రక్త హీనతకు మందు - కరివేపాకు
కరివేపాకును కూరలో కనిపిస్తే తీసి పారేస్తుంటారు కొందరు. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప చాలామంది కూరలో కరివేపాకును తినడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆధునిక పరిశోధ కులు. ఐరన్ లోపం వల్లే రక్తహీనత వస్తుందని తెలిసిందే. కానీ అది లేకపోవడమే కాదు, దాన్ని శోషించుకోలేకపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. అలా శరీరం ఐరన్ తీసుకోవడానికి ఫోలిక్ ఆమ్లం దోహదపడుతుంది.
ఐరన్, ఫోలిక్ఆమ్లం కరివేపాకులో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతను అధిగమించేందుకు దీన్ని మించింది లేదు అంటారు ఆహార నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. కాలేయం దెబ్బతిన్న వాళ్ళకి కరివేపాకు ఎంతో మేలుచేస్తుంది. ఇందులోని క్యాంఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంటు ఆక్సీకరణ ఒత్తిడినీ హానికర రసాయనాలను తొలగిస్తుంది.
టీస్పూను నెయ్యిలో అరకప్పు కరివేపాకు రసం, కాస్త పంచదార, మిరియాల పొడి వేసి సిమ్లో మరిగించి తీసుకుంటే కాలేయ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వుని సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు. పరగడుపున కొద్దిగా పచ్చి కరివేపాకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకు మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇది విరేచనాలనీ తగ్గిస్తుంది. వ్యాధి వెంటనే తగ్గాలంటే చిన్నరేగుపండు సైజులో కరివేపాకుని ముద్దలా చేసి మజ్జిగతో రోజుకు రెండు మూడుసార్లు తీసుకోవాలి. క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ కారణంగా ఎదురయ్యే దుష్ఫలితాలుంటాయి. ఆ దుష్ఫలితాలు తగ్గాలంటే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది.
దగ్గు, కఫంతో బాధపడుతుంటే టీస్పూను కరివేపాకు పొడిని తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది. కరివేపాకులోని హానికర సూక్ష్మజీవులని నివారించే గుణం వల్ల మొటిమలూ, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ తగ్గుముఖం పడతాయి. కరివేపాకులోని అనేక పోషకాలు శిరోజాలు దెబ్బతినకుండాను, ఊడిపోకుండాను చూస్తాయి. అంతే కాదు కరివేపాకును నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది.
విజ్ఞప్తి:
ఆరోగ్య సంబంధిత మెసేజ్ లన్నీ ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బుల గురించి నివారణలు సూచనలు కూడా అవగాహన పెంచడానికి మాత్రమే. మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. మిత్రులు గమనించాలి.
0 Comments