GET MORE DETAILS

జిజ్ఞాసువుల సందేహాలకు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖశర్మ గారి సమాధానాలు

జిజ్ఞాసువుల సందేహాలకు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖశర్మ గారి సమాధానాలు




ప్ర : మహాలక్ష్మి అమ్మవారు అష్ట లక్ష్ములుగా అవతరించింది కదా! దానికి సంబంధించిన కథను వివరిస్తారా?

జ: అష్టలక్ష్ములు అవతారాలు కావు. వాటికి కథ లేదు. మనకు కావలసిన ఐశ్వర్యాలు ప్రధానంగా ఎనిమిది. వాటిని ప్రసాదించే ఒకే ఐశ్వర్యాధి దేవత మహాలక్ష్మి.

అష్టవిధ ఐశ్వర్యాలుగా విభిన్నంగా చూసినప్పుడు ఒక్క లక్ష్మినే ఎనిమిదినామ రూపాలతో ఆరాధిస్తున్నాం. తద్వారా మనకు అవసరమయ్యే అష్ట ఐశ్వర్యాలు ఆ తల్లి దయలేనని గ్రహించగలం.


ప్ర : దశ మహావిద్యలలో శ్రీవిద్య ఉన్నదా? అసలు దశ విద్యల పేర్లేమిటి?    'షోడశీ' అంటే ఏ దేవి? వీటిని 'విద్యలు' అని ఎందుకంటారు. 

జ: కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమవతీ, బగళా, మాతంగి, కమలాత్మిక - ఈ పది దశమహావిద్యలు. ఇందులో మూడవది షోడశి. ఈ షోడశినే 'శ్రీవిద్య' అంటారు. ఈ దేవి మహాత్రిపుర సుందరి. లలితగా, రాజరాజేశ్వరిగా ఆరాధింపబడే విద్య ఇది. విద్య అనే మాటకి మంత్రమనీ, ఉపాసన అనీకూడా అర్థం. 'విద్య' అంటే 'తెలియజేసేది'. దేవతను తెలియజేసే మంత్రం విద్య. అయితే స్త్రీ దేవతామంత్రాలను 'విద్య' అంటారని ఒక సంప్రదాయం.

                       

ప్ర : లక్ష్మీపూజ (వరలక్ష్మీపూజ, ధనలక్ష్మీ పూజ వంటివి) చేశాక ఉద్వాసన ఎలా చెప్పాలి?

జ: వరలక్ష్మీపూజ గానీ, ధనలక్ష్మీపూజ గానీ ఏ లక్ష్మీపూజ చేసినా 'ఉద్వాసన' చెప్పకూడదు. ఆవాహన మాత్రమే చెప్పాలి. సరస్వతీ దేవిని పుస్తకాదుల్లో ఆవహింప జేసినప్పుడు కూడా ఉద్వాసన చెప్పరాదు.

నవరాత్రుల్లో దేవీపూజాదుల్లో కలశస్థాపన చేసే సంప్రదాయం, పద్ధతులు వేరు. నిత్యపూజలలో ఉద్వాసన ఉండదు. అలాగే వరలక్ష్మీ పూజ వంటివి చేసేటప్పుడు కలశంలో లక్ష్మీదేవిని ఆవహింపజేస్తారు. మరుసటి రోజు నమస్కరించి కలశాన్ని తీయాలి. అంతేగానీ, ఉద్వాసన మంత్రాలు చెప్పరాదని ఆచారం.

Post a Comment

0 Comments