GET MORE DETAILS

మీలాద్ ఉన్ నబి ప్రవక్త (స)జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

మీలాద్ ఉన్ నబి ప్రవక్త (స)జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం.  
నేటికి పదిహేను వందల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం హింసకు,దౌర్జన్యాలకు,వ్యసనాలకు, మూఢాచారాలు,మూఢనమ్మకాలకు ఆలవాలమై ఉండేది.ఎటుచూసినా అరేబియా ధనిక భూస్వాముల పీడన,అణచివేతల బారిన పడ్డ పీడిత జనం హాహాకారాలే విన్పించేవి.నల్లజాతికి చెందిన ప్రజల్ని బానిసలుగా చేసుకున్న అరబ్బు అసమసమాజం స్త్రీలను పశువుల కన్నా హీనంగా చూసేది.సరిగ్గా అదే కాలంలో యావత్ ప్రపంచం ఇలాంటి అవలక్షణాలతో అంధకారంలో ఉండేది. ఇలాంటి సమయంలో అరేబియాలోని మక్కాలో వీటిని నిరసిస్తూ ఓ విప్లవ స్వరం విన్పించింది.ఆ స్వరమే ఇస్లాం ప్రవక్త ముహమ్మద్(స).


ఆయన తన ప్రగతిశీల భావాలతో యావత్ సమాజాన్ని మేల్కొలిపారు.నాటి సమాజంలోని పేదలు,దళితులు, పీడితులు ఆయన్ని అనుసరించారు.పుట్టుకరీత్యా మనుషుల్లో అధికులు,అల్పులు లేరు.తెల్లజాతి వారికి నల్లజాతి వారిపై ,నల్లజాతి వారికి తెల్లజాతి వారిపై,అరబ్బులకు అరబ్బేతరులకు,అరబ్బేతరులకు అరబ్బులపై కాని ఎలాంటి ఆధిక్యత లేదు.అల్లాహ్ దృష్టిలో మానవులంతా సమానులే. నేను మొత్తం మానవజాతికి సన్మార్గం చూపేందుకు,హితోపదేశం గరిపేందుకు వచ్చిన అంతిమ దైవప్రవక్తను. మనిషి తలవంచాల్సింది ఆ సృష్టికర్తకే తప్ప సృష్టితాలకో,ధనికులకో,పెత్తందార్లకో కాదు అంటూ ఏకేశ్వరత్వానికి, సామాజిక సమానత్వంకై ప్రవక్త ముహమ్మద్(స)ఇచ్చిన పిలుపు అరబ్బు ధనిక సర్దార్లకు ఆగ్రహం తెప్పించింది.అప్పటినుండి ఆయనపై భౌతిక, మానసిక దాడులు మొదలయ్యాయి. ఆయన వేటికీ వెరవలేదు.ఒక్కోసారి బహుదైవారాధకులు విసిరిన రాళ్ల దెబ్బలతో శరీరం రక్తసిక్తమయ్యేది.ఒంటె పేగులు తెచ్చి ఆయన మెడలో వేసి లాగేవారు.కానీ ఆయన ఎవ్వరినీ శపించేవారు కాదు.చివరికి ఆయన వారిపై చూపిన ప్రేమ ముందు కఠినాతికఠినమైన అరబ్బు సమాజం తలవంచక తప్పలేదు.క్రమంగా మొత్తం అరేబియా సమాజం ఆయన అనుసరణీయ సమాజమైంది.


అప్పటినుండి ఇస్లాం ప్రవక్త సాధించిన సామాజిక సమానత్వం మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది.అప్పటివరకూ బానిసలుగా పరిగణించబడ్డ నీగ్రోజాతి ప్రజలు అరబ్బులకు సమానమయ్యారు.అత్యంత పవిత్రమైన కాబా మస్జిద్ పైకప్పుపై నల్లజాతికి చెందిన బిలాల్(ర)ను ఎక్కి తొలి అజాన్ ఇవ్వమని ప్రవక్త ఆదేశించారు. హజ్రత్ బిలాల్ కళ్లు అశ్రుపూరితాలయ్యాయి.ఎంతో ఉద్వేగంతో ఆయన అజాన్ ఇస్తుంటే అగ్రవర్ణ భావజాలం కల అరబ్బులలో కలకలం రేగింది.అప్పుడు ప్రవక్త వారిని ఉద్దేశించి 'మనం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెల్పుకోవాలి.ఆయన మిమ్మల్ని అజ్ఞాన కాలపు చెడుల నుండి,అహంకారాల నుండి రక్షించాడు అని పలకగా అరబ్బుల హృదయాలు పశ్చాత్తాపంతో కరిగిపోయాయి క్షమాపణ కోరారు.అప్పటినుండి అరబ్బులు నీగ్రో ప్రజల ముందు నిలబడి ఓ నా ప్రియమైన సోదరా!అంటూ గౌరవించేవారు.అంతేకాక తమ కుమార్తెలను నీగ్రోలకు ఇచ్చి వివాహాలు చేసేవారు.కనుకే ప్రఖ్యాత యూరోపియన్ చరిత్రకారుడు లామర్టైన్ తన 'హిస్టరీ డిలా టర్క్'లో ప్రవక్త ముహమ్మద్(స)ను ఇలా ప్రస్తుతించాడు."ప్రపంచంలో ప్రతిభావంతులైన వారు ఆయుధాలు సృష్టించారు.చట్టాలు చేసారు.రాజ్యాలు స్థాపించారు.అవన్నీ భౌతిక శక్తియుక్తులకు సంబంధించినటువంటివి కనుకనే అవన్నీ అనతికాలంలోనే కూలిపోయాయి.కాని ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ తన నైతికశక్తితో మహాసైన్యాల పునాదులు కదిలించడమే గాక లక్షలాది మనుషుల్ని చలింపజేశాడు.అన్నిటికంటే ముఖ్యంగా బలిపీఠాల్ని,దేవతలను,మతాలను,భావాలను,నమ్మకాలను,ఆత్మలను స్థానభ్రంశం చేశాడు".


మొత్తం పరిస్థితులు మారిపోయి యావత్ అరేబియా సమాజం ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఆయన వెనుక నడుస్తున్నా అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) నిరాడంబరత,స్వచ్ఛత మారలేదు.పగలంతా పరిశ్రమించి మెత్తటి పరుపులపై గాక ఖర్జూరపు చాపపై పడుకునేవారు.స్త్రీలు మన తల్లులు,చెల్లెళ్లు,కూతుర్లు అంటూ స్త్రీల హక్కుల గురించి మాట్లాడేవారు.ధర్మం ప్రకారం పురుషులకు కల అన్ని హక్కులు స్త్రీలకూ ఉన్నాయని చెప్పి అరబ్బు పురుష సమాజాన్ని సంస్కరించారు.ప్రతి పురుషుడు తన గృహంలో ప్రవేశించే ముందు తన భార్యకు సలాం చేసి మరీ వెళ్లాలని చెప్పి పురుషాహంకారాన్ని తుత్తునియలు చేశారు.బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అనాధ బాలునిగా మొదలైన ఆయన జీవితం ప్రవక్తగా మక్కా నుండి బహిష్కరించబడి ఓ వలసవాసిగా సాగి మానవ జీవన మూలాలకు సంబంధించిన అత్యున్నత సత్యాలను కనుగొన్నది.తన జీవితపర్యంతం దుర్మార్గుల హింసకు గురౌతూ కూడా శాంతి,ప్రేమ,కరుణలతో తన జీవితకాలంలోనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చిన ధీరోదాత్త ప్రవక్త ముహమ్మద్(స).ఆయన సత్యసంధతను,కరుణను ప్రత్యక్షంగా పొందిన ఆయన అనుచరులు తమపై అరబ్బు సర్దార్ల నుండి ఎన్ని విపత్తులు వచ్చినా ,చివరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారే తప్ప ప్రవక్తను వీడలేదు.అరేబియా సర్దార్లు ఖబ్బాబ్ బిన్ అర్త్ అనే ప్రవక్త సహచరుడ్ని కణకణలాడే నిప్పు కణాలపై నిలబెట్టి అతని శరీరం లోని కండరాలను క్రూరంగా కోస్తూ ఇప్పుడు నీకేమనిపిస్తుంది?నీ స్థానంలో ముహమ్మద్ ఉండి నీకు నీ పిల్లాజెల్లలతో సుఖంగా ఉండాలని లేదా?అంటూ అవహేళన చేస్తుంటే అతను -నేనే కాదు యావత్ నా కుటుంబాన్ని ముహమ్మద్(స)చూపిన మార్గంలో ధారపోసేందుకు సిద్ధమే తప్ప తన ప్రవక్తకు చిన్న ముల్లు గుచ్చుకున్నా సహించలేనని బదులిస్తాడు.అందుకే ప్రసిద్ధ భారతీయ రచయిత దివాన్ చంద్ శర్మ తన"పాఫెట్స్ ఆఫ ది ఈస్ట్"లో "ముహమ్మద్ దయాస్వరూపుడు.ఆయన ప్రభావాన్ని ఆయన చుట్టూ ఉండే వారు గ్రహించారు.మరెప్పుడూ దాన్ని మరువలేకపోయారు"అంటాడు. ప్రపంచానికి మానవీయ,ఆర్థిక, సామాజిక, రాజకీయ,సాంస్కృతిక,నైతిక విలువలను బోధించిన అంతిమ దైవప్రవక్త తుదిశ్వాస విడిచే సమయంలో ఆయన ఒంటిపై ఉన్న బట్టలకు ఎన్నో అతుకులు.ఇంట్లో దీపం వెలిగించేందుకు నూనె లేని పరిస్థితి. కానీ ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి భూమి మూలమూలల్లోకీ ప్రసరించడం మానవజాతి చరిత్రలోనే ఓ మహాద్భుతం.

Post a Comment

0 Comments