GET MORE DETAILS

దీర్ఘాయువునిచ్చే తలకావేరి విశేషాలు

 దీర్ఘాయువునిచ్చే తలకావేరి విశేషాలు★ తులా సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు.

భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరీ ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న , ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచినది.

కావేరి దక్షిణ భారత దేశంలోని ప్రముఖమైన నది. ఇది కర్నాటకలోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి బంగాళాఖాతం దిశగా ప్రవహిస్తుంది. ఈ నది కర్నాటక , తమిళనాడు రాష్ట్రాల్లో ఆగ్నెయ దిశగా ప్రయాణిస్తుంది. ఈ నది ప్రస్తావన తమిళ సాహిత్యంలో ఎక్కువగా కని పిస్తుంది. ఈ నది పవిత్రమై నదిగా పేరు పొందింది. కావేరి నదీ జలాలతో ఏర్పడే శివ సముద్రం జలపాతాలు దేశం లో రెండవ పెద్ద జలపాతాలు గా పేరుపొందాయి.

పచ్చటి ప్రకృతి , జలపాతాలు , వన్యమృగాలు , పక్షులు , మూలికా వృక్షాలకు నిలయంగా పేరుపొందింది కూర్గ్. దీనినే అధికారికంగా 'కొడుగు' అని పిలుస్తారు. 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' గా పేరుపొందిన కూర్గ్ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని 'కర్ణాటక కాశ్మీర్' అని కూడా పిలుస్తారు. చుట్టూ ఎత్తైన కొండలు , లోయలు , జలపాతాలు , సెలయేర్లు కనువిందు చేస్తాయి. విస్తరించిన కాఫీ తోటలు , శిఖరాల నుండి జాలువారే జలపాతాల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. కర్నాటకలోని కొడగు జిల్లా నుంచి కేరళలోని వాయనాడ్‌ జిల్లా వరకూ విస్తరించిన కనుమలను బ్రహ్మగిరి కొండలుగా పిలుస్తారు. ఉత్తర కనుమల్లో భాగంగా ఉన్న ఈ పర్వతాలు విభిన్నమైన వన్యప్రాణులకు , దట్టమైన అడవులకు నెలవు.

ఈ ప్రాంతం అంతర్జాతీయంగా కాఫీ పంటకు ప్రసిద్ధి. తేనె , యాలకులు , మిరియాలు , నారింజలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ట్రెక్కింగ్ , రివర్ రాఫ్టింగ్‌కు కూర్గ్ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి వేసవికాలంలో విహారానికి సందర్శకులు కూర్గ్‌కు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కూర్గ్ లో చూడాల్సిన ప్రదేశాలలో తలకావేరి ఒకటి.

కావేరీ నది 1,276 మీటర్ల ఎత్తులోనున్న బ్రహ్మగిరిపై తల కావేరి వద్ద జన్మించింది. కర్ణాటక రాష్ట్రం , కొడగు జిల్లా ఇది. కావేరి నది కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాలలో 756 కిమీ. ప్రవహించి తమిళనాడులోని పుంపుహార్‌ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తున్నది. కావేరీలోని ప్రతి నీటి బొట్టు సాగునీరు , తాగునీరు అందించడంతో పాటు , రెండురాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతోంది.

భాగమండలానికి 8 కిలోమీటర్ల దూరంలో తలకావేరికి ఉంది. బ్రహ్మగిరి కొండమీద ఉన్న ఈ ప్రదేశం , కావేరీ జన్మస్థలంగా ప్రాచుర్యం చెందింది. అక్కడ మహానందిలో మాదిరిగానే నంది నోట్లో నుంచి సన్నటిధారగా నీళ్లు పడి , కింద ఉన్న తటాకంలోకి వెళుతున్నాయి. అదే కావేరీ నది ప్రారంభం. ఆ తటాకం నుంచి నీళ్లు భూమిలోపలికి ప్రవహించి , కొంతదూరం తరవాత కావేరీనది రూపంలో పైకి వచ్చాయని చెబుతారు.

ఆ తటాకంలోనే కొందరు స్నానాలు చేస్తారు. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. గుడి దాటుకుని మెట్లెక్కి పైకి వెలితే అక్కడ శివుడి గుడి , వినాయకుడి గుడి ఉన్నాయి. అందులో వెండితో చేసిన విగ్రహాలు మెరుస్తుంటాయి. దీనికి ఎడమ వైపున ఓ పెద్ద కొండ ఉంది. మెట్లెక్కి ఆ కొండపైనుంచి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కొండకి ఓ పక్కంతా కేరళ , మరోవైపు కర్ణాటక అందంగా కనువిందు చేస్తాయి.

పచ్చని అడవులు , చెట్లు , వన్యప్రాణులతో భూలోక స్వర్గంగా పిలవబడుతున్న బ్రహ్మగిరి కొండలు ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైన ప్రాంతం. ముఖ్యంగా వైల్డ్‌లైఫ్‌ , నేచర్‌ లవర్స్‌ ఖచ్చితంగా చూసితీరాల్సిన ప్రదేశం. శ్రీమహావిష్ణువు నిర్మించాడని చెప్పే అత్యంత పురాతనమైన తిరునెల్లి దేవాలయం వాటిలో ఒకటి. ఇక ఇరుప్పు వాటర్‌ఫాల్స్‌ , పక్షిపాతాళం ట్రెక్కింగ్‌ సైట్‌ , కాదంబ జైన్‌ టెంపుల్‌ , బ్రహ్మగిరి వైల్డ్‌లైఫ్‌ శాంక్చురిని కూడా చూడదగిన ప్రదేశాలు

హిందువుల పవిత్ర స్ధలం కావేరి నది పుటుక ఇక్కడ జరిగింది. సముద్ర మట్టానికి సుమారు 1276 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడకల సరస్సులోకి ప్రవహిస్తుంది. సరస్సు నుండి భూగర్భంలోకి ప్రవహించి కావేరి నదిగా ప్రవహిస్తుంది. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. సమీపంలో అగస్తేశ్వర దేవాలయం కలదు. తలకావేరీ నదిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని , బాధలు తీరతాయని హిందువులు భావిస్తారు.

ఇక్కడి భాగమండల ప్రదేశంలో కావేరి , కనకే మరియు సుజ్యోతి అనే మూడు నదులు కలుస్తాయి. తలకావేరి నుండి భాగమండల 8 కి.మీ.ల దూరం. సమీపంలో గణపతి , సుబ్రమణ్య , విష్ణు దేవాలయాలు కలవు. వార్షిక జాతర ప్రతి ఏటా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో జరుగుతుంది. ఆ సమయంలో నదీ ప్రవాహ వెల్లువలు చూసేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దేవాలయాలలో వేలాది దీపాలను వెలిగిస్తారు.

కావేరి జన్మస్థానమైన తలకావేరిలో కావేరి మాత ఆలయం ఉంది. తులా సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. లక్షలాదిమంది భక్తులు కావేరీ మాతను దర్శించి చరితార్థులవుతారు.

ఇక్కడ వెలసిన విశ్వనాథ ఆలయంలో పార్వతీసహిత పరమ శివుడు తమ కుటుంబంతో భక్తులను అనుగ్రహిస్తారు. భగమండలంలో అగస్యుడు తపస్సు చేసి సుబ్రహ్మణ్యుని సాక్షాత్కరించుకున్నాడు. అగస్యుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు , విష్ణుమూర్తికి , గణపతి , స్కందులకు ఆలయాలు నిర్మించాడు. ఈ ఆలయ సముదాయాల్లో ఉండే అక్షయ పాత్రలోని ధాన్యం విత్తులను , తమ విత్తులలో కలిపి జల్లితే వరిపంట పుష్కలంగా ఉంటుందని కర్షకుల నమ్మకం.

కవేరుడనే రాజర్షి ముక్తిని కోరి బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ సాక్షాత్కరించి కవేరుని అంతరంగాన్ని తెలుసుకుంటాడు. ముక్తికి బదులు కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆమె ద్వారా ముక్తి లభిస్తుందని వరదానం చేస్తాడు. కవేర కన్య యుక్త వయస్కురాలై తండ్రి మనోరథాన్ని తెలుసుకుని శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై కవేర కన్య కోరిక తెలుసుకుని ‘‘నా అంశతో జన్మించిన అగస్యుని వివాహం చేసుకున్న క్షణంలో నదిగా మారుతావు , ఆ నదిలో స్నానం చేసి నీ తండ్రి తన మనోరథాన్ని పూర్తి చేస్తాడు' అని వరం ఇస్తాడు.

అలా అగస్యుని వివాహం చేసుకున్న కవేర కన్య నదీరూపం పొందిందని ఒక కథ. మరొక కథననుసరించి - ఒకప్పుడు దక్షిణ భారతంలో కరువుకాటకాలు తాండవించాయి. ప్రాణికోటి ఆకలిదప్పులతో అశువులు బాసింది. ఆ పరిస్థితిని చూసి శయన మహర్షి చలించి , క్షామ నివారణకోసం శివుని గురించి తపస్సు చేశాడు.

ప్రత్యక్షమైన శివునికి పరిస్థితి విన్నవించి గంగను విడువమన్నాడు. శయన మహర్షి నిస్వార్థతకు సంతసించి ఆదుకోమని శివుడు గంగను కోరాడు. పతి కోరికను మన్నిస్తూ గంగ తనలోని ఒక అంశను సహ్యాద్రిపర్వత శ్రేణిలోని బ్రహ్మగిరి నుండి నదిగా ప్రవహింపచేసింది. కవేరుని కుమార్తె పేరున కావేరి నదిగా , గంగ అంశగా జన్మించడం వల్ల దక్షిణ గంగగా నాటి నుంచి ప్రసిద్ధి చెందింది.

ఎలా చేరుకోవాలి ?

బ్రహ్మగిరికి అతి దగ్గర ఎయిర్‌పోర్ట్‌ మైసూర్‌ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ్నుంచి క్యాబ్‌ తీసుకుని బ్రహ్మగిరి చేరుకోవచ్చు. రైలులో వెళ్లాలన్నా మైసూర్‌ రైల్వేస్టేషన్‌లో దిగాల్సిందే. రోడ్డుమార్గంలో బ్రహ్మగిరి వెళ్లడం ఉత్తమమైన పని. దారిపొడవునా ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం.. ఖచ్చితంగా మధురానుభూతులను మిగులుస్తుంది. అందుకే.. చాలామంది మైసూర్‌ నుంచి నేరుగా కారులో వెళ్లడానికే ఇష్టపడతారు. అదే విధంగా ట్రెక్కింగ్‌ చేయాలనుకునేవారు ముందుగా శ్రీమంగళ గ్రామంలోని రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకోవాలి.

Post a Comment

0 Comments