ఆంధ్రా మిల్టన్ (నేడు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి)
యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836
19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకరు. ఇరవై రెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడు పోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారు.లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండడవల్లి గ్రామములో వెంకన్న ,రత్నమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలోసాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలు విద్యపూర్తిచేసి రాజమండ్రి ఆర్యపాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు గా చేరారు. ఆపై ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించారు.
తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశారు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపారు. ఆ తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాల గా మార్చబడింది.
30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింప బడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశారు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం,
శ్రీరామజననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించారు. ఆయన వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి.
సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశారు.
1908లో ఒక ప్రెస్ స్థాపించారు. 1916 లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివిప్రచురించారు.చిలకమర్తి ఏకసంతగ్రాహి. అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగినవారు.
లక్ష్మీ నరసింహం గారు మొదటి తరం సంఘ సంస్కర్త. 1909 లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల (రామమోహన పాఠశాల) స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుప బడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేసారు.
అంథుడైనప్పటికి చిలకమర్తి వారు దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ లాండ్ ఎంతగానో ప్రశంసించారు.బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.
1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.1897 లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు."భరత ఖండంబు చక్కని పాడియావు" ఆనేది ఆయన రచనే.1946 జూన్ 17న లక్ష్మీనరసింహం తుదిశ్వాస విడిచారు.ఆయనను ఆంధ్రా మిల్టన్ అని కూడా పిలుస్తారు.
0 Comments