించవచ్చునని తన స్నేహితుడైన శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలసి కవిత్వం వ్రాద్దామనుకున్నారు. అయితే, జంటకవులకు ముందు పేర్లు చక్కగా కలవాలిగదా! ఈయన జాషువా, ఆయన పిచ్చయ్య. జాషువా పేరు ముందు పెడితే "జాషువా పిచ్చి" అవుతుంది. పోనీ పిచ్చయ్య గారి పేరు ముందు పెడదామా అంటే "పిచ్చి జాషువా" అవుతుంది. ఎటుచూసినా జాషువాకే పిచ్చిపట్టేటట్లు వుండటం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. "మందు తీసుకుంటున్నారు కదా జ్వరం తగ్గిందా" అని ఎవరైనా అడిగితే, "తగ్గింది" అనేవారు. "ఎంత తగ్గింది?" అని అడిగితే, "సీసాలో సగం తగ్గింది" అనేవారు. "సీసాలో ఏమిటి?" అని అంటే, "అదే,మందు తగ్గింది" అంటూ నవ్వించేవారు.

1948 లో రాసిన బాపూజీ - మహాత్మాగాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి. ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవి అయిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారికి, ఒకేసారి ఆంద్ర విశ్వకళా పరిషత్ వారు ' కళాప్రపూర్ణ' బిరుదును ప్రదానం చేశారు. జాషువా అంటే అంతగా పడని శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు"అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా "నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా వుండలేక పోతున్నాను" అని విశ్వనాధ వారికి మంచి Retort యిచ్చారు. జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు, శ్రీ జాషువా గారి  కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం  చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.

"సత్య హరిశ్చంద్ర" నాటకం, వారి 'స్మశానవాటిక' లోని పద్యాలు లేకుండా ఊహించుకొనలేము. వీరు వ్రాసిన శిశువు(పాపాయి) అనే ఖండికను ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. ఈ సందర్భంలో గాన గంధర్వుడు ఘంటసాల వారిని కూడా స్మరించుకోవటానికి, ఒక చిన్నసంఘటను గుర్తు చేస్తాను. ఈ పాట ఘంటసాల గారు పాడే సందర్భంలో, రికార్డింగ్ జరిగే సమయంలో శ్రీ జాషువా గారు ఘంటసాల వారి యింటికి వచ్చి, బయట అరుగు మీద కూర్చున్నారట. ఘంటసాల గారు, బయటకు వచ్చి, "ఏమిటండీ! బయటనే కూర్చున్నారు" అని అడిగితే, అందుకు జాషువా గారు "నేను అంటరాని కులమునకు చెందిన వాడను, మీరు బ్రాహ్మణులు, మీ అనుమతి లేకుండా లోపలి ఎలా రాగలను?" అన్నారట. అందుకు, ఘంటసాల గారు  "నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్చగా లోపలి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్ధం!" అని చెప్పియింటిలోకి సాదరంగా తీసుకొని వెళ్లి, తన సహృదయాన్ని చాటుకొన్న ధన్యజీవి ఘంటసాల గారికి కూడా నా బాష్పాంజలి. ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి!

కళ, యేదైనా దైవదత్తం. కళాకారుడు దైవస్వరూపుడు. కళాకారుడికి--కులం, మతం, దేశం ప్రపంచం అనేవేవీ వుండవు. ఎల్లలు లేని దివ్యపురుషుడు, కళాకారుడంటే! ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

అవార్డులు-1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.

"ఒక్కొక పద్దియమునకు నొక్కొక్క నెత్తురుబొట్టు మేనిలో తక్కువగా" రచించిన ఈ కవి శ్రేష్టుడు, శారదాదేవి వరప్రసాది --24-07-1971 న గుంటూరులో ఆ శారదాదేవిఒడిలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. జాషువా కూతురు హేమలతాలవణంగారు, జాషువా స్మారకార్ధం జాషువా సాహిత్య పురస్కారం నెలకొల్పింది. ఈ అవార్డును ప్రతియేటా వివిధ భారతీయ భాషలలోని అత్యుత్తమ కవులకు ప్రదానం చేసేవారు. శ్రీ మతి హేమలత గారు తాను జీవించినంత కాలం. ఆంద్రదేశ దౌర్భాగ్యమో లేక తెలుగువారి కుల దురహంకారమో---కవితావిశారాదుడు అయిన వారిని 'దళిత' కవిగా చేసి ఆంధ్రదేశ ప్రజలు యింకా తమ పాపాన్ని కడుగుకొనలేదు. ప్రభుత్వమూ, ఆంధ్రులు విశాల దృక్పథముతో వారికి సముచిత స్థానమిచ్చి, యిక నుంచైనా తగిన రీతిలో గౌరవించి శారదాదేవి కన్నీళ్లు తుడుస్తారని భావిస్తూ, వారికి నా స్మృత్యంజలి ఘటిస్తున్నాను.

"వడగాల్పు--నా జీవితమైతే,వెన్నెల--నా కవిత్వం" అని శ్రీ జాషువా గారు అన్నది అక్షర సత్యం.

"రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతివిగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు".

Post a Comment

0 Comments