GET MORE DETAILS

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం



దేశమంటే మట్టి కాదోయ్…దేశమంటే మనుషులోయ్…!

జనం… జనం… ప్రభంజనం! ఈ భూమ్మీద… వందకోట్ల మందికి… ఆహారం దొరకడం లేదు… 40 కోట్ల మందికి… పౌష్టికాహారం లేదు… ఏటా కోటి మందికి పైగా పిల్లలు… ఆకలితో చనిపోతున్నారు… దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా? జనాభా పెరుగుదల!

ప్రపంచంలో పెరుగుతున్న జనాభా నియంత్రణకుగాను ఏటా జూలై 11 న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ జరపాలని నిర్ణయించారు. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజైన జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. అప్పట్నుంచి ప్రతిఏటా ఒక్కో నినాదంతో జనాభా దినోత్సవం జరుపుతున్నారు. 1989లో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జనాభా సమస్యపై ప్రపంచ దేశాలన్ని దృష్టి కేంద్రీకరించి చిత్తశుద్ధితో జనాభా నియంత్రించాలని, ఈ ఏడాదిని ‘కుటుంబ సంక్షేమం మానవహక్కు’గా విస్తృత ప్రచారం కల్పించి, అవగాహన చైతన్య సమితి ఆదేశాలను సభ్యదేశాలు పాటిస్తున్నాయి.

మానవజాతి వైద్య-ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాలవల్ల మనుషుల జీవితకాలం పెరిగింది. అదే సమయంలో ప్రపంచ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. అదుపులేని జనాభావల్ల ఆకలి, వ్యాధులు పెరిగిపోయాయి. సంక్షేమం అడుగంటింది. మానవహక్కుల సమస్యలు, యుద్ధ భయాలు పెరిగాయి.

ప్రపంచ జనాభా పెరుగుదల సమస్యల్ని, వాటి అదుపునకు చర్యల్ని ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది.

అవనిపై జనాభా కోట్లాదిగా పెరుగు పోతోంది. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమై పోతోంది. కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజే ఎందుకంటే, ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది మరి!


• ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోందన్న మాట.

• ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందిప్పుడు.

• క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే.

• 1850లలో మొదటిసారి జనాభా వందకోట్లను దాటింది. అక్కణ్నించి కేవలం 150 ఏళ్ల కాలంలోనే 650 కోట్లను దాటేసింది. వచ్చే యాభై ఏళ్లలో 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

• ప్రతి రోజు 4,00,000 మంది పుడుతుంటే, 1,40,000 మంది చనిపోతున్నారు.

• ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం మంది అంటే మూడు వందల కోట్ల ఎనభై లక్షల మంది నివసిస్తున్నారు. ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.

• మన దేశం విషయానికి వస్తే 1750లో జనాభా పన్నెండున్నర కోట్లు మాత్రమే ఉండేది. 1941 కల్లా 38.9 కోట్లు అయ్యింది. అదే ఇప్పుడు 112 కోట్లు అయ్యింది.

• అయిదున్నర అడుగులుండే మనుషులు సుమారు 22,93,02,720 మంది ఒకరిపై ఒకరు నిలుచుంటే చంద్రుణ్ని చేరుకోగలరు. ఇలా భూమిపై ఉండే మొత్తం జనాభాతో 29 సార్లు చందమామపైకి నిచ్చెన వేసెయచ్చు.

ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టిన దేశం మన దేశమే. 1950లోనే కుటుంబ నియంత్రణ కొరకై నూతన సూత్రీకరణాలను చేసి లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయినాము. కారణాలు అనేకం కావచ్చును. ముఖ్యమైనవిగా పేర్కొనాల్సినవి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం. ప్రభుత్వ పథకాలలో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢనమ్మకాలు, అవిద్య, స్ర్తి సాధికారిత లేకపోవడం. ఇదే విషయంలో 1976లో భారత్‌లో (పాపులేషన్ కంట్రోల్ పాలసి) జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా అన్ని కోణాలలో తీర్చి దిద్దడం. ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడం, జన జీవన శైలిని, ప్రమాణాలను వృద్ధి పర్చడం జరిగింది. 

ఈ భూమీద వందకోట్ల మందికి పౌష్టికాహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అధిక జనాభాగల దేశాలు తక్షణమే తీసుకోవలసిన జాగ్రత్తలివి. 

ప్రజలు మూఢనమ్మకాలను వీడి, కులాలకు, మతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పథకాలను ఆచరించాలి. 

‘ఒక బిడ్డ ముద్దు – రెండోది వద్దు’ అన్న నినాదం అక్షర సత్యాన్ని చేయాలి. 

స్ర్తి సాధికారిత పెంచాలి. స్ర్తి విద్యను పోషించాలి. స్ర్తి విద్యావంతురాలైతే సమాజం ఉన్నతస్థాయికి చేరడం ఖాయం.

 ముఖ్యంగా యువతరం నడుం కట్టాలి. జనాభాను అదుపుచేసి విద్యావ్యాప్తి చేసి ప్రతి ఒక్కరు మానవ బాంబుగా కాక మానవ వనరుగా మారిన రోజున దేశభ్యుదయానికి వందకోట్ల మార్గాలున్నాయి అనడంలో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.

జన స్థిరీకరణ, నియంత్రణ, ప్రస్తుత ఆర్థిక రంగానికి అనుసంధానం చేస్తే జన జీవనజ్యోతి దేదీపమాన్యంగా వెలుగుతుంది. భూమాత భారం తగ్గుతుంది. 

పర్యావరణ నిపుణుల ప్రకారం జనాభా పెరుగుదలను తగ్గించకుంటే ప్రకృతే ఆ పనిని సమూలంగా చేపడ్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు లాంటి బీభత్సాలతో అధిక భారాన్ని భూమాతే తక్కువ చేసుకుంటుంది. కనుక జనాభా నియంత్రణ మన అందరి కర్తవ్యం.

Post a Comment

0 Comments