GET MORE DETAILS

నేడు గుర్రం జాషువా 128వ జయంతి. మహాకవి జాషువాకు అక్షర నివాళి. ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా...

నేడు గుర్రం జాషువా 128వ జయంతి. మహాకవి జాషువాకు అక్షర నివాళి. ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా...




'రాజు మరణించే నొకతార రాలిపోయే / సుకవి మరణించే నొకతార గగనమెక్కే / రాజు జీవించు రాతి విగ్రహములందు / సుకవి జీవించు ప్రజల నాల్కల యందు' అంటూ జాషువా...రాజుకు, సుకవికి తేడాను వివరిస్తూ రాసిన ఈ పద్యం వినని, చదవని కవి అంటూ తెలుగు నేలపై ఉండరని నేను అనుకుంటాను.

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. నాడు తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

భారతీయ సాహిత్యంలో కవిది ప్రథమ స్ధానం. ఇంకా చెప్పాలంటే సృష్టికర్తతో సమానం. సంస్కృతంలో కాళిదాసుకు ఎంత పేరుందో తెలుగులో జాషువాకు అంత పేరుంది. కాళిదాసును కవికుల గురువు అంటారు. దాదాపు అదే స్థానం జాషువాకు కూడా లభించింది. సంస్కృత వాజ్మయం కాళిదాసు మయమైతే తెలుగు వాజ్మయం జాషువామయం. అలాంటి జాషువా కుటుంబం ఎంత పేదరికం అనుభవించిందనడానికి కింది ప్రస్తావన ఒక ఉదాహరణ మాత్రమే.

సంక్రాంతికి, ఉగాదికి, దసరాకు కొత్త బట్టలు ధరించటం, పండుగను ఘనంగా చేసుకోవటం చాలామంది ఇళ్లలో చూస్తూనే ఉంటాం. అలాగే జాషువా ఊళ్ళో కూడా ఒక పండుగ రోజున తోటి పిల్లలు, పెద్దలు చాలామంది కొత్తబట్టలు ధరించి, తాజాగా చేసిన పిండివంటలు తింటూ కనిపించారు. చిన్నవాడైన జాషువా, తమ్ముడు ఇశ్రాయేలు ఇద్దరూ తమకు కొత్త బట్టలు కావాలని, మిఠాయి పెట్టమని తల్లిని మారాము చేయసాగారు. తల్లి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటిలో సరుకులు నిండుకున్నాయి. పిల్లల దీనాలాపాన వింటే తల్లి హృదయం పిండి వేసినట్లయింది. పిల్లలను వెంట తీసుకొని అప్పైనా పుడుతుందేమోనని, ఊరిలోని కొట్టుకు వెళుతోంది. ఒక వీధిలో ఒక చిన్న పాప పళ్ళెం నిండా ఏవో తినుబండారాలు తీసుకొనిపోతూ వుండగా కొన్ని కిందబడ్డాయి. ఆ బాలిక వాటిని చూసుకోకుండా అలాగే వెళ్ళిపోయింది. అది చూచిన జాషువా.. వెంటనే వెళ్లి ఆ కింద పడిన వస్తువును అపరిశుభ్రం అన్న విషయానికి కూడా తావు ఇవ్వక తీసుకున్నాడు ఆనందిస్తూ. తల్లి చూచింది. 'అది తప్పు అనటానికి కూడా ఆమెకు నోరు రాలేదు' చూడండి. జాషువా తన బాల్యంలో ఎంతటి పేదరికం అనుభవించాడో.

తను కవిత్వం రాసే తొలినాళ్ళలో ఎన్ని అవమానాలు పొందాడో చూడండి. ఒకసారి జాషువా రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. అదే కంపార్ట్‌మెంట్‌లో వున్న పండితుడు జాషువా చేతిలో వున్న పుస్తకాలు చూచి, ఆయన కవి అని గుర్తించి కవిత్వం వినిపించమని కోరాడు. జాషువా స్వీయ కవిత్వం వినిపించాడు. భేష్‌ ! భేష్‌ !! మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం అని ప్రశ్నించాడు.

'నేను క్రైస్తవుణ్ణి' అని జవాబిచ్చి ఆ తరువాత 'కవికి గానీ, కళకు గానీ కులమతాలున్నాయా?' అని ప్రశ్నించాడు జాషువా. 'అయ్యయ్యో! వాణి అంటుపడ్డది' అంటూ చివుక్కున లేచిపోయి మరోచోట కూర్చున్నాడు ఆ పండితుడు.

ఈ సంఘటన జాషువా హృదయాన్ని కలచివేసింది. తన ఆవేదనను మానితరావు వేంకట కుమార మహీపతి సూర్యరా య వారికి (పిఠాపురం రాజావారికి) నివేదించుకున్నాడు. ఏమని నివేదించుకున్నాడు: ''నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే/ ఖా కమనీయ వైఖరులుగాంచి ''భళీ! భళి'' యన్నవాడె ''మీ/దేకుల'' మన్న ప్రశ్న వెలయించి, 'చివాలున లేచి పోవుచో/ బాకున గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్‌' అంటాడు జాషువా.

జాషువా కవిగా ఉజ్వల దశలో వున్నప్పుడు కూడా కొన్ని వ్యథా ఘట్టాలు ఎదుర్కోక తప్పలేదు. అలాంటి వాటిలో కాకినాడ సభ ఒకటి. 'కోరిక కాకినాడ సభకుం జనినాడను... భూరి కవీంద్ర గోష్టికిని బోయితి, నా గరిమన్‌ హేళన చేసె నొక్కకవి ధిక్కారంబు గావించుచున్‌' అని జాషువా తనని అవమానించిన ఆ కవి ధిక్కారానికి తల వంచలేదు. పౌరుషంతో, సంపూర్ణమైన ఆత్మ విశ్వాసంతో తనని అవమానించే వారి నోళ్ళను శాశ్వతంగా మూయించే పద్యం చెప్పాడు.

''గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న/న్నెవ్విధి దూరినన్‌ నను వరించిన శారద లేచిపోవునే/ యివ్వసుధాస్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంటమూనెదన్‌ /రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ సవరించెద నాంధ్ర వాణికిన్‌'' అని పద్యంతోనే సమాధానమిస్తాడు జాషువా.

జాషువా జీవితంలో ఇటువంటి ఎదురుదెబ్బలు ఎన్నో తగిలాయి. వీటికి ఆయన భయపడలేదు. రాటుదేలాడు. జీవితంలోని ప్రతి సన్నివేశం లోంచి ఆయన కవిత్వాన్ని దర్శించాడు. ఆయన జీవిత వాంఛ కవిత్వ రూపంలో నెరవేరింది. కవిత్వమే ప్రధానాంశంగా బతికిన జాషువా అందుకోసం ఎంతో సంఘర్షణకు గురికావాల్సి వచ్చింది. ఆర్థికంగా, మానసికంగా ఎన్నో కష్టాల్ని వ్యథా ఘట్టాల్ని చూడవలసి వచ్చింది

ఇలాంటిదే మరో సంఘటన: అవధానిగా ప్రసిద్ధిగాంచిన కొప్పరపు సుబ్బారావు కవి ఒకసారి వినుకొండకు వచ్చారు. ఆయన గౌరవార్థం కవులంతా కలిసి వినుకొండ ఊళ్ళో సభ ఏర్పాటు చేశారు. కవుల మీద, కవిత్వం మీద ఉన్న గాఢమైన అభిమానం కారణంగా జాషువా 'కొప్పరపు' కవిపై అభినందన పద్యాలు రాశాడు. ఆ కవికి పద్యాలు ఎలా అందజేయాలా అని మధనపడుతూ ఉంటే, ఒక బ్రాహ్మణ మిత్రుడు జాషువా అవస్థ గుర్తించి, చెయ్యి పట్టుకొని సభలోకి తీసుకెళ్ళి కవిగారితో పరిచయం చేయించాడు. తన మీద ఒక స్థానిక యువకవి రాసిన పద్యాలు చదివి 'కొప్పరపు' కవి ఎంతో సంతోషించాడు. ఈ లోపు సభలో పెద్ద అలజడి మొదలయ్యింది. నిమ్నజాతి వాడు ఈ సభలోకి ఎలా వచ్చాడని దుర్భాషలాడుతూ జాషువాను అనిమానించినప్పుడు..ఆ అవమాన భారంతో బయటపడి...ఆ రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా గడిపాడు జాషువా. జాషువా ఈ అవమాన భారం లోంచి తేరుకోవడానికి కవిత్రయం రాసిన మహాభారతం చదివాడు. కుమారాస్త్రం ఘట్టంలో కర్ణుడితో తనని అన్వయం చేసుకున్నాడు. కర్ణుడితో తనను, తనలో కర్ణుడిని చూసుకున్నాడు.

జాషువా తొలి కవితా ప్రయత్నాలకు దోహదకారులైన వ్యక్తుల్లో తోలేటి సుబ్బారావు పాత్ర మరువలేనిది. వారి ప్రోద్బలంతోనే రాజమండ్రిలోని చింతామణి నాటక మండలి యజమాని సత్యవోలు గున్నేశ్వర రావుని కలిసి చింతామణి నాటక మండలిలో రచయితగా కుదురుకున్నారు. గున్నేశ్వరరావు ప్రోద్బలంతో 'రుక్మిణీ పరిణయం' అనే తన తొలి నాటకం రాశారు. అంతేకాక, కాశీనాథుని నాగేశ్వరరావు ప్రోత్సాహం వలన జాషువా రచనలు భారతి పత్రికలో విరివిగా అచ్చవుతూ ఉండేవి.

కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి/ పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు / తరుగు లేదు, విశ్వనరుడ నేను.

జాషువా తనను తాను ఆవిష్కరించుకున్న పద్యమే ఆయన అనుభవించిన మత సంఘర్షణకి ప్రతీకగా పై పద్యాన్ని చూడవచ్చు. జాషువా వ్యక్తిత్వంలోను, కవిత్వంలోనూ వచ్చిన పరిణామానికి ఈ పద్యాన్ని తార్కాణంగా చెప్పవచ్చు.

ఒక దృశ్య, శ్రవణ నాటకంలో ఒక వాతావరణాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో కవి ప్రతిభ...అనన్య సామాన్యంగా ఉండాలి. లేకపోతే ఆ నాటకం రక్తి కట్టదు. మరుభూమిలో సాధారణంగా కనిపించే ఒక వాతావరణాన్ని జాషువా ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టారు.

సత్య హరిశ్చంద్రుడు రాజ్యాన్నంతా పోగొట్టుకున్న తరువాత కాశీకి వెళ్ళి ఆఖరున కాటి కాపరి ఉద్యోగం చేశాడు. సర్వం సహా చక్రవర్తి అయినటువంటి సత్యహరిశ్చంద్రుడు విధి వశాత్తు వేదాంత ధోరణిలో పలికే మాటలను సత్య హరిశ్చంద్ర నాటకంలో జాషువా..హరిశ్చంద్రుడు పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసి రాసిన పద్యాలు ఆ నాటకానికే వన్నె తెచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జాషువా కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ మొదలైన ఎన్నో బిరుదులు పొంది ఉండవచ్చు గాక, కానీ తాను మొదటి సన్మానంలో అందుకున్న పది సేర్ల పెసలు, తన స్వంత ఊరిలో మొదటిగా జరిగిన సన్మానంలో పొందిన 116 రూపాయల బహుమతి ఆయనకు గొప్ప అనుభూతి.

విస్పష్టమైన భావ వ్యక్తీకరణ జాషువా సొంతం. ఆయన ఒకానొక సందర్భంలో : 'జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. పేదరికం. కులమత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాకు ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కులబేధాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోగలిచాను. వాటిపై కత్తి గట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం'. అంటాడు. మతము, కులము..మనిషిని ఎంత కుంగదీస్తాయో స్వానుభవంతో దెబ్బతిన్న పులి అయ్యాడు. అంటరానివాడు కవిత్వం రాయడం నేరమన్న వ్యవస్థని ధిక్కరించాడు.

జీవితంలో ఎన్నో అమానవీయ సంఘటనలను ఎదుర్కొన్న జాషువా... ఆ అమానవీయ సంఘటనలను తన రచనలలో మానవీయ దృక్పథంతో వెలువరించారు.

జాషువా రచనలు ప్రజాపక్షం. జీవితం పట్ల అభ్యుదయ దృక్పథం గలవాడు. మూఢాచారాలు, మత డాంబిక ఉత్సవాలు ఆయనకు గిట్టేవి కాదు. తన కుటుంబంలో కూడా ఇలాంటివి జరగడానికి ఇష్టపడేవాడు కాదు. తన రచనలలో ఉదారవాదిగా కనపడవచ్చు గాని ఆచరణలో ఆయన పూర్తి నాస్తికుడు. ఆయనలో కొన్ని తిరుగుబాటు లక్షణాలు కనబడతాయి. పాత విలువల్ని, కుహనా సంస్కృతుల్ని ధ్వంసం చేయాలనే పరిణామ దృష్టి ఆయనలో కనబడుతుంది. ఇందుకు ఉదాహరణగా హేమాలతా లవణంల వివాహమే.

కడు పేదరికం నుండి వచ్చిన వ్యక్తి పట్టుదలతో, కార్యదీక్షతో పద్మభూషణ్‌ దాకా ఎదిగి, ఎన్నో సాంఘిక సమస్యలను చాలా సరళమైన భాషలో అచ్చ తెలుగులో సమాజానికి పట్టి చూపి తెలుగు నేలపై తన ముద్రను దశాబ్దాలుగా పరిచిన జాషువాకు నివాళులు.

గుర్రం జాషువా

జననం : సెప్టెంబరు 28, 1895,గుంటూరు జిల్లా,వినుకొండ

మరణం : 24 జూలై 1971 (aged 75), గుంటూరు

నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ

ఇతర పేర్లు : జాషువా

వృత్తి : రచయిత,కవి,సాహితీకారుడు.

సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి

మతం : క్రిస్టియన్ 

కులం : యాదవ్

తండ్రి : వీరయ్య

తల్లి : లింగమ్మ

జీవిత విశేషాలు:

జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ,మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోన్నాడు. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. పెత్తందారీ వర్గాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసురేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.

ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.

జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు.

సాహితీ వ్యవసాయం:

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి అణచి వేతకు గురైన వర్గాలకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.

సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా

1919 - రుక్మిణీ కళ్యాణం

1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం

1924 - కోకిల

1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం

1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత

1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు

1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు

1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం

1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ

1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల

1932 - స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.

1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక,

1934 - ఆంధ్ర భోజుడు

1941 - గబ్బిలము

1945 - కాందిశీకుడు

1946 - తెరచాటు

1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ 

1950 - స్వయంవరం

1957 - కొత్తలోకం

1958 - క్రీస్తు చరిత్ర

1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు

1966 - నాగార్జునసాగరం, నా కథఅవార్డులు

1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.

1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.

బిరుదులు , పురస్కారాలు

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.

ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

Post a Comment

0 Comments