GET MORE DETAILS

విటమిన్ బీ-12: ఇది శరీరానికి ఎంత అవసరం? దీని లోపంతో వచ్చే సమస్యలేంటి? విటమిన్ బీ-12 ఎందుకు అవసరం?

విటమిన్ బీ-12: ఇది శరీరానికి ఎంత అవసరం? దీని లోపంతో వచ్చే సమస్యలేంటి? విటమిన్ బీ-12 ఎందుకు అవసరం?



శరీరంలో జరిగే అనేక చర్యలకు విటమిన్లు అవసరం. 

ఇవి రెండు రకాలు. 

ఒకటి కొవ్వులో కరిగేవి. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటివి మొదటి రకానికి ఉదాహరణ.

రెండోది నీటిలో కరిగేవి. విటమిన్ సి, బీ-కాంప్లెక్స్ వంటివి దీనికి ఉదాహరణ. ఈ విటమిన్ బీ-కాంప్లెక్స్‌లోని ఒక కీలక విటమిన్ బీ-12.

విటమిన్ బీ-12 అనేది ఒక మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మపోషకమని దీప్తి ఖాటూజా చెప్పారు. ఇది తక్కువ పరిమాణంలో అవసరమున్నప్పటికీ, శరీరంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు.

శరీరంలోని ప్రతీ కణానికి విటమిన్ బీ-12 అవసరం. ఆహారాన్ని శక్తిగా మార్చడం, కొత్త అణువులను తయారు చేయడం, కణాల్లో జరిగే రసాయన చర్యల్లో విటమిన్ బీ-12 కీలక పాత్ర పోషిస్తుంది.

మన నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది అని దీప్తి వివరించారు.

శరీరమంతా ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి బీ-12 అవసరమని అమృతా మిశ్రా తెలిపారు.

ఏ ఏ ఆహారాల్లో దొరుకుతుంది?

విటమిన్ బీ-12 ముఖ్యంగా మాంసాహారంలో లభిస్తుంది. మొక్కలకు సంబంధించిన ఆహారాల్లో ఇది ఉండదు. అదనంగా ఈ విటమిన్‌ను చేర్చే ఫోర్టిఫైడ్ ఆహారాల్లో దీన్ని పొందవచ్చు.

మాంసం, సీ ఫుడ్, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తుల్లో విటమిన్ బీ-12 ఉంటుంది. విటమిన్ బీ-12 సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి.

విటమిన్ బీ-12 అనేది క్యాప్సూల్స్, ఇంజెక్షన్ రూపంలో లభిస్తుందని అమృతా మిశ్రా చెప్పారు. అయితే, ఏదైనా సప్లిమెంట్‌ను తీసుకునేముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలని ఆమె సూచించారు.

విటమిన్ బీ-12 సప్లిమెంట్‌ను డాక్టర్‌ సూచించినట్లుగా నిర్ధారిత సమయం వరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని దీప్తి అన్నారు. 

విటమిన్ బీ-12ను శరీరం ఎలా గ్రహిస్తుంది?

మన శరీరం, విటమిన్ బీ-12ను గ్రహించడం ఒక కఠిన ప్రక్రియ. ఆహారంలో విటమిన్ బీ-12, ప్రోటీన్లతో బంధించి ఉంటుంది.

విటమిన్ బీ-12ను మన శరీరం శోషించుకునే ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. మొదటి దశలో మన పొట్టలోని యాసిడ్, ఆహారంలోని ప్రోటీన్ల నుంచి విటమిన్ బీ-12ను వేరు చేస్తుంది.

రెండో దశలో, ప్రోటీన్ నుంచి వేరైన ఈ విటమిన్ బీ-12 అనేది పొట్టలో ఉత్పత్తి అయ్యే మరొక ప్రోటీన్‌(ఇన్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్)తో చేరుతుంది. తర్వాత శరీరం దీన్ని శోషించుకుంటుంది.

సప్లిమెంట్ల ద్వారా లభించే విటమిన్ బీ-12 అనేది ఏ ప్రోటీన్‌తోనూ ముడిపడదు. కాబట్టి దీని శోషణకు మొదటి దశ అవసరం ఉండదు. అయితే, ఈ సప్లిమెంట్‌లోని బీ-12ను శరీరం శోషించుకోవడానికి కూడా అది ఒక ఇన్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్‌తో చేరడం కచ్చితంగా అవసరం.

ఒకవేళ విటమిన్ బీ-12 శోషణ ప్రక్రియ ఎక్కడైనా సరిగ్గా జరుగకపోతే బీ-12 లోపం తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.

తగినంత బీ-12 విటమిన్ పొందని వారికి లేదా శరీరం దానిని సరిగ్గా శోషించుకోని వారికి ఈ లోపం వచ్చే ప్రమాదం ఉందని ఎన్‌ఐహెచ్ పేర్కొంది. ఉదాహరణకు,

వృద్ధులు: వయసు పెరిగే కొద్దీ చాలామంది పొట్టలో తగినంత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆహారంలోని విటమిన్ బీ-12ను శరీరం గ్రహించడం కష్టంగా మారుతుంది. 50 ఏళ్లు పైబడిన వారికి సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఆహారాల అవసరం పడొచ్చు.

ఆట్రోఫిక్ గ్యాస్ట్రిస్ ఉన్నవారు: ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి కారణంగా పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇన్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉత్పత్తి తగినంతగా జరుగదు. దీనివల్ల బీ-12ను శరీరం శోషించుకోలేదు.

అలాగే రక్తహీనత ఉన్నవారికి, పేగులకు శస్త్రచికిత్స జరిగిన వ్యక్తులకు, శాకాహారుల, వీగన్లు ఈ విటమిన్‌ను తగినంత పొందలేకపోవచ్చు.

ఏయే సమస్యలు వస్తాయి?

విటమిన్ బీ-12 లోపం లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు.

విటమిన్ బీ-12 లోపం బయటకు కనిపించడానికి సమయం పడుతుంది. దీని లక్షణాలు కూడా నెమ్మదిగా కనిపిస్తాయి. కాలక్రమేణా తీవ్రమవుతాయి' అని దీప్తి అన్నారు.

లక్షణాలు

• చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, జలదరింపు.

• నడవడంలో ఇబ్బంది (బ్యాలెన్స్ సమస్యలు).

• రక్తహీనత, నాలుక వాపు.

• ఆలోచించడం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది లేదా జ్ఞాపకశక్తి క్షీణించడం.

• బలహీనత, అలసట.

• చర్మం పసుపు రంగులోకి మారడం.

• మూడ్ స్వింగ్స్, చిరాకు.

• ఏకాగ్రత లోపించడం.

రక్తపరీక్ష ద్వారా విటమిన్ బీ-12 లోపం ఉందో లేదో నిర్థరిస్తారు.

Post a Comment

0 Comments