మాఘ పురాణము : 12 వ అధ్యాయం - శూద్ర దంపతుల కథ
మాఘ పురాణంలోని పన్నెండవ అధ్యాయంలో, ధనపిపాసి సుమందుడు, దయగల కుముద అనే శూద్ర దంపతుల కథ ద్వారా ధర్మం యొక్క విశిష్టతను చాటి చెబుతుంది,భార్య కుముద మాఘ స్నానం చేయగా, కోపంతో ఆమెను కొట్టబోయిన సుమందుడు కూడా నీటిలో పడి మునిగిపోయి,తెలియకనే మాఘ స్నానం చేస్తాడు, మరణానంతరం కుముదను విష్ణులోకానికి, సుమందుడిని యమలోకానికి తీసుకువెళ్లగా, చిత్రగుప్తుడు సుమందుడి బలవంతపు మాఘ స్నానం వల్ల పాపాలు తొలగి, అతను కూడా విష్ణులోకానికి అర్హుడని నిర్ధారించడం ద్వారా, తెలియక చేసిన మంచి పనులు కూడా మనకు శుభ ఫలితాలిస్తాయని ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది.
వశిష్ఠమహర్షి దిలీపునితో “మహారాజా మరియొక కథను వినుము, ‘సుమందుడను శూద్రుడు ఒకడు ఉండెడివాడు, అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు, వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును,ఇవి చాలక వడ్డీ వ్యాపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవుచున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను.
అమ్మా నేను బాటసారిని అలసిపోయిన వాడను,చలి,చీకటి మిక్కుటముగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము, ఉదయముననే వెళ్లిపోదునని” ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు అతని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమాని అయినా సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల చావిడిలో ఒక చోట బాగు చేసి కంబళి మున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ప్రాతఃకాలమున లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను.
కుముద “ఓయీ నీవు ఎచటినుండి వచ్చుచున్నావు ఎచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు “తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘ మాసమున పుణ్య నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందు కొరకు ఇట్లు వచ్చి ఉన్నాను”అని సమాధానము ఇచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని అనుకొనెను, తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెన.
తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు ‘నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును వలదు’ అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి, నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను.
ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడ కలిగినది, సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆబ్రాహ్మణుడును స్నానముచేసి దేవత అర్చన చేసికొని తన దారిన తాను పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈలోపున శ్రీవిష్ణు దూతలు విమానముపై వచ్చి కుముదను విమానమున ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి,
అప్పుడామె విష్ణు దూతలారా నామాటలను వినుడు నాభర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా, యమ లోకమునకు తీసికొని పోబడుచున్నాడు, అతని భార్య అయిన నేనును అతనికి భయపడి ఎటువంటి పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణి నరకమునకు పోవలసియున్నను నీభర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు, నీభర్త చేయు చెడుపనులు నీకిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని నీభర్తకు ఏదురు చెప్పలేదు, కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి, ఇందువలన నీవు పాపివికావు.
ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి,కావున నీవు పుణ్యము నొందితివి, నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీభర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి, అప్పుడామే నన్ను లాగుచు నాభర్తయు నీటిలో మునిగెను కదా... మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినా కూడా మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా? ఆవిధముగా చూసినా నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో పలుమార్లు మునిగి లేచిన నాభర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను, ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి.
యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి, తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను,సుమందుడుని పట్టికలో అన్నియును పాపములే కాని మాఘ మాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టపోయి నదీ జలమున పడుట, నీటిలో* మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలెనని ప్రయత్నమున, నీటిలో పలు మార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలు మార్లు మునుగుటచే ఇతని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను, విష్ణు దూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి,కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి,రాజా! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి, యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని,యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.
మానవుడు తెలిసికాని, తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పైవిధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము,ఇట్టివారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగడం సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను,అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింప వలయును, తన పనులను నూరింటిని అయినను వదలి మాఘమాస స్నానమును చేయవలెను,అట్లుకాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును.
మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా, పురాణశ్రవణము, దానము యధాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు, మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు,వానికి మోక్షము కలుగును, ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి,కృష్ణవేణి,నర్మద, తుంగభద్ర,సరస్వతి,గోకర్ణ ప్రభాస,కోణభద్ర,గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను,కూడ ఇంతటి పుణ్యమే కలుగును,మానవులు అందరూ వారు ఎటువంటి వారయినను మాఘస్నానము,పూజ, పురాణశ్రవణము,దానము వాటి అన్నిటినికాని, కొన్నిటిని యధాశక్తిగా చేయుటయే వారికి పాప తరణోపాయము,మోక్షప్రాప్తి సాధనము”అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

0 Comments