ఏపీలో కొనసాగుతున్న అంగన్ వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా ( డిసెంబర్ 16 నాటికి) సమ్మె చేస్తున్నారు.
ఏపీ సర్కార్ ఓవైపు వాలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది. అయితే, మూడో విడత చర్చలు కూడా ఫలించలేదు. అటు అంగన్వాడీ సిబ్బంది.. ఇటు ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు.. దీంతో సమ్మె కొనసాగుతోంది. దీంతో అంగన్వాడీ యూనియన్లు నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరింది.
అయితే, అంగన్వాడీల చాలా అంశలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అన్నింటికీ ఓకే చెప్పిన మంత్రివర్గ ఉపసంఘం వేతనాల పెంపుపై మాత్రం వెనక్కి తగ్గుతోంది అని అంగన్వాడీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు తమ జీతాలు పెంచాలని వారు కోరుతున్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు 26 వేల రూపాయలు హెల్పర్లకు 20 వేల రూపాయలు చేయాలని ఆందోళన చేస్తున్నారు. జీతాలు పెంచేందుకు మాత్రం మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించడం లేదు. ప్రస్తుతానికి జీతాలు పెంచే పరిస్థితిలేదని ఏపీ ప్రభుత్వం చెప్పేసింది.
జీతాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నట్టు వెల్లడించాయి. ప్రభుత్వం మొండి వైఖరితో ఉండటం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి. బెదిరించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం గైడ్‌లైన్స్ అనుసరించి జీతాల పెంపు, గ్రాట్యూటి అంశాన్ని పరిశీలిస్తామంటే సమ్మె విరమించడానికి తాము రెడీగా ఉన్నామని అంగన్వాడీ యూనియన్లు ప్రకటించాయి.
0 Comments