GET MORE DETAILS

వేపతో కమ్మని ఆహారపదార్థాలు - డా,, జి.వి.పూర్ణచందు

 వేపతో కమ్మని ఆహారపదార్థాలు - డా,, జి.వి.పూర్ణచందుఏ వ్యాధులూ లేని ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని రక్షించటం, రోగం వచ్చినప్పుడు దాన్ని తేలికగా తగ్గించటం అనే లక్ష్యాలతో పెరిగిన తెలుగింటిమహావృక్షం వేప.

చేదు విషం, కటిక చేదులాంటి మాటలతో చేదు రుచిని ఈసడిస్తాంగానీ, చేదే అమృతంకూడా అనే సంగతిని వేపచెట్టు పదేపదే గుర్తు చేస్తుంటుంది.

వేపచిగుళ్ళు, వేపచెక్క వేపచెట్టు జిగురు, వేపపూలు, వేపపళ్ళు, వేపనూనె... ఒకటేమిటీ-వేపను ఉపయోగించు కోవటంలో తెలివి ప్రయోగించగలగాలే గానీ, ఎన్నెన్నో ఆహార ప్రయోజనాలున్నాయి.

వేపతో తయారుచేసుకోగల ఆహారపదార్ధాలకు పరి మితంగా మనం కొన్ని ప్రయోజనాలను చర్చించుకుందాం.

వేపపువ్వులతో వడియాలు

రుబ్బినమినప్పిండిలో కడిగి శుభ్రం చేసిన వేపపూలను కలిపి వడియాలు పెట్టుకుంటారు. వేపపూల వడియాలు చిరుచేదుగా ఉంటాయి. రుచికరం. అన్నంలో తినదగినవి. విడిగాకూడా వేయించుకుని తినవచ్చు. పిల్లల కడుపులో నులి పురుగులు పోవటానికి ఇవి ఔషధంగా పనిచేస్తాయి. కదుపులో ఎసిడిటీని తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దురదలు మొదలైన ఎలర్జీ వ్యాధులుండేవాళ్లకు ఇవి దివ్యౌ షధంగా పనిచేస్తాయి. తరచూ తిరగబెట్టే జ్వరంలో వీటిని తింటే జ్వర తీవ్రత త్వరగా తగ్గుతుంది. నోటి పూత, నోటి దుర్వాసన, అజీర్తి, నాలుక జిగురుగా ఉండటం, అన్న హితవు కలగక పోవటం, ఏది తిన్నా రుచిగా లేకపోవటం, అన్నం సయించక పోవటం ఇలాంటి బాధలు వేపపూల వడియాలతో తగ్గుతాయి.

వేపపూల పచ్చడి

వేపచెట్లు బాగా పూతమీదున్న కాలంలో చెట్టుకింద దుప్పట్లు లేదా చాపలు పరిస్తే వేపపూలు రాలిపడతాయి. వీటిల్ని సేకరించి కడిగి శుభ్రపరచుకుని, తడిపోయే దాకా ఆరనిచ్చి కొద్దిగా బెల్లం, చింతపండు, కారం కలిపి నూరితే అదే వేపపూలపచ్చడి. ఎండినపూలను సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవటం కోసం ఒకడబ్బాలో నిలవ పెట్టుకోవచ్చు. ఎండినవేపపూలతో కారప్పొడిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎండిన వేపపూలను కొద్దిగా వేపనూనె లేదా రోజూ వాడుకునే వంటనూనెతో వేయించి, కారప్పొడి తయారుచేసుకోవచ్చుకూడా!

చేదు, వగరు రుచులు కలిగి ఆరోగ్యాన్ని కాపాడే గుణా లతో కూడుకున్న వేపపూల పచ్చడిని లేదా వేపపూల కార ప్పొడిని షుగరు రోగులకూ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికీ రోజూ అన్నంలో మొదటిముద్దగా పెట్టటం ఒక ఆరోగ్య దాయకమైన వైద్యం. దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దురదల్లాంటి ఎలర్జీవ్యాధులున్నవారికి ఇది తప్పనిసరి ఆహార పదార్థం. ఏ రకమైన చర్మవ్యాధులున్నవారైనా వేపపూల పచ్చడి/ పొడిని రోజూ తింటూ ఉంటే సొరియాసిస్, బొల్లికూడా త్వరగా " తగ్గేందుకు కావలసిన అనుకూలపరిస్థితులు వస్తాయి. వేప పూలలో విషదోషాలను హరించే యాంటీఆక్సిడెంటు గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేపను ప్రధాన ఆహారద్రవ్యంగా తీసుకోవటం అవసరం.

వాతవ్యాధులతో బాధపడేవారికి వేపపూలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. అసాధ్యకీళ్లవాతం, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పక్షవాతం, సిర్రోసిస్లాంటి భయంకరమైన లివర్ వ్యాధుల్లో వేపపూలు ఉత్తమఫలితాలను తెస్తాయి.

వ్యాధిని తగ్గించుకోవాలనే పట్టుదలతోనూ భక్తి భావం తోనూ రోగి వేపపూలను వాడుకోగలగాలి. పేగుపూత, అజీర్తి, జీర్ణకోశవ్యాధులు, ముఖ్యంగా ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వ్యాధుల్లో వేపపూలకు ఔషధగుణం ఉంది. దాన్ని మనం సద్విని యోగం చేసుకోగలగాలి.

Post a Comment

0 Comments