GET MORE DETAILS

Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ.. 40వేలు దాటిన క్రియాశీలక కేసులు. కొత్త కేసులు ఎన్నంటే...?

 Covid-19 Cases: భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ.. 40వేలు దాటిన క్రియాశీలక కేసులు. కొత్త కేసులు ఎన్నంటే...?



భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత నెల ప్రారంభంలో వెయ్యి వరకు నమోదైన రోజువారి కేసుల సంఖ్య.. ప్రస్తుతం భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) 7,830 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసులు 40,215గా నమోదయ్యాయి. కరోనా భారినపడి చికిత్సపొందుతూ 16 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 5,31,016కు చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,47,76,002 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతంగా ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.72శాతంగా నమోదైంది. అదేవిధంగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య దేశంలో ఇప్పటి వరకు 4,42,04,771కి చేరుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. తిరిగి ఏడు నెలల తరువాత ఇంత పెద్ద మొత్తంలో ఒకేరోజు పాజిటివ్ కేసులు నమోదు కావటం దేశంలో కోవిడ్ ఉధృతిని తెలియజేస్తుంది.

ఇదిలాఉంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 21 శాతంగా ఉన్న XBB.1.16 వేరియంట్ కేసులు, మార్చి నెలలో 32 శాతానికి పెరిగాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Post a Comment

0 Comments