దిల్లీ పేరు మార్పునకు పెరుగుతోన్న డిమాండ్లు
దేశ రాజధాని దిల్లీ (Delhi) పేరును మార్చాలనే డిమాండ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల దాని పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలంటూ విశ్వహిందూ పరిషద్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై భాజపా ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాలా (Praveen Khandelwal) కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.
దిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా (Indraprastha) మార్చడం ద్వారా అది చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తోందన్నారు. ఈక్రమంలో పాత దిల్లీ రైల్వేస్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని ఇతర చారిత్రక నగరాలైన ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటివి వాటి మూలాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. అలాంటప్పుడు దిల్లీ ఎందుకు అలా ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ మార్పు భావితరాల వారికి భారత చరిత్ర, సంస్కృతి, పాండవుల నీతి, ధర్మాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ లేఖను అమిత్ షా (Amit Shah)తో పాటు దిల్లీ సీఎం రేఖాగుప్తా, ఇతర మంత్రులకు కూడా పంపించినట్లు ప్రవీణ్ పేర్కొన్నారు.
వీహెచ్‌పీ గత నెలలో ఇలాంటి డిమాండే చేసింది. పురాతన చరిత్ర సంస్కృతితో అనుసంధానించేందుకు గాను దిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని కోరింది. దిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు వీహెచ్‌పీ దిల్లీ విభాగం కార్యదర్శి సురేంద్రకుమార్ గుప్తా ఈ మేరకు లేఖ రాశారు. ఈ పేరు మార్పు భారతీయ చరిత్ర, మహాభారత యుగంలోని మూలాలను ఆవిష్కరిస్తోందన్నారు.

0 Comments