ఇరుముడి: ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి? అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు.
ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు. రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.
“భక్తి”,“శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా ఉపయోగించే ద్రవములను పెడతారు.
భక్తి, శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారమనే త్రాటితో బిగించి కడతారు.
ముద్ర సంచిలో గురుస్వామిగారు మూడుసార్లు బియ్యము వేయటంవలన యాత్రాసమయములో మూడు విధములైన విఘ్నములు అనగా, ఆధిదైవిక విఘ్నము (మెరుపులు, వర్షము, వడగండ్లు వంటివి), ఆధిభౌతిక విఘ్నము (భూకంపములు, అగ్ని ప్రమాదములు, వరదలు వంటివి), ఆధ్యాత్మిక విఘ్నము (జడత్వము, భక్తిశ్రద్ధలు సన్నగిల్లుట, కామక్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టుట) లను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము.
◾ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి, ఇరుముడి కట్టించుకున్న తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటారు. ఎందుకు ?
పరదేశ యాత్ర వెళ్తున్న తన ఇంటిని, ఇంటిలోని వారిని సురక్షితముగ తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతకు ప్రార్ధించుకునే చర్యయే ఇది.
యాత్రకు బయలుదేరేవారు గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించుకోగానే తన పరివార గణములో ఒక గణమును మన ఇంటి ముంగిట మనము తిరిగి వచ్చు వరకు కాపలకాయుటకు కేటాయించును. మనము శబరియాత్రనుండి తిరిగి వచ్చిన తరువాత గుమ్మముయందు ఉన్న దేవతకు తిరిగి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంటిలోపలికి వెళ్ళవలెను.
◾కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి ?
కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా కలిగి ఉండి, శివకేశవుల అంశతో పుట్టిన అయ్యప్పను కొబ్బరికాయలోని కొబ్బరిగా భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అని భక్తులు విశ్వసిస్తారు.
◾ఎరుమేలి అనగా అర్ధమేమిటి ? ఎరుమేలిలో పేటతుళ్ళై ఎందుకు ఆడతారు ?
ఎరుమా అనగా పశువు, కొల్లి అనగా చంపటం. ఎరుమేలి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు తనలోని పశురూపంలో ఉన్న అజ్ఞానం, అహంకారమును వదిలి పెట్టాలని అర్ధము.
మనిషిలోని యవ్వనం, భోగం, భాగ్యం, అందం, ఇవేవి శాశ్వతం కావని, అయ్యప్ప శరణమే ముక్తికి మార్గమని,
నాకు భవబంధాలు, భోగభాగ్యాల కన్నా నీ నామమే గొప్పదని భగవంతునిలో ఐక్యం కావాలని తనను తాను మరచిపోయి
“స్వామి దింతక తోంతోం,
అయ్యప్ప దింతక తోంతోం”
అంటూ భక్తితో పరవశించిపోయి చేసే నృత్యమే ఈ పేటతుల్లి.
అభిషేకం చేసిన తరువాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు ?
శరీరమనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడమే అభిషేకం యొక్క అంతరార్ధం. అభిషేకించిన తరువాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట.
◾భగవదనుగ్రహం కలిగించే మూడు నియమములు ఏమిటి ?
1) ఆహార నియమము :
• దీక్ష సమయంలో తినవలసిన, తినకూడని ఆహారముల గూర్చి తెలుపును.
2) ఆచార నియమము:
• దీక్ష సమయంలో చేయవలసిన, చేయకూడని పనుల గూరిచి తెలుపును.
3) విహార నియమము:
• దీక్ష సమయంలో చేసే నదీ స్నానములు, దేవాలయముల సందర్శన, సత్పురుషుల బోధనలను వినడం, సజ్జన సాంగత్యం మొదలగు వాటిని గూరిచి తెలుపును.
ఈ మూడు నియమములను పాటించిన వారికి దైవానుగ్రహం కలుగునని భక్తుల నమ్మకం.
◾దీక్షలో ఒక్కో సంవత్సరమున స్వాములను ఒక్కో పేరుతో పిలుస్తారు, అవి ఏమిటి ?
1. శరం/కన్నెస్వామి
2. కత్తి స్వామి
3. గంట స్వామి
4. గద స్వామి
5. పెరు స్వామి
6. జ్యోతి స్వామి
7. రవి స్వామి
8. చంద్ర స్వామి
9. వేలాయుధం స్వామి
10. విష్ణు స్వామి
11. శంఖ స్వామి
12. నాగ స్వామి
13. మురళి స్వామి
14. పద్మ స్వామి
15. త్రిశూలం స్వామి
16. కొండ స్వామి
17. ఓం స్వామి
18. గురు స్వామి
◾శబరిమల ధ్వజస్తంభము యొక్క విశిష్టత ఏమిటి? ఆ ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మ యుండుటకు కారణమేమిటి?
శబరిమల ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మకు ఒక పరమార్ధ తత్వము గలదు. స్వామివారు తురగ వాహన ప్రియుడు. దీనిని వాజివాహనము అని కూడ అంటారు. శ్రీ అయ్యప్పస్వామి వారు రాత్రి పూటల ఈ హయమునెక్కి పరిసర ప్రాంతమంతయు తిరిగి దుష్టగ్రహములు ఆయా గ్రామమునందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట. అయ్యప్పస్వామి వారు తెల్లని అశ్వమెక్కి వనప్రాంతమంతా తిరుగుతూ నడిచి వచ్చే తన భక్తులకు వన్యమృగములచే, దుష్టగ్రహములచే ఎట్టి ఆపదలు కలగనీయక అదృశ్యరూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట. దీనిని హరివరాసనం పాటలో తురగ వాసనం స్వామి సుందరాసనం అని వర్ణించారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - లోకా సమస్తా సుఖినోభవన్తు!

 
 
 
 
 
 
0 Comments