ఏపీలో 3 నుంచి 9 తరగతులకు ఇంగ్లీష్ లోనే పరీక్షలు -ప్రవీణ్ ప్రకాష్ కీలక ఆదేశం.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువుల్ని ప్రోత్సహించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం గత మూడేళ్లుగా పాఠ్యపుస్తకాల్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించి పంపిణీ చేస్తోంది. అలాగే ఇంగ్లీష్ భాషపై విద్యార్ధులు పట్టు సంపాదించేందుకు వీలుగా బెండపూడి ఫార్ములాతో పాటు టోఫెల్ పరీక్షల ప్రిపరేషన్ స్ధాయిలో ఇంగ్లీష్ నేర్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్ధులకు ఆగస్టులో ఫార్మాటివ్ అసెస్ మెంట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గణితం, ఈవీఎస్, సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో వ్రాయడానికి విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలతో మాట్లాడిన విద్యాశాఖ కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
మూడేళ్లుగా విద్యార్థులను ద్విభాషా పాఠ్యపుస్తకాల్లో చదువుల్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రధాన సబ్జెక్టుల్లో పరీక్షల్ని ఇంగ్లీష్ మీడియంలో రాసేలా చూడాలని ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ఇంత చేసిన తర్వాత కూడా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయలేకపోతే, తమ బోధనలో లోపం ఉన్నట్లేనని ఆయన తెలిపారు. కాబట్టి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ విద్యా సంవత్సరంలో తమ మొదటి ఫార్మేటివ్ పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో రాస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఆగస్టు 1 నుంచి జరిగే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 1 పరీక్ష కోసం విద్యార్థిని సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలపై ఫీడ్ బ్యాక్ కూడా స్వయంగా తీసుకుంటానని ప్రవీణ్ ప్రకాష్ అధికారులకు తెలిపారు. జూలై 31 సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రంలోని విద్యార్థులను ర్యాండమ్ గా కాల్ చేసి సిలబస్ పూర్తయిందా లేదా, క్లాస్ వర్క్ నోట్స్ ను టీచర్లు సరిదిద్దారా లేదా, దీన్ని ఫొటో తీసి వాట్సాప్ కు పంపమని అడుగుతానన్నారు. ఇందులో విఫలమైతే టీచర్లను ఎంఈవోలతో పాటు తనను సచివాలయానికి వచ్చి కలవాలని కోరతానన్నారు.
0 Comments