నిత్యంవచ్చే నక్షత్రాలలో ఏనక్షత్రంలో శ్రీనివాసుని దర్శిస్తే ఏఏ ఫలితాలు లభిస్తాయి ?
అహోరాత్రే పార్స్వే, నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తమ్..!
సృష్టి మొత్తానికి మూలపురుషుడైన శ్రీమన్నారాయణుని విరాట్‌స్వరూపంలో రాత్రి,పగలు స్వామిఇరుపక్కలుగా, నక్షత్రాలేస్వామివారిఆకారంగా, అశ్వినిలు స్వామివారి పెదవులుగా వర్ణించబడింది.
విష్ణువుఅంటే విశ్వంమొత్తం వ్యాపించబడి ఉన్నాడు అని అర్థం. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రమండలాలు, గ్రహమండలాలు,సూర్యచంద్రులు అన్నీ ఆస్వామి విరాట్‌రూపంలోనివే.
ఈసమస్తవిశ్వమూ తనస్వరూపమైన శ్రీమన్నారాయణుడు తిరుమలలో శ్రీనివాసునిగా వెలసి భక్తుల నిత్యపూజలందుకుంటున్నాడు. వారివారి కోర్కెలు తీరుస్తున్నాడు.
ఆస్వామిని దర్శించడానికి ప్రత్యేకసమయమంటూ ఏదీ లేదు. కాలపురుషుడైన ఆ పరబ్రహ్మమూర్తిని దర్శించడానికి అన్నికాలాలూ మంచివే.
అయితే ఒక్కొక్కనక్ష్మత్రంనాడు దర్శిస్తే, ఒక్కొక్కప్రత్యేక ఫలితం ఉంటుంది. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ, రవిసంచార మార్గం కలిగిన అశ్విని నుంచి రేవతి వరకు గల ఇరవైఏడు నక్షత్రాలకే ప్రాధాన్యం కలిగింది. 360 డిగ్రీల రవి సంచారమార్గంలో ప్రతీరోజు చంద్రుడు ఏనక్షత్రానికి దగ్గరగా వస్తాడో అదే ఆరోజు నక్షత్రంగా వ్యవహరింపబడుతున్నది.
మరొక విశేషమేమంటే ఈనక్షత్రాలన్నీ ఒక్కొక్క నక్షత్రం కాదు, ఒక్కొకటి అనేక నక్షత్రాల సముదాయం. ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖఆకారంలో కనపడే మూడునక్షత్రాల గుంపు.శతభిషం అంటే నూరునక్షత్రాల సముదాయం.
మనం భూమిమీద జరుపుకునే ప్రతీపండుగకు నక్షత్రమండలానికి,ఎంతో సంబంధం ఉన్నది. ఉదాహరణకు మనం ప్రతీసంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయకచవితి పండుగనే గమనిద్దాం.
ప్రతీసంవత్సరం భాద్రపద శుద్ధచవితినాడు విఘ్నేశ్వరరూపంలో కనిపించే నక్షత్రమండలం సూర్యోదయానికన్నా ముందుగా తూర్పుఆకాశంలో ఉదయిస్తుంది.
అందుకనే ఆరోజు మనం వినాయకచవితిని జరుపుకుంటాం. ఇంకో విశేషమేమంటే ఆవినాయక మండలం ప్రక్కన ఆదిశేషునినక్షత్రమైన ఆశ్లేష ఉండటంవలన వినాయకుడు నాగయజ్ఞోపవీతుడైనాడు.
▪️ఇరవైఏడు నక్షత్రాలలో మొదటిదైన 'అశ్వనీ'నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా నశిస్తుంది.!
▪️రెండవదైన 'భరణీ'నక్షత్రంనాడు ఆనందనిలయంలోని స్వామిని దర్శించినవారికి అపమృత్యుభయం తొలగిపోతుంది.!
▪️మూడవదైన 'కృత్తికా'నక్షత్రం శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని జన్మనక్షత్రం.ఆనాడు శ్రీనివాసుని దర్శించినవారికి చక్కటిచదువు లభిస్తుంది. జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహిస్తారు.!
▪️'రోహిణీ'నక్షత్రంనాడు స్వామినిదర్శిస్తే ఎటువంటి మానసికసమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.!
▪️ఇక అయిదవదైన 'మృగశిర'స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది.మాసాలలో మార్గశిరమాసం తానేనంటాడు శ్రీమన్నారాయణులవారు. పూర్వకాలంలో కొత్తసంవత్సరం మార్గశిర నక్ష్మత్రం నాడే ప్రారంభమయ్యేది. ఆనక్షత్రంరోజున శ్రీనివాసుని దర్శించినవారికి సర్వశుభాలు కలుగుతాయి.!
▪️తరువాతవచ్చే 'ఆరుద్ర'నక్షత్రానికి అధిదేవతరుద్రుడు. ఈనక్షత్రం రోజున స్వామిని దర్శించినవారికి ఎటువంటి ఆపదలూ కలుగవు.
▪️స్వామివారు రామచంద్రుని అవతారంలో జన్మనక్షత్రమైన 'పునర్వసు'నాడు ఆనందనిలయంలోని స్వామినిదర్శిస్తే ఎటువంటి కస్టాలైనా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఆర్థికబాధలుఉన్నవారు, మానసికస మస్యలుఉన్నవారు పునర్వసునాడు స్వామినిదర్శిస్తే చాలా శ్రేయస్కరం. కుటుంబంలోశాంతి,సౌభాగ్యాలు వెల్లివెరుస్తాయి.!
▪️ఇక 'పుష్యమీ'నక్షత్రంనాడు స్వామినిదర్శిస్తే వెయ్యిజన్మల పాపం నశిస్తుంది.!
▪️'ఆశ్లేష'నక్షత్రానికి అధిదేవత ఆదిశేషుడు. ఆరోజు స్వామినిదర్శించినవారికి ఎటువంటిభయాలైనా తొలగిపోతాయి.శారీరక,మానసికసమస్యలన్నీ ఇట్టేమాయమౌతాయి. మనస్సంతా ప్రశాంతతతో నిండిపోతుంది.
▪️'మఖా'నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. జగన్మాతనక్షత్రమైన 'పూర్వఫల్టుణి' (పుబ్బ) నక్షత్రంనాడు శ్రీస్వామివారినిదర్శిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుంది. వివాహంఆలస్యం అవుతున్నయువకులకు కూడా వెంటనే పెళ్ళినిశ్చయమౌతుంది.!
▪️స్వామివారి ప్రియసఖి శ్రీమహాలక్ష్మీనక్షత్రమైన 'ఉత్తరఫల్గుణి'నాడు ఆనందనిలయంలో స్వామిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతో ఐశ్వర్యవంతులౌతారు.!
▪️'హస్తా'నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శించినవారికి ఎటువంటిఅనారోగ్యమైనా క్షణంలో తొలగిపోతుంది.
▪️'చిత్తా'నక్షత్రంనాడు స్వామివారినిదర్శిస్తే యశస్సు, సకల సంపదలు కలుగుతాయి. శరీరం నూతనతేజస్సుతో నిండిపోతుంది.
▪️అటుతరువాతిదైన 'స్వాతి'నక్షత్రం శ్రీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం.స్వామినరసింహునిగా అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. తిరుమలకొండ ఎక్కేటప్పుడు మద్యలో వచ్చే శ్రీయోగనరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కలది. స్వాతినక్షత్రం నాడు శ్రీనివాసునిదర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి ఆపదలు కలుగవు.
▪️ఇక నక్షత్రసముదాయంలో పదహారవదైన 'విశాఖ'నక్షత్రంనాడు శ్రీనివాసుని దర్శించినవారికి త్వరలో వివాహమౌతుంది. కన్యలకు మంచియువకులు,యువకులకు మంచి కన్యలు, జీవితభాగస్వాములుగా లభిస్తారు. విశాఖనక్షత్రాన్ని రాధానక్షత్రం అని, వైశాఖమాసాన్ని రాధామాసమని కూడా అంటారు.
▪️రాధానక్షత్రానికి తరువాత వచ్చేదే 'అనూరాధ'. ఈనక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి.ఎంతోకాలంనుండి తీరనిఅప్పులు కొద్దినెలల్లోనే తీరిపోతాయి.
▪️ఇక తరువాతిదైన'జ్యేష్టా'నక్షత్రంనాడు స్వామివారిని దర్శించినవారికి ఉన్నతపదవులు లభిస్తాయి. సర్వసంపదలూ చేకూరుతాయి.
▪️'మూలా'నక్షత్రం చదువులతల్లి సరస్వతీదేవి జ న్మనక్షత్రం. ఈరోజు స్వామివారిని దర్శించినవారికి సర్వవిద్యలూ లభిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో అద్భుతవిజయం సాధిస్తారు.!
▪️'పూర్వాషాఢ'నక్ష్మత్రంనాడు శ్రీనివాసుని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుంది.
▪️'ఉత్తరాషాఢ'నాడు స్వామివారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి. మనస్సంతా ప్రశాంతత కలుగుతుంది.!
▪️ఇక తరువాతవచ్చేదే శ్రీమన్నారాయణులవారి జన్మనక్షత్రమైన 'శ్రవణా'నక్షత్రం. ఆరోజు ఆనందనిలయంలో స్వామివారిని దర్శించినవారు జీవించినంతకాలం సుఖంగాజీవించి చివరన ముక్తిని పొందుతారు. దేనికీ లోటులేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది.!
▪️'ధనిష్టా'నక్షత్రంనాడు స్వామిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుంది.!ఎంతోకాలంగా రావలసినసొమ్ము వెంటనే చేతికి వస్తుంది.!
▪️'శతభిషం'నాడు స్వామివారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సకాలంలో వర్షాలుకురిసి మంచిపంటలు పండుతాయి.
▪️ఇక అటుతరువాతవచ్చే 'పూర్వాభాద్ర' నక్షత్రం నాడు స్వామిని దర్శిస్తే ఎన్నోరోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి.
▪️'ఉత్తరాభాద్ర'నాడు శ్రీనివాసుని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుంది.
▪️ఇక నక్షత్రసముదాయంలో చివరిదైన 'రేవతీ' నక్షత్రంనాడు స్వామివారిని దర్శిస్తే సర్వశుభాలూ కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోయి సంపూర్ణఆరోగ్యం లభిస్తుంది.
ఈవిధంగా ఆయానక్షత్రాలరోజులలో శ్రీనివాసుని దర్శించి స్వామిఅనుగ్రహంతో సర్వశుభాలు పొందుదాం.! జీవితం సుఖప్రదం చేసుకుందాము.
ఈ విశేషాలు కేవలం తిరుమలలొనే కాదు, ఏ శ్రీనివాసుని ఆలయంలోనైనా ఆయా నక్షత్రాలలో దర్శించినా ఆయా ఫలితాలు కలుగుతాయి.

0 Comments