GET MORE DETAILS

Armed Forces Flag Day : ప్రతి భారతీయుడికి తెలియాల్సిన ప్రత్యేక రోజు ఇది. మీకు తెలుసా... లేదా...

Armed Forces Flag Day : ప్రతి భారతీయుడికి తెలియాల్సిన ప్రత్యేక రోజు ఇది. మీకు తెలుసా... లేదా...
సరిహద్దులో కవ్వింపులకు పాల్పడే పాకిస్తాన్ (Pakistan) ఒక పక్క.. ఆక్రమణ కుయుక్తులతో రెచ్చగొడుతున్న చైనా (China) మరోపక్క.. చొరబాట్లకు కాచుకుకూర్చున్న ఉగ్రమూకలు ఇంకో పక్క... ఇలా భారతావనికి ముప్పు ఏ రూపంలో ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తున్నాయి మన సాయుధ బలగాలు (Armed Forces). ఎముకలు కొరికే చలి.. తాళలేని ఎండలు.. వర్షాలు-వరదలు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కంటికి రెప్పల్లే దేశాన్ని కాపాడుతున్నారు. భూతలం, గగనతనం, జలతలం అన్ని దిక్కులనూ రక్షణ వలయంతో రక్షిస్తున్నారు. ఈ రోజు దేశంలోని పౌరులు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా నిద్రపోవడం కోసం ఇప్పటికే ఎందరో సైనికులు ప్రాణత్యాగం చేశారు. దేశం కోసం అసువులుబాసి అమరవీరులుగా నిలిచిపోయారు. మరెందరో కాళ్లు, చేతులను కోల్పోయి వికలాంగులుగా మారారు. మరి మన కోసం, మన దేశం కోసం గొప్ప తెగింపు, త్యాగంతో పనిచేస్తున్న మన సాయుధ దళాలు ఈ రోజు (డిసెంబర్ 7) ‘ భారత సాయుధ బలగాల పతాక దినోత్సవం’ (Armed Forces Flag Day) జరుపుకుంటున్నారు. మరి ఈ సాయుధ బలగాల పతాక దినోత్సవం ఏమిటి?, దీనివెనుక ఏమైనా చరిత్ర ఉందా ?, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు?.. అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఇండియన్ మిలటరీకి చెందిన అమరులు, విశేష సేవలు అందించిన మాజీలు, ప్రస్తుతం సర్వీసుల్లో ఉన్నవారి గౌరవార్థం ప్రతి ఏడాది డిసెంబర్ 7న సాయుధ బలగాల పతాక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మిలిటరీ అధికారుల నుంచి సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నిధులు సేకరించాలనేది మరో ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఇతర సాయుధ బలగాల్లో పనిచేసిన లేదా చేస్తున్నవారి గౌరవార్థమే కాకుండా.. వారి కుటుంబ సభ్యుల సంక్షేమం ముఖ్య లక్ష్యంగా ఉంది. అందుకే 1949 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

సాయుధ బలగాల పతాక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆగస్టు 28, 1949లో రక్షణమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత 1993లో భారత రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ బాధితుల సంక్షేమ నిధి, కేంద్రీయ సైనిక్ బోర్డ్ ఫండ్ వంటి వేర్వేరు సంక్షేమ ఫండ్‌లను ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్‌ పేరిట ఒకే ఫండ్‌గా మార్చివేసింది. జెండాలు, స్టిక్కర్ల విక్రయించడం ద్వారా నిధులు సేకరించడం మొదలుపెట్టింది. ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్‌ సేకరించిన నిధులను ఇబ్బందుల్లో ఉన్న మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, వారిపై ఆధారపడినవారితోపాటు సైనికుల సంక్షేమ పునరావాస చర్యలు చేపడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు నిధులను అందజేస్తున్నారు.

మీరూ సాయం చేయొచ్చు...

సాయుధ బలగాల పతాక దినోత్సవాలు పాల్గొనడం, జెండాలు, కూపన్లు, కార్డులు కొనుగోలు చేయడం ద్వారా ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్(AFFDF)కు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటు అందించవచ్చు. ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్‌కు భాగస్వామ్యం అందించడం దేశంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యతగా ఉంది. ఏడాదిలో ఎప్పుడైనా ఈ ఫండ్‌కు విరాళం అందించొచ్చు. సాయం చేయాలనుకునేవారు కేంద్రీయ సైనిక్ బోర్డ్ వెబ్‌సైట్‌పై లభించే అఫిషీయల్ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్ డొనేషన్ చేయవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లకు చెక్ రూపంలో కూడా విరాళాలు అందించవచ్చు. ఈ కింద సూచించిన లింక్ https://www.ksb.gov.in/DonateAFFDF.htm ద్వారా విరాళం అందించవచ్చు.

Post a Comment

0 Comments