GET MORE DETAILS

మహాకవి కాళ్ళకూరి నారాయణరావు : ఏప్రిల్ 28 కాళ్ళకూరి జయంతి

మహాకవి కాళ్ళకూరి నారాయణరావు : ఏప్రిల్ 28 కాళ్ళకూరి జయంతి


యం. రాం ప్రదీప్

తిరువూరు

9492712836


తెలుగులో మహాకవి అని కొంతమంది కవులనే పిలుస్తారు. ఆ విధంగా గౌరవం పొందిన కవులలో కాళ్ళకూరి నారాయణరావు ఒకరు. సాహితీవేత్త, కవి, నాటక కర్త, పత్రికా సంపాదకులు, ఛాయాగ్రాహకుడు, న్యాయవాదిగా పేరు పొందిన కాళ్ళకూరి 1871 ఏప్రిల్‌ 28న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, మత్స్యపురి గ్రామంలో అన్నపూర్ణమ్మ, బంగారు రాజు దంపతులకు జన్మించారు. కాకినాడలో పాడి వెంకట నారాయణ వద్ద కావ్య, నాటక, అలంకార గ్రంథాలు అధ్యయనం చేశారు. కొంతకాలం ఫొటోగ్రాఫర్‌ వృత్తి చేపట్టిన నారాయణరావు హరికథలు చెప్పేవారు. కొద్దికాలం ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తి సాగించినా అది నామమాత్రమే.

కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడుల ప్రభావం ఎక్కువ. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవుల స్పర్ధల్లో కొప్పరపు కవులను సమర్థించారు. కాళ్లకూరి పేరు చెప్పగానే మూడు నాటకాలు గుర్తుకొస్తాయి. చింతామణి (1921), వరవిక్రయం (1923), మధుసేవ (1926). సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నాటక రచనను సాధనంగా చేసుకొని వీటిని రాశారు. వేశ్యా లంపటత్వాన్ని నిరసించడానికి చింతామణి, వరకట్న దురాచారాన్ని దుమ్మెత్తిపొయ్యడానికి వరవిక్రయం, మద్యపానం విషతుల్యమని చెప్పడానికి మధుసేవలను రచించారు. చింతామణి, వరవిక్రయం- అనంతర కాలంలో చలన చిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించాయి.చింతామణి పేరు వినగానే కొంతమంది పెదవులపై  చిరునవ్వు ఉదయించవచ్చు. మరికొంతమంది నొసలు చిట్లించవచ్చు. కానీ ఈ నాటకం నేటికీ రంగస్థలంపై ఆదరణ పొందుతూనే ఉంది.

మద్యపాన వ్యసనం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో చక్కని సంభాషణలతో, రసవత్తరమైన సన్నివేశాలతో, తెలుగు- ఆంగ్ల పద్యాలు కూడా చొప్పించి, సందేశాత్మక నాటకంగా ‘మధుసేవ’ రాశారు. కాళ్లకూరి రచించిన పద్మవ్యూహం, చిత్రాభ్యుదయం నాటకాలు కూడా ప్రసిద్ధమైనవే.

కాళ్ళకూరి వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం. ఈ నాటకం ఆధారంగా వరవిక్రయము చలనచిత్రం సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మితమైంది. ఆ చిత్రం ద్వారా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ తెలుగు తెర కు పరిచయమయ్యారు. కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు.

వరకట్న దురాచారాన్ని ఖండించే శుభలేఖ చిత్రం ముగింపు వరవిక్రయము ముగింపును పోలి ఉండడం గమనార్హం. జంధ్యాల రూపొందించిన అహ! నా పెళ్ళంట ! సినిమాలో లక్ష్మీపతి పాత్రకు, దేవదాసు కనకాల దర్శకత్వంలో ఓ ఇంటి భాగోతం సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్రలు చూస్తే సింగరాజు లింగ రాజు జ్ఞాపకం వస్తాడు. అల్లు రామలింగయ్య చాలా సినిమాలలో పోషించిన పాత్రలకు వెంగళప్ప పాత్రకు బాగా పోలికలు ఉంటాయి.

ఎన్నిసార్లు చదివినా మరలా మరలా చదవాలినిపించాలనే నాటకం వరవిక్రయం.

1927 జూన్‌ 27న ఈ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించినా, ఆయన నాటకాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు.సంఘ సంస్కరణ లక్ష్యంగా ఆయన రచనలు చేశారు.

Post a Comment

0 Comments