GET MORE DETAILS

నవ ర‌త్నాలు - పుష్య‌రాగం విశిష్ట‌త‌

నవ ర‌త్నాలు - పుష్య‌రాగం విశిష్ట‌త‌



గురు గ్రహానికి సంబంధించి రత్నం పుష్యరాగము. పుష్యరాగ రత్నాలు బృహస్పతి (గురు) గ్రహానికి విశేషమైన ప్రీతి గలవి. పుష్యరాగం ఏ రంగులోనైనానూ ఉన్నప్పటికీ ఇందులోని 5 రంగుల యొక్క సమిష్టి ప్రభావం కలిగి వుంటుంది. అందువల్లనే ఈ రత్నము సత్కర్మలకు, బ్రహ్మజ్ఞాననిష్ఠులకు ఉపయోగం. ఈ పుష్యరాగంపై ఎలాంటి చారలుండవు. పారదర్శకముగానూ, కాంతివంతముగానూ ఉంటుంది. మేలుర‌కం కనక పుష్యరాగంను ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది. 

ఎవ‌రు ధ‌రించ‌వ‌చ్చు ?

పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములందు జ‌న్మించిన వారు పుష్యరాగం ధరించవచ్చును. ఇతర నక్షత్రములలో జన్మించిన వారి విషయంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ, నక్షత్రజాతకులు మినహా మిగిలిన అన్నినక్షత్రములవారు పుష్యరాగమును ధరించవచ్చును. మీనం, ధనుస్సు, గురుని రాశులు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర గురు నక్షత్రాల్లో జన్మించినవారు పుష్యరాగంను ధరించవచ్చు. జనన కాలంలో గురుగ్రహం చెడు స్థానాలలోను, దుర్భల రాశులలోను ఉండగా జన్మించినవారు.. గురు మహాదశ నడుస్తున్నవారు కూడా పుష్యరాగం ధరించవచ్చు. అదే విధంగా... ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య జన్మించిన వృషభరాశి జాతకులు, సెప్టెంబర్ 24 నుంచి, అక్టోబరు 23 మధ్య జన్మించిన తులారాశి జాతకులు వజ్రాన్ని ధరించవచ్చును. శుక్ర దశలో ఉన్న వారు కూడా వజ్రం ధరించడం వల్ల సకల సంపదలు చేరువవుతాయి. 

ఫ‌లితాలు:

మల్లెపువ్వువంటి తెల్లని రంగు కలిగినవి గానీ, గోగు పువ్వువంటి పసుపు పచ్చని రంగుతో నున్నవి గానీ, పుష్యరాగములను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ధరించిన వారికి విశేష పాండిత్యం వ‌స్తుంది. విద్య‌, ఆర్థిక‌, కుటుంబ సుఖం, వంశాభివృద్ధి, బంధువుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. బలమును, వీర్యమును, నేత్రజ్యోతిని పెంచేందుకు కనకపుష్యరాగ ధారణ చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. ఉన్నత విద్య, మంత్రి పదవి, న్యాయ, అధ్యాపక, రాజకీయ వృత్తులకు ఇది అనుకూలం. ఆర్థిక బాధలు తొలగి ఆదాయం పెరగడానికి, సంతాన ప్రాప్తికి పుత్ర సంతానానికి వివిధ శాస్త్రాలలో విజ్ఞానానికి, కీర్తికి, మంత్రసిద్ధికి పుష్యరాగం ధరించడం శుభదాయ‌కం.

ధరించే పద్ధతి:

ఏ జాతికి చెందిన పుష్యరాగమైనప్పటికీ దోష రహితంగా చూసి బంగారు ఉంగరంలో ధరించటం మంచిది. వెండిలోనూ ధరించడం రెండవ పక్షం. ఇతర లోహములు పనికి రావు పంచలోహములలోను ఈ ఉంగరం ధరించవచ్చునని కొందరు చెబుతారు. బంగారం లేక వెండితో చేయబడిన ఉంగరము యొక్క పైపీఠము దీర్ఘచతురస్రాకారంగా చేయించి అందు పుష్యరాగ రత్నమును ఇమిడ్చి పూజించి ధరించవలెను. మృగశిర పుష్యమి, ఉత్తర, పూర్వాభద్ర నక్షత్రములు కలిగియున్న గురువారం గానీ లేక పుష్యమీ నక్షత్ర గురు ఆదివారములందుగానీ సంభవించిననాడు గురు హోరకాలమునందు వర్జదుర్ముహుర్తములు లేకుండా చూసి, పుష్యరాగమును ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యములందుంచి, రెండవ రోజు మంచి గంధపు నీటిలో ఉంచి శుద్ధి చేయాలి. ఆ తదుపరి ఉంగరానికి విధ్యుక్తముగా పూజ జరిపించాలి.

పసుపు రంగులో ఉండే ఈ రత్నమును గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించి, గ‌ణపతిని ధ్యానించి ఎవరైనా గురువుల సలహా ప్రకారం "ఓం ఐం శ్రీం హ్రీం క్లీం బృహస్పతయే స్వాహా"అను మంత్రమును 108 పర్యాయములు జపించి ఆ తర్వాత ఉంగరంను మ‌రోసారి కనులకద్దుకొని కుడి చేతి చూపుడు వ్రేలుకి ధరించవలెను. స్త్రీలు కూడా ఈ పుష్యరాగ ముద్రికను కుడిచేతికి ధరించుటే మంచిది. ఉంగరమునకు అడుగు భాగం రంధ్రంను కలిగి ఉండటం శాస్త్రీయం. అందువల్ల పుష్యరాగమునందలి వివిధకాంతులకు చెందిన కిరణశక్తి శరీరమునందు చొచ్చుకుపోయి అంతర్గత నాడీమండలములందు తమ శక్తిని ప్రభావితము గావించి దివ్యసిద్ధులను సత్ఫలితాలను కలుగ చేయగలదు.

Post a Comment

0 Comments