GET MORE DETAILS

కోరికల్ని నియంత్రించడం ఎలా...?

 కోరికల్ని నియంత్రించడం ఎలా...?



మనిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.

జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.

మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది.

సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం ప్రవేశించగలం.

సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు. ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?

వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి.

ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.

ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది.మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి. సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి.

సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది.

విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది.

అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు మన ప్రతిభ బయటకొస్తుంది.

 ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.

Post a Comment

0 Comments