శాలరీల్లో 45 శాతం EMIలే తినేస్తున్నాయ్. భారతీయ మిడిల్ క్లాస్ ఆర్థిక స్థితిపై 'రెడిట్' పోస్ట్ వైరల్
ఈఎంఐల ఉచ్చులో భారతీయ మధ్యతరగతి విలవిల- నెలవారీ శాలరీల్లో 45 శాతం ఈఎంఐ చెల్లింపులకే సరి. 'రెడిట్' యూజర్ పోస్ట్ వైరల్
మన దేశంలో ఎంతోమంది ఈఎంఐల భారంతో సతమతం అవుతున్నారు. ప్రతినెలా ఈఎంఐలను సర్దుబాటు చేసే సరికి వారి తల ప్రాణం తోకకు వస్తోంది. ఈఎంఐలకు డబ్బులను సర్దుబాటు చేసే ప్రయత్నంలో చివరకు అత్యవసరాలకూ, వైద్య ఖర్చులకూ డబ్బును మిగుల్చుకోలేని దుస్థితి దాపురిస్తోంది. ఈఎంఐల ఉచ్చులో పడి భారతదేశ మధ్యతరగతి మానవులు నలిగిపోతున్న తీరును గణాంకాలతో సహా వివరిస్తూ ఇటీవలే ఓ రెడిట్ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్ల నడుమ వాడివేడి చర్చ జరిగింది.
❓ఈఎంఐలపై మనం చేసే కొనుగోళ్లు కూడా ఆర్థిక పురోగతేనా?
❓వాటి ఉచ్చులో ఇరుక్కొని మిడిల్ క్లాస్ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతోందా?
❓మన ఆదాయాలను ఈఎంఐలు తినేస్తున్నాయా?
అనే అంశాలపై నెటిజన్లు మనసు విప్పి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆలోచింపజేసేలా ఉన్న ఆ వివరాలపై మనమూ ఓ లుక్ వేద్దాం.
ఆదాయాల పెరుగుదలలో స్తబ్దత : అందుకే ఈఎంఐ కొనుగోళ్లు.
ఫోన్లు,ల్యాప్‌టాప్‌లు,టీవీలు,ఫ్రిజ్‌లు,వాషింగ్ మెషీన్లు, కార్లు,ఫర్నీచర్,ఇల్లు ఇలా అన్నీ ఈజీగా ఈఎంఐపై దొరుకుతున్నాయి. భారత దేశ ప్రజల తలసరి ఆదాయాలు వేగంగా పెరగడం లేదు. కానీ ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయని ఆ రెడిట్ యూజర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆదాయాలు బాగా పెరగాలంటే ఇంకా చాలా ఏళ్ల టైం పడు తుందని,అప్పటివరకు వేచి చూసే ఓపిక లేక ఎంతో మంది ఈఎంఐలపై వస్తువులను కొనేస్తుంటారని ఆయన తెలిపారు. ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించే వారు చిన్నగా ఉన్న ఈఎంఐ అమౌంటును చూస్తున్నారే తప్ప, రాబోయే కాలంలో ప్రతినెలా తమపై పడబోయే ఆర్థిక భారాన్ని, నెలవారీ ఆదాయం నుంచి చేయబోతున్న కేటాయింపును లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ఈఎంఐ ద్వారా వస్తువులను కొనే ప్రక్రియ చూడటానికి ఆర్థిక పురోగతిలా కనిపిస్తున్నా,వాస్తవానికి అది పేద, మధ్యతరగతి కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసే ఉచ్చులా పరిణమిస్తోందని రెడిట్ యూజర్ అభిప్రాయపడ్డారు.
వేతనాల్లో 33 నుంచి 45 శాతం ఈఎంఐలకే..!
"భారత్‌లోని ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో 33 శాతం నుంచి 45 శాతం దాకా ఈఎంఐ చెల్లింపులకే పోతోంది. ప్రస్తుతం భారత్‌లోని కుటుంబాల పొదుపులు సైతం 47 ఏళ్ల కనిష్ఠానికి తగ్గిపోయాయి. మనదేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల పొదుపుల వాటా 5.3 శాతంగానే ఉంది. 'ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ - పెర్ఫియోస్' సంయుక్త సర్వేలో ఈవివరాలను గుర్తించారు" అని రెడిట్ యూజర్ పేర్కొన్నారు.
మధ్యతరగతి vs ఈఎంఐలు, రెడిట్ యూజర్ ఏం చెప్పారు?
▪️ప్రతినెలా వచ్చే ఆదాయం ఎంత? దానిలో ఎంత భాగాన్ని రుణాల చెల్లింపులకు కేటాయిస్తున్నారు? ఈ రెండింటి నిష్పత్తిని 'డెట్ సర్వీస్ రేషియో' అని పిలుస్తారు.
▪️'డెట్ సర్వీస్ రేషియో' 40 శాతానికిపైగా ఉండే వారిని బ్యాంకులు,ఆర్థిక సంస్థలు హైరిస్క్ కేటగిరీ వ్యక్తులుగా పరిగణిస్తాయి.
▪️భారత్‌లోని 45 శాతం మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం 'డెట్ సర్వీస్ రేషియో' 40 శాతానికిపైనే ఉంది.
▪️భారత్‌లోని యువత చేతుల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో 43 శాతం ఈఎంఐలపై కొన్నవే. హిడెన్ ఛార్జీలను సైతం పట్టించుకోకుండా వాటిని కొన్నారు.
▪️మన దేశంలో 90 రోజులకుపైగా బకాయి ఉన్న వ్యక్తిగత రుణాలు 5 శాతానికిపైగా ఉన్నాయి.
దేశ ప్రజలు ఈఎంఐల ద్వారా అవసరాలను తీర్చుకోవడం కంటే కోరికలను తీర్చుకోవడానికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.50వేల స్మార్ట్‌ఫోన్ నెలవారీ ఈఎంఐ రూ.2500 చిన్నగా కనిపిస్తుంది. కానీ దాన్ని ప్రతినెలా చెల్లించే క్రమంలో ప్రజలు వైద్యఖర్చులు,అత్యవసర వ్యయాలకూ డబ్బులను మిగుల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈఎంఐ వ్యవస్థ వల్ల దీర్ఘకాలంలో బ్యాంకులు, కార్పొరేట్లు లాభాలను గడిస్తారు. పేద,మధ్యతరగతి కుటుంబాలకు మిగిలేది మాత్రం ఆర్థిక భారమే.
ఈఎంఐల కొనుగోళ్లను ఆర్థిక వికాసంగా చూపించేలా తప్పుడు ప్రచారం జరుగుతోంది.
వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల రియాక్షన్స్
వైరల్ అయిన ఈ రెడిట్ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.ఉద్యోగుల ఆదాయాలు పెరగకపోవడం, ద్రవ్యోల్బణం ప్రభావం,భారతీయుల విలువల్లో, ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులకు లింక్ పెడుతూ తమదైన శైలిలో అభిప్రాయాలను రాశారు.
"భారత్‌లో ఆదాయాలు వేగంగా పెరగడం లేదు. మా అంకుల్ ఒకరు పోలీసు శాఖలో పనిచేస్తుంటారు. అంకుల్ వాళ్ల నాన్నగారు ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించి భూమి, ఇల్లు కొన్నారు.పొదుపు చేసిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు కూడా చేశారు.ఇప్పుడు మా అంకుల్ తన కుమారుడి చదువుల కోసం ఈపీఎఫ్‌పై ఆధారపడాల్సి వస్తోంది. మొత్తం ఈపీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకున్నా, వాళ్ల నాన్న కొన్న తరహా ఇల్లును కొనలేరు" అని ఓ రెడిట్ యూజర్ చెప్పారు.
"సాధారణంగానైతే గతంలో భారతీయులు బాగా డబ్బులు పొదుపు చేసేవారు. బంగారం, భూములు కొనేవారు. కానీ కొత్త తరం ఆలోచనలు మారాయి. వాళ్లు భారతీయ విలువలను మర్చిపోయారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ఫ్యాషనబుల్, లగ్జరీ జీవితం కోసం ఏమాత్రం ఆలోచించకుండా ఈఎంఐలపై వస్తువులను కొనేస్తున్నారు. అప్పుగా తీసుకున్నా డబ్బును మంచిచోట ఇన్వెస్ట్ చేయాలి. కానీ మనం అదే డబ్బుతో తరుగుదల ఉండే వస్తువులను కొంటున్నాం.నెలకు రూ.30వేల ఆదాయమున్న వారు కూడా రూ.లక్షల ఐఫోన్లు కొంటున్నారు. దీనివల్లే ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతున్నారు" అని మరో రెడిట్ యూజర్ కామెంట్ చేశారు.
"దేశంలోని కుటుంబాలపై ఉండే మొత్తం అప్పులు, దేశ జీడీపీ ఈ రెండింటి నిష్పత్తినే 'హౌజ్ హోల్డ్ డెట్ టు జీడీపీ రేషియో' అంటారు. ప్రస్తుతం భారత్‌లో 41.9 శాతం 'హౌజ్ హోల్డ్ డెట్ టు జీడీపీ రేషియో' ఉంది. డెవలప్ అవుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో సగటున 46.6 శాతం మేర 'హౌజ్ హోల్డ్ డెట్ టు జీడీపీ రేషియో' ఉంది. అంటే భారత్‌లోని కుటుంబాలపై అప్పుల భారం ఎక్కువే ఉంది.ఇది ఆందోళన కలిగించే విషయం.భారత్‌లోని కుటుంబాలపై ఉన్న అప్పుల్లో 29 శాతమే హౌజింగ్ లోన్లు ఉన్నాయి.మిగతా అప్పులతో వస్తువులనే కొన్నారు. ఆదాయాలు తక్కువగా ఉన్నందునే ఈఎంఐలనే జనం ఆధారపడుతున్నారు" అని మరో రెడిట్ యూజర్ వ్యాఖ్యానించారు.
By ETV Bharat Telugu Team
Published : September 1, 2025 at 7:44 PM IST
0 Comments