కుజ దోష నివారణకు సుబ్రమణ్య స్వామి వ్రతం
కుజదోషం భయంకరమైనది కాదు ''ఇంత వయసు వచ్చినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా'' ? అనే ప్రశ్న వినిపించిన వెంటనే, ''ఆ అమ్మాయికి కుజ దోషం ఉందట''! అనే సమాధానం వినిపిస్తూ వుంటుంది. ఇక ఈ మాట విన్న వాళ్లంతా కుజదోషం అంత భయంకరమైనదా? అని అనుకోవడం సహజం.
అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసిన పనిలేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్యకూడా కాదు. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.
భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడటం వలన ఆయన మనసు అదుపు తప్పి 'రేతస్సు' భూమిపై పడింది. 'మంగళుడు'అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా ... పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువని చరిత్ర చెబుతోంది.
ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో వున్నాడా? లేక దోషస్థానంలో ఉన్నాడా ? అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం వుంటే అది ఏ స్థాయిలో ఉందో అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా అడిగితెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం వుందని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి వుంటుంది.
నక్షత్రాలు పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు. మరికొందరు జ్యోతిష్యులు నక్షత్ర పొంతన మాత్రమే వివాహ బంధాన్ని నిర్ణయించదంటున్నారు. కుజ దోష జాతకులను కుజదోష జాతకులకే వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజునికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీపురుషులు ఒక్కటవడం, వంశావృద్ధికి కుజుడే కారకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానానికి జ్యోతిష్య నిపుణులు ప్రాధాన్యత ఇస్తారు.
కుజగ్రహ ప్రభావం ఇరు జాతకులకు ఉంటే.. ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే దోషాలుంటే మాత్రం వివాహ అడ్డంకులు, వివాహ బంధంలో సమస్యలు వంటివి తప్పవని, వీటి నుంచి బయటపడాలంటే తప్పక దోష పరిహారం చేయాల్సిందేనని వారు చెబుతున్నారు.
ఇక కుజ దోషం వుందని చెప్పినా విచారంలో మునిగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా వుండదు. అది వున్న స్థానాన్ని బట్టి తీవ్రత ఫలితం మారుతూ వుంటుంది. ఇక మేషం - వృశ్చిక రాశులలో పుట్టినవారికి కుజదోషం వర్తించదని 'జ్యోతిష్ గ్రంధ్'అనే ప్రాచీన కాలంనాటి గ్రంధం చెబుతోంది.
కుజ దోషం వున్నవారు భూమాతను సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన, అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే మంగళ వారాల్లో దేవాలయాల్లో దీపారాధన చేయడం పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది.ఇక దోషం ఎంత బలంగా ఉన్నా డీలాపడి పోవలసిన పనిలేదు. ఎందుకంటే అన్ని దోషాలకు విరుగుడు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పరాశర మహర్షి కుజదోషం గురించి చెబుతూ ద్వితీయం, చతుర్థం, సప్తమం, అష్టమం, వ్యయం స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం అని చెప్పారు. 'ధనే వ్యయే చ పాతాలే జామిత్రే చాష్టమే కుజే/ స్థితః కుజః పతిం హన్తి న చేచ్ఛు భయతే క్షితః/ ఇందోరప్యుక్తగేహేషు స్థితః భౌమోధవా శనిః/ పతిహంతాస్త్రీ యాశ్చైవం వరస్యయది స్త్రీ మృతిః" - పరాశర మతం.లగ్నం నుండి, చంద్రుడి నుండి,శుక్రుడి నుండి పైన చెప్పబడిన స్థానములలో కుజుడు వుంటే కుజదోషం అని చెప్పారు.
అమ్మాయికి ఒకరికే ఈ దోషం ఉంటే ‘పతిహంతా’ అన్నారు. హంతా అంటే పతిని చంపును అని కేవలం నిర్ణయం పనికిరాదు.సంస్కృతం ప్రకారం ‘హనహింసాయాం’ అనే ధాతువు నుండి హంతా అంటే హింస అని అర్థమవుతోంది. పతిహంతా అంటే పతిని హింసించునది అని కూడా తీసుకోవాలి. కుజదోషం స్థాయి నిర్ణయం చేయునప్పుడు కుటుంబ స్థానం, సుఖ స్థానం, సంతాన స్థానం, ఆయుర్దాయం వంటివి కూడా పరిధిలోకి తీసుకొని పరిశీలించి నిర్ణయించాలి.
కుజుడు యొక్క స్థితి స్థానబలం నీచక్షేత్రం, మిత్రక్షేత్రం స్వక్షేత్రం ఉచ్ఛ క్షేత్రం వంటి వాటి ఆధారంగా చేసికొని నిర్ణయించి ఫలితాలు చెప్పాలి. భౌమః అధవా శనిః కుజదోషం మాదిరిగా శనిదోషం కూడా చూడాలి. శని ఆయుష్కారుడు కావున ఆయనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
‘నచేచ్ఛు భయు తేనితః’ అని వున్న కారణంగా శుభ గ్రహముల వీక్షణ లేదా శుభ గ్రహముల కలయిక ఉంటే కుజదోషం ఉండదు. శుభ గ్రహముల కలయిక అంటే శుభ గ్రహములతో 10 డిగ్రీలలోపు కలయిక ఉండాలి. 10 డిగ్రీలు దాటిన తరువాత శుభ గ్రహం ఉంటే ఉపయోగం ఉండదు.
ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా అని చెప్పిన శ్లోకం దేద కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిధున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. వృషభం తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు.
మేష వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి నాల్గవ ఇంట కుజుడు వున్న దోషం ఉండదు. మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. సింహం కుంభం లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం.
మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశి, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు.
చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ. కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.
కుజదోషం ఉందని మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన వివాహా సంబందాలను వదులుకోవద్దు. కుజదోష నివారణకు చాలా పరిహారాలు ఉన్నాయి. కుజ దోషానికి చాలా మినహాయింపులు ఉన్నాయి. జాతక చక్రాన్ని పరిశీలించి కుజుడు ఉన్న స్ధితిని బట్టి కుజ దోష ప్రభావం ఉన్నదో లేదో తెలుసుకొని కుజుడికి సంబందించిన పరిహారాలు చేసుకుంటే కుజ దోష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

0 Comments