GET MORE DETAILS

పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు...?

 పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు...?



తల్లిదండ్రులు తమ పిల్లలు విజయవంతం కావాలని కోరుకోవడం సహజం. అయితే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే సంబంధం పిల్లల అభివృద్ధిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఆ సంబంధం బలంగా ఉంటే పిల్లలు మానసికంగా చక్కగా ఎదుగుతారు. అన్ని విధాలా ఉత్సాహంగా ఉంటారు. సహజంగా పిల్లలు తల్లిదండ్రుల నుండి కొన్నింటిని ఆశిస్తారు. అవేంటో మనం తెలుసుకుని వారిని ప్రోత్సహిస్తే విజయం సాధిస్తారు. మరి పిల్లలు మన నుండి ఏం కోరుకుంటారో.. వారికి ఎలాంటి సహకారం ఇవ్వాలో చూద్దాం…

చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ ప్రేమను మొత్తం లోలోపలే దాచుకుంటారు. పైకి మాత్రం కోపం ప్రదర్శిస్తారు. దీని వల్ల మీరు వాళ్ళను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం కాదు. ఎప్పుడూ కోప్పడుతూ ఉండడం వల్ల తమ పట్ల మీకు అసలు ప్రేమలేదని భావించే అవకాశం ఉంది. అందుకే మీరు మీ పిల్లలలో ”నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పాలి. మీరు వారిని ప్రేమిస్తున్నారని పిల్లలు తెలుసుకోవాలి. పిల్లలతో ఇలా చెప్పడం చాలా మందికి వింతగా అనిపించవచ్చు. కానీ మీ పిల్లలతో ఈ మాటలను వారానికి ఒకసారి లేదా రోజుకు ఒకసారి చెప్పి చూడండి. వారిలో మార్పు మీరే గమనిస్తారు.

నిరుత్సాహ పరచొద్దు...

సాధారణంగా పిల్లలు ఏదైనా కొత్త పని చేయాలని కోరుకుంటారు. దాని వల్ల వారు ఏమైనా ప్రమాదంలో పడతారేమోననే ఉద్దేశంతో తల్లిదండ్రులు ముందు అంగీకరించరు. పైగా వారిని నిరుత్సాహ పరుస్తారు. ”వెళ్ళు!” వాస్తవానికి పిల్లలు నిజంగానే ప్రమాద కరమైన, అనైతికమైన పనులు చేస్తున్నట్టుగా భావిస్తే తల్లిదండ్రులు కచ్చితంగా వద్దని చెప్పాలి. ఇటువంటి సమయాల్లో తల్లిదండ్రులు తెలివిగా వ్యవహరించాలి. అదే వారు మంచి దారిని ఎంచుకున్నపుడు మీరు ప్రోత్సహిస్తే ఎదుగుతారు. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడం కన్నవారి బాధ్యత. తల్లిదండ్రుల లక్ష్యం పిల్లలకు కేవలం ఆశ్రయం కల్పించడం, వారికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడం మాత్రమే కాదు. యుక్త వయసును వారు ఎదుర్కోవలసి ఉంటుంది. టీనేజ్‌ అనేక సవాళ్లతో నిండి ఉంటుంది. అందుకే బాల్యం నుంచే మీ పిల్లలను వాటిని అధిగమించే విధంగా సిద్ధం చేయాలి. దీని కోసం వారికి మీ సహకారం చాలా అవసరం. కాబట్టి వారు ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ”ముందుకు సాగండి” అని మీరు వారికి చెప్పాలి.

ప్రోత్సాహం…

ఈ మాటలు మీ పిల్లలకు మీరు చాలా తరచుగా చెప్పాలి. అయితే వారు విజయాలు సాధించినప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ చెబుతుండాలి. మీ పిల్లలు చేసిన దాని గురించి మీరు గర్వపడటం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ పిల్లలు సాధించిన దాని గురించి మీరు గర్వపడటంలో తప్పు లేదు. మరీ చెప్పుకోదగిన విషయం కాకపోయినా మీరు వారి గురించి గర్వపడుతున్నారని వారు తెలుసుకోవాలి. అప్పుడే వారికి నమ్మకం వస్తుంది. పిల్లలు దయ, ఔదార్యం, వినయం, ధైర్యం… ఇలా మరేదైనా సానుకూల ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారని మీరు గమనించినప్పుడు ”నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను” అని చెప్పండి. ఈ చిన్న మాట వారిలో విపరీతమైన శక్తిని నింపుతుంది.

నిన్ను నమ్ముతున్నాను:

బాల్యం, కౌమారదశ అనేది సందేహాల సమాహారం. నేను విఫలమైతే అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? నేను అనుకున్నది సాధించగలనా? నేను స్లిమ్‌గా, స్మార్ట్‌గా ఎందుకు ప్రాచుర్యం పొందలేను? పిల్లలు తరచూ తమను తాము అడిగే ప్రశ్నలు ఇవి. వారి సందేహాలకు మీరు ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. సరైన సూచనలు ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో వారిని సరిగ్గా గైడ్‌ చేయాలి. తల్లిదండ్రులు తమని తక్కువగా చూస్తున్నారని భావిస్తే పిల్లలు భరించలేరు. ఆత్మన్యూనతకు గురవుతారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చిన్న పొరపాటు చేసినా భరించలేరు. ”నువ్వు దేనికీ పనికి రావు” అంటూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది చేయడం సరైనది కాదు. ముందు మీరు మీ పిల్లల్ని నమ్మండి. వారిలో ధైర్యాన్ని నింపండి. ”నేను నిన్ను నమ్ముతున్నాను” అని చెప్పండి. అదే వారికి కొండంత బలం.

సారీ చెప్పండి:

మీ పిల్లలకు మీరు ఎప్పుడైనా సారీ చెప్పారా? తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకు మేము క్షేమాపణ చేప్పేదేంటి అనుకుంటారు. అయితే కొన్ని విషయాల్లో పెద్ద వాళ్ళమనే అహంకారం ప్రదర్శిస్తే అది మీ పిల్లలను ప్రమాదంలో పడేస్తుంది. మీ పిల్లలతో వాగ్వాదం చేసేటప్పుడు మీరు నిర్దాక్షిణ్యంగా ఏదైనా పదం వాడితే ”నన్ను క్షమించండి, నేను అలా చెప్పక తప్పదు” అనండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు.

ఎలా చేశావో నాకు చూపిస్తావా...?

ఏదో ఒక సమయంలో, మీ పిల్లలు మీ కంటే కొన్ని విషయాల గురించి మరింతగా నేర్చుకుంటారు. సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌, మార్కెటింగ్‌ గురించి మీకన్నా వారు ఇప్పటికే ఎక్కువ తెలుసుకొని ఉంటారు. అయినప్పటికీ కొంత మంది తల్లిదండ్రులు పిల్లల్ని ‘మీరు చిన్నవాళ్ళు మీకేం తెలుసు’ అంటుంటారు. దాంతో పిల్లలు తాము నేర్చుకున్న కొత్త విషయాలను తల్లిదండ్రులకు చెప్పేందుకు వెనకాడతారు. ఇక ఏ విషయాన్ని మీతో పంచుకోరు. కాబట్టి మీ పిల్లలకు మీకన్నా ఎక్కువ తెలిస్తే దాన్ని అంగీకరించండి. ”నువ్వు దీన్ని ఎలా చేశావో నాకు చూపిస్తావా?” అని అడిగి చూడండి. వారికి ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. మీకూ పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన సంబంధానికి ఇది చాలా అవసరం.

నేను నీతోనే వున్నాను:

పిల్లలు పెద్దయ్యాక మరింత స్వాతంత్య్రం కోరుకుంటారు. చదువు, కెరీర్‌ ఎంపికలో వారి కంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు తమకు తెలియకుండా ఏమీ చేయకూడదని అనుకుంటారు. కానీ పెద్దల ఆలోచన ఇలా ఉండకూడదు. మీ పిల్లలు యుక్తవయసులో ఉంటే వారు సొంత నిర్ణయాలు తీసుకోడానికి అనుమతిం చండి. మరికొంత కాలంలో వారు పెద్దవారు అవుతారు. తుది నిర్ణయం తమదేనని మీరు స్పష్టం చేసేవరకు వారు మీ సలహాలు, సంప్రదింపులను అభినందిస్తారు. వాళ్ళ నిర్ణయాలు వారు తీసుకునేటపుడు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ”నేను మీతోనే వున్నాను” అని మీ పిల్లలు ధైర్యం చెప్పండి. అప్పుడు వారు బాహ్య అనుబంధంలోకి అడుగుపెట్టినప్పుడు మరింత ఆత్మవిశ్వాసం పొందుతారు

Post a Comment

0 Comments