GET MORE DETAILS

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి ,తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా , నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఉదాహరణ బీ.పీ. మండల్ జీవితం.నేడు బిపి మండల్ వర్థంతి సందర్భంగా...

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి ,తను వచ్చిన  సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా , నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఉదాహరణ బీ.పీ. మండల్ జీవితం.నేడు  బిపి మండల్ వర్థంతి సందర్భంగా...బీ.పీ. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లో ఒక #యాదవ కుటుంబంలో ఆగస్టు 25, 1918 లో జన్మించారు. మాధేపురా జిల్లాలోని  మోరో  గ్రామంలో పెరిగారు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యనీ,  మరియు దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యనీ  పూర్తి చేసారు. పాట్నా కాలేజీలో  ఇంటర్మీడియేట్ పూర్తి చేయగా,ఆ  తరువాత పై చదువులకై ఆయన కలకత్తా లోని ప్రెసిడెన్సీ కళాశాల  చేరారు.దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, ఆయన తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది.

మండల్ తన 23 వ ఏటనే జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పని చేసారు. మండల్  రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని వ్యవసాయ కులానికి చెందిన కుర్మీలపై  ఆధిపత్య వర్గ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించారు.   1965 లో తన నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో  మైనారిటీలు మరియు దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షములో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి క్యూలు కడుతున్న సంధర్భములో  తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ఎస్పి) లో చేరారు.  ఎస్ఎస్పి రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్డారు. 

1967 ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి, 1967 లో  69 సీట్లుకు పెరిగి బీహార్లో మొట్టమొదటికాంగ్రెస్-ఎస్.ఎస్.పీ. మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఆయన పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ కేబినేట్ మంత్రివర్గంలో  తీసుకోబడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు.. కానీ పార్టీలో , ప్రభుత్వములో కొన్ని విబేధాలు రావడముతో  కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడముతో ఫిబ్రవరి 1, 1968 న బీ.పీ. మండల్ బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పని చేసారు.  కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి విచారణ చేయించిన ధీరుడు. 

ఆ కమీషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ. ప్రధానితో మాట్లాడడానికి నిరాకరించడముతో ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడముతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఈ సంఘటనలో  బీహార్ పెత్తందారీ వర్గాల గవర్నర్ పక్షపాత వైఖరి స్పష్టంగా ఉంది .అలాగే మండల్ ప్రభుత్వానికి అతను సృష్టించిన అడ్డంకులు దేశ చరిత్రలో చికటి అధ్యాయం. మండల్ తరచూ తన మంత్రులకు, "ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు,  కానీ ప్రభుత్వాల నిర్ణయాలల్లో  ఏ కులతత్వాన్ని సహించవద్దు" అని చెప్పే మండల్ తన ప్రభుత్వములో పరిపాలనలో ఎక్కడా తన కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించారు.. 

మార్చి 5 , 1967 న సోషిత్ దళ్ ( అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించారు. 1972 లో తిరిగి శాసన సభకు ఎన్నికై అప్పటి బీహార్ బ్రాహ్మణ  ముఖ్య మంత్రి ,పాండే మిథిలా యూనివర్సిటీ  పేరుతో అందులో  కింది ఉద్యోగి  నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలని వ్యతిరేకించి దానిపై నిలదీశారు. ఆ తర్వాత 1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించారు. మండల్  తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పని చేసారు. జనవరి 1 ,1979 న జనతా ప్రభుత్వం కాలములో ఏర్పాటు చేసిన రెండవ వెనకబడిన తరగతుల కమీషన్ ఛైర్మన్ గా బీ.పీ. మండల్ భాధ్యతలు చేపట్టారు.. ఈ కమీషనులో బీ.పీ. మండల్ చైర్మన్ గా ఆర్.ఆర్. భోలే , దేవాన్ మోహాన్ లాల్ , దీన బంధు సాహు , కే.సుబ్రహ్మణ్యంలు సభ్యులుగా మరియు ఎస్.ఎస్. గిల్ సెక్రెటరీ గా కమీషన్  ఏర్పడింది. 

నవంబర్ 5, 1979 న దీన బంధు సాహు ఆరోగ్యం సహకరించకపోవడముతో ఆయన స్థానములో ఎల్.ఆర్ . నాయక్ (దళితుడు ) సభ్యుడుగా చేరిండు. ఈ కమీషనుకి తన రిపోర్ట్ నివేదించడానికి కేవలం 11 నెలల సమయం ఇవ్వబడింది అనగా డిసెంబర్ 31 , 1979 నాటికి తన నివేదికని అందజేయాలి. మార్చ్ 21 , 1979 రోజు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి డిల్లీలో కమీషన్ కార్యాలయ ప్రారంభోత్సవం చేసారు.. బీ పీ మండల్ తన బృందముతో పని ప్రారంభించాలంటే అనేకమైన ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వచ్చింది. సెక్రెటరీ , పరిపాలనాధికారి , కొద్ది మంది స్టెనోస్ తోనే 1979 జూన్ , జులై నుండి పని ప్రారంభమైంది. మిగతా సిబ్బంది రిక్రూట్మెంట్ కి మరో నాలుగు నెలలు పట్టింది. కమీషన్ తన పనిలో పూర్తీ స్థాయిలో నిమగ్నం కాగానే ఆగష్ట్ 1979 లో మొరార్జీ దేశాయి ప్రభుత్వం పడిపోయింది.

దేశమంతా తిరుగుతున్న కమీషనుకి ఆ కాలములోనే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలు రద్దై తిరిగి ఎన్నికల్లో ఆ రాష్ట్రాలు బిజీ అయి ఉన్నాయి. బీ పీ మండల్ అభ్యర్ధన మేరకు రిపోర్ట్ అందించే గడువు మరో ఏడాది పెంచబడింది. దేశమంతా తిరుగుతూ అన్ని రాష్ట్రాలు  , కేంద్రపాలిత ప్రాంతాలకి   ప్రశ్నావళులు ఇవ్వబడినయి. సమయాభావం మరియు అననుకూల పరిస్థితుల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలకి కమీషన్ వెళ్ళలేకపోయింది. పలువురు ఆరవ, ఏడవ లోకసభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసన సభ్యులు , ఉద్యమ సంస్థలు , వేల కొద్ది సామాజిక కార్యకర్తలు ,సాధారణ  జనం కమీషన్ ముందు హాజరయ్యారు. కమీషన్ అనేక శ్రమలకోర్చి ఐఐఎమ్ బెంగళూరు, సెన్సస్ రిజిస్ట్రార్ డిల్లి , జేఎన్యూ ఇతర యూనివర్సిటీలు, టాటా బ్ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ , ముంబాయిల నుండి సమాచారం సేకరించింది. కమీషన్ రిపోర్ట్ డ్రాఫ్టింగ్ లో సెక్రెటరీ ఎస్.ఎస్. గిల్ చాల శ్రమ తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అనేక ఇబ్బందులు , అడ్డంకులు ఎదురైనప్పటికి భారత రాజ్యంగ రచనలో బాబా సాహెబ్ పడిన శ్రమ తీరుగానే  ఈ  రెండవ జాతీయ ఓబీసీ కమీషన్ రిపోర్ట్ తయారీలో బీపీ మండల్ గారు శ్రమపడ్డరు. రిపోర్ట్ నివేదించే సమయానికి మండల్ ఆరోగ్యం దెబ్బతిన్నది.  బలహీన వర్గాల పట్ల ఆయానకున్న  నిబద్ధతే కార్యాన్ని సమర్థవంతంగా పూర్తీ చేయించగలిగాయి. చివరికి డిసెంబర్ 31 , 1980 న బీపీ మండల్ కమీషన్ ఓబీసీల కోసం చేయవలిసిన 40 సిఫార్సులు సూచిస్తూ అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి (ప్రభుత్వానికి )తన నివేదికని  సమర్పించింది. కానీ అప్పటికే  జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో మండల్ సిఫార్సుల అమలు మూలన పడింది. 

దేశవ్యాప్తంగా బీసీలంతా కలిసి మండల్ కమీషన్ నివేదికని అమలు పరచాలనే  డిమాండ్ తో 1981 సెప్టెంబర్ 11న “ నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ “ అనే సంస్థని స్థాపించుకున్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ (నాయి బ్రాహ్మణ ) దీని వ్యవస్థాపకులు. మండల్ కమీషన్ నివేదికని అమలుపరచాలని పెరియార్ ద్రావిడ కజగం ఉద్యమ వారసుడు వీరమణి వందకి పైగా సమావేశాలు నిర్వహించారు.  1990 ఆగస్టు 7 తేదీన తొలి భారత బ్రాహ్మణేతర  ప్రధాని వీ.పీ.సింగ్  తమ జనతాదళ్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాన్షీరామ్ గారి మండల్ అమలు కరోయా కుర్సీ ఖాళీ కరో (మండల్ సిఫార్సులను అమలు చేయండి లేదా గద్దె దిగిపోండి ) అంటూ చేసిన డిమాండ్ వల్ల పార్లమెంట్ లో విపి సింగ్ ప్రభుత్వం, మండల్ కమీషన్ సూచించిన 40 సిఫార్సులల్లో  ఒక్కటైన "బీసీలకు కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో 27% రిజర్వేషన్" కల్పిస్తున్నట్లు ఆగష్ట్ 7, 1990 న ప్రకటించారు. బీసీల విషయంలో చేసిన ప్రకటనపై ప్రభుత్వానికి  మద్దతిస్తున్నవారు మద్దతు ఉపసంహరించుకోవడంతో వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. మండల్ కమీషన్ సిఫార్సులన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏడు ఆగష్ట్ 7 ని ‘ మండల్ డే ‘  గా జరుపుకుంటున్నాము. ఆయన కేవలం 61ఏళ్లవయస్సులో క్రియాశీలక రాజకీయాలను విడిచిపెట్టారు.  అలాగే తన నివేదికను అడ్డుపెట్టి దాని నుండి వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ ఫలితాలని ఆశించలేదు.(నేటి ఉద్యమకారులకు ఆదర్శంగా)

ఏప్రిల్ 13, 1982 న పాట్నాలో మరణించే నాటి వరకు తను నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నా గొప్ప సోషలిస్టు యోధుడు మహనీయ మండల్.బీసీలు విద్యా ఉద్యోగ, సామాజిక,రాజకీయ, ఆర్థిక రంగాలలో  తమ న్యాయమైన నమాన వాటా పొందేలా అలాగే మిగిలిన 39 సిఫార్సులు అమలు అయ్యేలా ఉద్యమించి సాధించినప్పుడే  బీ.పీ. మండల్ కి మనమిచ్చే సరైన నివాళి. భారత ప్రభుత్వం అప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా  విస్మరించిన నవభారత నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి 1991 లో అయన శత జయంతి సందర్భంగా అప్పటి జనతాదళ్ ప్రభుత్వం “భారత రత్న“గా  ప్రకటించింది.భారత ఓబీసీ జాతి మహానీయుడైన బీ పీ మండల్ గారి వర్థంతి  సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి “ భారత రత్న“గా  ప్రకటించాలి. అలాగే మండల్ కమీషన్ 39 సిఫార్సు లను అమలు పరచాలి.

Post a Comment

0 Comments