GET MORE DETAILS

శని భగవానుడు - జ్యోతిష విశ్లేషణ

 శని భగవానుడు - జ్యోతిష విశ్లేషణ



ఎవరి జాతకంలో అయినా సరే శని భగవానుడు దశ ప్రారంభం అయితే అనేక కష్టాలు సమస్యలు వస్తాయని ముందుగానే ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి జాతకుడు తన జీవితంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, శని భగవానుని యొక్క దశ మరియు అంతర్దశలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అయితే శని భగవానుడు అందరి జాతకులకు సమస్యలను ఇస్తారా అంటే ...ఇవ్వరు అని చెప్పాలి. ముఖ్యంగా వృషభం తుల మకర లగ్న జాతకులకు శని భగవానుడు అపారమైన ప్రయోజనాలను ఇస్తారు. శని భగవానుడు తన దశలో ఇచ్చే ప్రయోజనాలు జాతకుడు తన జీవించి ఉన్నంత కాలం అనుభవించగలరు. 

గురు భగవానుడు లేదా శుక్రుడు లేదా రాహువు తన దశలలో ఇచ్చే అపారమైన సంపద అయినా సరే కొంతకాలం అనుభవిస్తారు మరల వాటిని కోల్పోతారు. కానీ శని భగవానుడు ఇచ్చే సంపద తన జీవిత చరమ దశ వరకు జాతకుడు ఉపయోగించుకుంటారు. శని భగవానుడు అందరి జాతకులకు సమస్యలను ఇవ్వరు. కొన్ని లగ్నాలవారికి శుభ ఫలితాలు, మరి కొందరికి రాజయోగాలు, మరికొందరికి మధ్యమ ఫలితాలు, మరికొందరికి సమస్యలు కష్టాలను ఇస్తారు. 

వృషభ తులా లగ్న జాతకులకు అత్యంత శుభ ఫలితాలను, మిధున కన్య జాతకులకు ఒక మాదిరి శుభ ఫలితాలను శని భగవానులు ఇస్తారు. మకర కుంభ లగ్న జాతకులకు కష్టాలను ఇచ్చి వాటిని ఓర్చుకునే శక్తి ఇచ్చి మానసికంగా దృఢంగా తయారు చేసి తరువాత అదృష్టాన్ని ఇస్తారు. ధనుస్సు మీన రాశి వారికి ఒక మాదిరి శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ, మేషం వృశ్చిక లగ్న జాతకులకు సమస్యలను ఇస్తారు. 

కర్కాటక సింహ లగ్న జాతకులకు మరిన్ని ఎక్కువ సమస్యలను శని భగవానుడు ఇస్తారు. శని భగవానుడు లగ్నాత్తు మూడు ఆరు 11 స్థానాలలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తారు. అదే కర్కాటక సింహ లగ్న జాతకులకు స్వక్షేత్రంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ ఉంటే అత్యధిక సమస్యలను ఇస్తారు. అదే శని భగవానుడు వక్రించిన, నీచ పొందినా తన సహజ శక్తిని కోల్పోయి అపకారము చేయరు. 

శని భగవానుడు ఏడో స్థానంలో ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది లేదా తక్కువ వయసులో వివాహం అయితే వివాహంలో ఖచ్చితంగా సమస్యలను ఇస్తారు. జాతకునికి శని భగవానుని దశలో ఏలినాటి శని గాని అర్ధాష్టమ శని గాని వస్తే మరిన్ని ఎక్కువ సమస్యలకు గురి అవుతారు. కర్కాటక లగ్న జాతకులకు అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రీంచి ఉంటే జాతకుడికి విదేశాలకు వెళ్లడం అక్కడ ఉద్యోగాలు సంపాదించడం చేస్తారు. 

సింహ లగ్నానికి ఆరవ స్థానంలో శని భగవానుడు ఉంటే శత్రువులను రుణాలను రోగాలను జయిస్తారు. శని భగవానుడు అందరికీ చెడు ఫలితాలను ఇవ్వరు. శని భగవానుడు సమస్యలను ఇచ్చే లగ్న జాతకులు శని భగవానుడికి సంబంధించి కొన్ని నియమాలు పాటించినప్పుడు సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments