GET MORE DETAILS

ఆరోగ్య సిరి ఉసిరి - కార్తీక మాసంలో ఎలాంటి మేలు చేస్తుందంటే...?

ఆరోగ్య సిరి ఉసిరి - కార్తీక మాసంలో ఎలాంటి మేలు చేస్తుందంటే...?



ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం, అమలక వృక్షం అని అంటారు.. ఈ చెట్టు మహిమ విన్నా, చదివినా, చెప్పిన జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.. అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి.. కాండంలో రుద్రుడు.. పైభాగంలో బ్రహ్మదేవుడు.. కొమ్మల్లో సూర్యుడు.. ఉప శాఖలలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.. కార్తీకమాసంలో ఉసిరికాయ పై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడం తో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి ఆ ఇంటి నలుమూలల ప్రవేశించదు.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లకి లేదా ధాత్రీఫలం అనీ కూడా పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటి పండులాగానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే వగరు దాని ఇంటిపేరు. కానీ ఆ వగరే ఈ పండుకున్న బలం. కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువే ఉన్నాయి. ఇతర పండ్లలో కన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. కార్తీకమాసంలో మనకు ఎన్నేన్నో ఆరోగ్య సిరులను పంచే "ఉసిరి " గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఆయుర్వేద శాస్త్రాన్ని పరిశీలిస్తే "ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒకవేళ ఉసిరి వేర్లు పెరుగుతూ నీటి బావిలోకి పాకితే అందులోని ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఉసిరి విత్తనాలను నీటి బావిలో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా ఆరోగ్యకరమైనది.

శీతకాలం నుంచి వేసవి వరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. కొందరు పంచదార పాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి ఒక అద్భుత ఔషధమే. అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే మరొక ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో కాయే కాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి. కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అప్పుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగ్గుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం, పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన, రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన కనక ధారా స్తవం మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం. శంకరులు బాల బ్రహ్మచారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి ' అని కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ తాను ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు.

క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రిచెట్టు ( ఉసిరిచెట్టు) ను చెబుతారు. ఉసిరిచెట్టు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. సాధారణ రోజుల్లో మనం అసాక్షి భోజనాలు  చేస్తుంటాం. అంటే ... సమయం దాటాక తింటా, అతిథికి -బ్రహ్మచారికి పెట్టాకుండా తింటాం, ఒక్కోసారి బయటనుంచి తీసుకొచ్చి తింటాం, ఇంకోసారి నైవేద్యం లేకుండా తింటాం. ఇలా మొత్తం 9 రకాల భోజనాలు ఉన్నాయి. వాటిలో కేవలం రెండే రెండు ఆమోదయోగ్యం. ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా మనం నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామివారి అమ్మవార్ల ప్రసాదం మాత్రమే కాదు.... అసాక్షి భోజనం ద్వారా మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడిని తరిమేస్తుందని చెబుతారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు.

Post a Comment

0 Comments