ప్రపంచ డయాబెటిస్ డే
వంట పనిచేయాలన్నా..ఆటలాడాలన్నా.. ఏ కష్టం చేయాలన్నా.. ఒంట్లో ఫుల్ ఎనర్జీ ఉండాలె. ఆ ఎనర్జీనే ఒంట్లో షుగర్ రూపంలో ఉంటది. దాన్నే బ్లడ్ గ్లూకోజ్ అని పిలుస్తం. హుషారుగా ఉండేందుకు ఆ చక్కెర ఎంత ముఖ్యమో.. అది కంట్రోల్లో ఉండడం కూడా అంతే ముఖ్యం. అది ఎక్కువైతే ఆ కండిషన్‌నే డయాబెటిస్ (మధుమేహం - చక్కెర వ్యాధి, షుగర్) అని పిలుస్తుంటం. ఒక్కసారొచ్చిందా.. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే. షుగర్ లెవెల్స్‌ను పెంచే తిండి తినకుండా నోటికి తాళం వేయాలి. అయితే, ఈమధ్య కాలంలో డయాబెటిస్‌ను రివర్స్ చేయొచ్చన్న మాటలు వినిపిస్తున్నయి. దాని బారిన పడినోళ్లలో ఆశపుట్టిస్తున్నయి. అది రివర్స్ అవ్వడం..కాకపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నది మాత్రం కాదనలేని నిజం.
షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే కేవలం మందులు వాడితే సరిపోదు. ఫుడ్, ఎక్సర్‌సైజ్ విషయంలో క్రమ శిక్షణ ఉండాలి. వ్యాధి గురించి ఎక్కువగా తెలుసుకుని, దానికిగల కారణాలను బాగా అర్థం చేసుకున్నప్పుడే దాని నుంచి విముక్తి పొందగలుగుతారు. కొందరైతే షుగర్ ఉందని తెలుస్తుందనే భయంతో టెస్ట్‌లు కూడా చేయించుకోరు. ఒకసారి ఇన్సులిన్ తీసుకొంటే లైఫ్‌లాంగ్ తీసుకోవాలనే అపోహతో ఉంటారు. ఇలాంటి భయాలను పక్కనపెట్టాలి. అప్పుడే దాన్నుంచి బయట పడగలుగుతారు.
చక్కెర (గ్లూకోజ్) రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అదే డయాబెటిస్ అనేది తెలిసిందే. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అనేవి రెండు రకాలున్నాయి. ఎక్కువమందికి వచ్చేది మాత్రం టైప్ 2 డయాబెటిస్ అనేది తెలిసిందే. ఆ రెండింటికి తోడు ప్రి డయాబెటిస్ అనే మరో కండిషన్ కూడా ఉంటుంది.
ప్రి డయాబెటిస్: ఇది షుగర్‌కు స్టార్టింగ్ పాయింట్. షుగర్ స్థాయిలు ఉండాల్సిన మోతాదు కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగని డయాబెటిస్ అంత స్థాయిలోనూ ఉండవు. దానిని డయాబెటిస్ అనీ చెప్పలేం. కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ముదిరి డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉంటుంది.
టైప్ 1 డయాబెటిస్ : ఇది పిల్లలు, టీనేజర్లు, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీన్ని జువనైల్ డయాబెటిస్ అని కూడా అంటుంటారు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ తయారీ ఆగిపోవడం వల్ల ఈ రకం డయాబెటిస్ వస్తుంది. కారణం, ఇన్సులిన్‌ను తయారు చేసే పాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లోని కణాలపై దాడి జరగడం. బయటి శత్రు కణాలు, బ్యాక్టీరియాలు, వైరస్ల నుంచి కాపాడే సొంత ఇమ్యూన్ సిస్టమే ఆ దాడి చేస్తుంది. ఇది ఒక్కసారి వచ్చిందా.. రివర్స్ చేయడమన్న ముచ్చటే ఉండదు. జీవితాంతం ఇన్సులిన్‌ను తీసుకోవాల్సిందే. లక్షణాలూ వేగంగా కనిపించేస్తాయి. త్వరగా గుర్తించలేకపోతే కోమాలోకి కూడా జారిపోయే ప్రమాదం ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ : ఇది పెద్దల్లోనే వస్తుందని నిపుణులు చెప్పేటోళ్లు. కానీ, మారిన కాలంతో పాటు అది యువత, పిల్లలపైనా దాడి చేసేస్తోంది. ఇటీవలి కాలంలో డయాబెటిస్తో బాధపడే పిల్లల సంఖ్య పెరగడమే అందుకు ఉదాహరణ. ఈ కండిషన్లో పాంక్రియాస్.. ఇన్సులిన్‌ను తయారు చేసినా గ్లూకోజ్‌ను మాత్రం కట్టడి చేయలేదు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. అందుకే ఈ సందర్భంలోనూ ఇన్సులిన్‌ను బయటి నుంచి తీసుకుంటుంది శరీరం. కొన్ని సందర్భాల్లో మందులూ వాడుతుంటారు. ఫుడ్‌ను కంట్రోల్‌గా తింటుంటారు. గ్లూకోజ్‌ను పెంచే వాటికి దూరంగా ఉంటారు.
జెస్టేషనల్ డయాబెటిస్ : ప్రెగ్నెన్సీ టైంలో మహిళల్లో షుగర్ స్థాయిలు పెరగడాన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. కాబట్టి ఈ టైంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాన్పు అప్పుడు ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తల్లి నుంచి పిల్లలకు డయాబెటిస్ వచ్చే ముప్పుంటుంది. పుట్టగానే అది కనిపించకపోయినా.. భవిష్యత్‌లో మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది.
రివర్స్ చేయొచ్చు కానీ...
ఈ మధ్య చేసిన కొన్ని స్టడీలు డయాబెటిస్‌ను తిరిగి రాకుండా చేయొచ్చని చెబుతున్నాయి. బ్రిటన్, స్కాట్లాండ్కు చెందిన సైంటిస్టులు కొందరు డయాబెటిక్ పేషెంట్లపై స్టడీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, టీసైడ్ యూనివర్సిటీ, స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరోలకు చెందిన సైంటిస్టులు వేర్వేరుగా స్టడీలు చేశారు. డయాబెటిక్ పేషెంట్లకు కంట్రోల్డ్ డైట్‌ను ఇస్తూ షుగర్ లెవెల్స్‌ను పరీక్షించారు. కేలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండి.. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను పెట్టారు. కొన్ని వారాల పాటు ఇలాగే చేశారు. ఆ గ్యాప్‌లో వాళ్లు వాడే షుగర్ మందులు, ఇన్సులిన్లను ఇవ్వలేదు. కొన్నాళ్ల తర్వాత వాళ్లలో షుగర్ లెవెల్స్ మామూలు స్థాయికి వచ్చి, మళ్లీ రాలేదు. ఈ క్రమంలోనే డయాబెటిస్‌ను రివర్స్ చేయొచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దాన్నే రెమిషన్ అంటారని చెబుతున్నారు. అయితే, దానికీ కొన్ని షరతులున్నాయి అంటున్నారు డాక్టర్లు. డయాబెటిస్ వచ్చిన నాలుగైదేండ్లలోనే డయాబెటిస్‌ను రివర్స్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అది తగ్గిందని నిర్లక్ష్యం చేస్తే.. మళ్లీ మొదటికే వస్తుందని, తిరగబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కూడా. తినే తిండిని కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు.. బరువు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.*
టెక్నాలజీ సాయం :
డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు మందులు తప్పనిసరిగా వాడాల్సిందే. వాటితో పాటు టెక్నాలజీ కూడా దానికి ఎంతో హెల్ప్ చేస్తోంది. కాలం మారుతున్న కొద్దీ మందులు మారుతున్నాయి. వాటిని తీసుకునే పద్ధతులూ కొత్తవి వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చినవే ఇన్సులిన్ పంపులు, మెడికేషన్ పెన్నులు. కొన్నికొన్ని సందర్భాల్లో శరీరంలో గ్లూకోజ్ స్థాయి సడన్‌గా పెరుగుతుంటుంది. అప్పటికప్పుడు ఇన్సులిన్‌ను ఎక్కించుకోవాల్సి వస్తుంటుంది. అలా కాకుండా సడన్‌గా గ్లూకోజ్ స్థాయి పెరగకుండా క్రమం తప్పకుండా కావాల్సినంత మోతాదులో ఇన్సులిన్‌ను అందించే వ్యవస్థ ఉంటే బాగుంటుంది కదా. అదే ఇన్సులిన్ పంప్స్. 24 గంటల పాటూ ఇన్సులిన్‌ను మన ఒంట్లోకి పంపించే వ్యవస్థే ఇది. ఫిట్నెస్ను, షుగర్ లెవెల్స్‌నూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు ఇప్పుడు బోలెడన్ని యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొంచెం తేడా అనిపించినా వెంటనే అలర్ట్ చేస్తున్నాయి. అలాగని పూర్తిగా వాటిపైనే ఆధారపడడం కూడా మంచిది కాదు.*
అన్ని అవయవాలపైనా...
సకల రోగాలకూ మూలం డయాబెటిస్ అంటారు. దాని వల్ల శరీరంలో మెటబాలిజం మొత్తం దెబ్బ తింటుంది. ఫలితంగా బీపీ ఎక్కువైతుంది. గుండె జబ్బులు వస్తుంటాయి. వెరికోస్ వెయిన్స్ (నరాలు ఉబ్బి పోవడం) ముప్పు వస్తుంది. కిడ్నీలు పాడైపోతుంటాయి. లివర్ సమస్యలు పెరుగుతాయి. కంటి సమస్యలు వచ్చేస్తాయి.. అవి ముదిరి గ్లకోమా అనే ప్రమాదానికి దారి తీసి, కంటి చూపు పోయే పరిస్థితీ వస్తుంది. గ్యాంగ్రీన్ వంటి సమస్యలు వేధిస్తాయి. చిన్న దెబ్బ తగిలినా నయం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒక్కోసారి అది ఎఫెక్ట్ అయిన భాగాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వేధిస్తాయి. మన ఒంట్లో షుగర్ స్థాయి పెరిగితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ షుగరే గట్ బ్యాక్టీరియాకు ఆహారంగా మారి.. ఆ బ్యాక్టీరియా ప్రమాదకరంగా పరిణమించే ముప్పుంటుంది.
డయాబెటిస్‌కు కారణాలేంటి ?
డయాబెటిస్‌ను లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అవును, చేసే పనులు, తినే తిండి, శరీర బరువు... ఇవే షుగర్ రావడాన్ని, రాకపోవడాన్ని డిసైడ్ చేస్తాయి. బరువు ఎక్కువగా ఉండడం, ఆరోగ్యాన్నిచ్చే తిండికి దూరంగా ఉండడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం వంటివన్నీ డయాబెటిస్‌ను మోసుకొస్తాయి. వారసత్వంగా కూడా తాతముత్తాతలు, తల్లిదండ్రుల నుంచి అది ఎటాక్ చేసే ముప్పుంది.
ఏం చేయాలి ?
శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెట్టే మధుమేహం మన దగ్గరకు రాకుండా దూరంగా ఉండాలంటే మంచి లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. శరీరాన్ని పాడు చేసే తిండి తినకుండా నోటిని కట్టేసుకోవాలి. శరీరానికి కాస్తంత పనిచెప్పాలి. రోజూ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. యోగాసనాలను జీవితంలో భాగం చేసుకుంటే మంచిది. వాకింగ్, జాగింగ్, వర్కవుట్ల వంటివి చేస్తుండాలి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్, హైబీపీ వంటివి లేకుండా.. రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికీ మించి సిగరెట్ అలవాటుంటే మానుకోవాలి. తాగుడుకు దూరంగా ఉండాలి. ఒకవేళ తాగాలనిపించినా మోతాదుకు మించి తాగొద్దు.
ఇట్ల గుర్తించొచ్చు :
హీమోగ్లోబిన్ ఏ1సీ (హెచ్‌బీఏ1సీ) టెస్ట్
పరగడుపున బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ గ్లూకోజ్‌ను తట్టుకునే శక్తి టెస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ తిన్న తర్వాత షుగర్ టెస్ట్.
(నోట్: డబ్ల్యూహెచ్‌వో ప్రకారం బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు 70 నుంచి 100 ఎంజీ/డీఎల్ ఉండాలి)
లక్షణాలివి :
మూత్రం ఎక్కువగా రావడం దూప ఎక్కువ కావడం ఎంత తిన్నా ఆకలిగా ఉండడం చూపు తగ్గడం అలసట గాయాలు మానకపోవడం చర్మంపై దద్దుర్లు/పగుళ్లు టైప్ 1 డయాబెటిస్ ఉన్నోళ్లలో వీటన్నింటితో పాటు బరువు తగ్గడం
నోట్: టైప్ 1 డయాబెటిస్ ఉన్నోళ్లలో ఈ లక్షణాలన్నీ వేగంగా కనిపిస్తాయి. టైప్ 2 ఉన్న వారికీ ఈ లక్షణాలున్నా.. అవి బయటపడకపోవచ్చు. కొన్ని లక్షణాలు బయటికి కనిపించినా.. మరికొన్ని చాలా నెమ్మదిగా డెవలప్ అవుతుంటాయి.
మన దేశం.. డయాబెటిక్ స్థావరం :
ప్రపంచమంతటా 46.3 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లున్నారు. ఏటా సగటున 16 లక్షల మంది దానికి బలైపోతున్నారు. ఆగ్నేయాసియాలోనే (సౌత్ఈస్ట్) 5.92 లక్షల మంది చనిపోతున్నారు. మన దేశంలో దాదాపు 8 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లున్నారు. అనధికారికంగా ఆ సంఖ్య 9 కోట్ల దాకా ఉండొచ్చని నిపుణుల అంచనా. ప్రపంచంలో ప్రతి ఆరుగురు షుగర్ బాధితుల్లో ఒకరు ఇండియాలోనే ఉన్నారు. టైప్ 1 డయాబెటిస్‌లో కూడా అమెరికా తర్వాత స్థానం మన దేశానిదే. వాస్తవానికి మధుమేహంలో చైనానే టాప్. ఆ దేశంలో దాదాపు 11.6 కోట్ల మంది డయాబెటిక్స్ ఉన్నారు. కానీ.. మన దేశానికి డయాబెటిక్ క్యాపిటల్ అన్న ముద్ర పడిపోవడానికి కారణం.. మన దేశంలో ఉన్నోళ్లకు మధుమేహం ముప్పు ఎక్కువగా ఉండడమేనన్నది నిపుణులు చెబుతున్న మాట. మన దేశంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం, జన్యుపరమైన కారణాలు (జెనెటిక్ ఫ్యాక్టర్స్), వేగంగా పెరుగుతున్న అర్బనైజేషన్ వల్ల వస్తున్న వాతావరణ మార్పుల వంటివి మన దేశంలో డయాబెటిక్ పేషెంట్లు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక, మన దేశంలో బెంగళూరు ''డయాబెటిక్ క్యాపిటల్''గా మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఒక్క బెంగళూరు సిటీలోనే 2.36 లక్షల మంది డయాబెటిక్స్ ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో మొత్తంగా 3.8 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు అంచనా. కొచ్చిలోనూ డయాబెటిస్ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు చెబుతున్నారు. అక్కడ మహిళల్లో ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టెస్ట్ చేసిన వాళ్లలో సగటున 16 శాతం మంది మహిళలకు అన్ కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నట్టు చెప్పారు.
ముప్పు పెరిగింది :
మన దేశ జనానికి షుగర్ ముప్పు 12 శాతం దాకా పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. యువతలో ఆ ముప్పు ఇప్పటికే 10 శాతం దాకా పెరిగింది. పల్లెలతో పోలిస్తే సిటీల్లోనే ఆ ముప్పు ఎక్కువగా ఉంటోంది. అందుకే కేన్సర్, గుండెజబ్బులతో పాటు డయాబెటిస్‌ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2010లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కేన్సర్, డయాబెటిస్, కార్డియో వాస్క్యులార్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ (ఎన్పీసీడీసీఎస్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదట్లోనే దానిని గుర్తించేందుకు క్యాంపులను ఏర్పాటు చేసి అన్ని వయసుల వాళ్లకు ముందస్తు టెస్టులు చేసి అవసరమైన వాళ్లకు ట్రీట్మెంట్‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశంలో సగటున ఒక్కో డయాబెటిక్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఏటా రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ముందు గుర్తిస్తేనే సాధ్యం :
టైప్ 1 డయాబెటిస్‌లో రెమిషన్ అనేది సాధ్యం కాదు. టైప్ 2లో సాధ్యమే అయినా.. డయాబెటిస్ వచ్చిన నాలుగైదేండ్లలోనే ప్రయత్నించాలి. ఆ తర్వాత అంటే కొంచెం కష్టమే. డయాబెటిస్‌ను ఒక్కదాన్నే కంట్రోల్ చేసుకుంటే సరిపోదు. దాంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటినీ అదుపులో ఉంచుకోవాలి. రోజూ ఎక్సర్‌సైజ్ చేయాలి. కరోనా ఉన్న డయాబెటిస్ పేషెంట్లకు కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. వాళ్లను ఐసీయూలో పెట్టాల్సి రావొచ్చు. కరోనా సోకినోళ్లకు కార్డికోస్టిరాయిడ్స్ తో ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా లేని షుగర్ జబ్బు వచ్చేస్తుంది. గుండెజబ్బులు, నరాలు ఉబ్బడం, వెరికోస్ వెయిన్స్, గ్యాంగ్రిన్ వాస్క్యులార్ జబ్బులు వచ్చే ముప్పుంటుంది. మంచి నిద్ర, హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకుంటే డయాబెటిస్‌ను 'రివర్స్' చేయొచ్చు.
అప్పట్లోనే డయాబెటిస్ నివారణ ప్రోగ్రామ్ !
నిజానికి మధుమేహ నివారణ కోసం 1987లోనే అప్పటి ప్రభుత్వం నేషనల్ డయాబెటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటకల్లోని కొన్ని జిల్లాల్లో దానిని అమలు చేసింది. అందులో భాగంగా ఎక్కువ ముప్పున్న వారిని గుర్తించింది. ముందుగానే గుర్తించేందుకు వీలుగా డయాబెటిస్‌పై హెల్త్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. బాధితులకు సరైన టైంలో ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. షుగర్ వల్ల వచ్చే గుండె, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యల నివారణకు కృషి చేసింది. షుగర్‌తో కాళ్లూచేతులు పోగొట్టుకున్న వాళ్లకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేసింది. అయితే, నిధుల కొరత వల్ల ఆ కార్యక్రమం ఎంతో కాలం సాగలేదు. మిగతా రాష్ట్రాల్లో అమలు చేయలేదు.
ప్రతి ఒక్కరికీ డయాబెటిక్ కేర్ :
డయాబెటిస్తో ఎంతో మంది బాధపడుతున్నా.. ఇప్పటికీ చాలా మందికి ఇన్సులిన్ గానీ, సరైన ట్రీట్మెంట్గానీ అందని పరిస్థితి. అందుకే ఇన్సులిన్‌ను గుర్తించి వందేండ్లయిన సందర్భంగా యునైటెడ్ నేషన్స్.. ఈసారి డయాబెటిస్ డే థీమ్‌ను 'ప్రతి ఒక్కరికీ డయాబెటిక్ కేర్'గా తీసుకుంది. 2023 వరకు ఇదే థీమ్‌తో కార్యక్రమాలను చేపట్టనుంది. డయాబెటిస్తో బాధపడే ప్రతిఒక్కరికీ ట్రీట్మెంట్ రక్షణ వంటివి చాలా అవసరమని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లకు, ఆ ముప్పు కొనంచున ఉన్న వారికీ ఇది చాలా ఉపయోగపడే అవకాశముంది.
కరోనాకు దోస్త్...
కరోనా మహమ్మారి వచ్చాక దాదాపు మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మొదట్లో జనాలమీద అది దండెత్తి వచ్చినప్పుడు అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు దానికి దోస్తులైనయ్. అందులో ముందు వరుసలో ఉండేది డయాబెటిస్. దాని వల్ల కరోనా సోకకపోయినా.. కరోనా వచ్చినోళ్లకు అది ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందే. డెత్ రేట్ కూడా వారిలోనే ఎక్కువగా ఉంటున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. కరోనా మరణాల్లో దాదాపు 15శాతం వరకు డయాబెటిస్తో బాధపడుతున్నోళ్లే ఉంటున్నారని వెల్లడిస్తున్నాయి. దానికి కారణాలూ లేకపోలేదు. షుగర్ ఉన్నోళ్లలో అప్పటికే ఇమ్యూన్ సిస్టమ్ కాస్తంత బలహీనమవడం, కరోనాతో అది మరింత బలహీనపడడం వల్ల డెత్ రేటు ఎక్కువగా ఉంటున్నట్టు చెబుతున్నారు.
ఎకానమీకి ముప్పే :
డయాబెటిస్తో కేవలం ఒంటికే కాదు.. సొసైటీ మీద పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. డయాబెటిస్ ఉన్నోళ్ల జీవిత కాలం తగ్గిపోతుంది. అంటే సగటు మనిషితో పోలిస్తే ఆయుష్షు తగ్గుతుంది. ప్రి మెచ్యూర్ మోర్టాలిటీ పెరుగుతుంది. దాని వల్ల పనిచేసే వాళ్లు తగ్గుతారు. ఆ ప్రభావం ప్రొడక్టివిటీ మీద పడుతుంది. జీడీపీపై భారం పెరుగుతుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చేసిన ఓ స్టడీ ప్రకారం ప్రపంచ ఎకానమీపై 2030 నాటికి రూ.157 లక్షల కోట్ల (2.12 లక్షల కోట్ల డాలర్లు) వరకు ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అన్ని దేశాలపై ఆయా దేశాల జీడీపీల్లో సగటున 1.4 శాతం డయాబెటిక్ వల్ల నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. నార్త్ అమెరికా, ఈస్ట్ ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో డయాబెటిస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇన్సులిన్‌కు వందేండ్లు :
డయాబెటిస్‌లో చాలా కామన్‌గా వాడేది ఇన్సులిన్. దాన్ని ఒక మామూలు మనిషి గుర్తించాడంటే నమ్ముతారా? సర్ ఫ్రెడరిక్ జి. బ్యాంటింగ్ దానిని గుర్తించారు. అతడు సైంటిస్ట్ కాకపోవడం.. దానిగురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో చార్లెస్ హెచ్. బెస్ట్, జేజేఆర్ మాక్లాయిడ్ అనే సైంటిస్టులతో కలిసి ఇన్సులిన్‌ను ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇన్సులిన్ ఎక్స్ట్రాక్షన్కు ఈ ఏడాదితో వందేండ్లు నిండాయి. దానిని తొలిసారి 1921లో గుర్తించారు. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ ఇన్సులిన్‌ను ఆ తర్వాత జేమ్స్ బి. కొలిప్ అనే మరో సైంటిస్ట్ శుద్ధి చేశారు. దీనిని గుర్తించడంతో టైప్ 1 డయాబెటిస్తో బాధపడేవాళ్లకు భారీ ఊరటనే లభించింది. అప్పటిదాకా టైప్1 డయాబెటిస్ బయటపడ్డాక కేవలం ఒకట్రెండేండ్లలోనే చనిపోయేవాళ్లు. కానీ, ఇన్సులిన్ వచ్చాక మరణాలు చాలా వరకు తగ్గాయి. అందుకే చరిత్రలో దీన్ని గొప్ప ఇన్నొవేషన్‌గా సైంటిస్టులు చెబుతారు.
ఇట్ల కనిపెట్టిన్రు...
పాంక్రియాస్‌లోని ఐలెట్ అనే కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తున్నాయని 1920లో కొంతమంది సైంటిస్టులు గుర్తించారు. టైప్1 డయాబెటిస్ ఉన్నోళ్లలో ఆ కణాలే పాడైపోయి ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదని తేల్చారు. అప్పుడే ఇన్సులిన్‌ను ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, చాలాసార్లు విఫలమయ్యారు. పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్‌ను ఎక్స్ట్రాక్ట్ చేసే క్రమంలో ఉత్పత్తయిన ఇన్సులిన్ దెబ్బతినకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అదే ఏడాది అక్టోబర్‌లో ఫ్రెడరిక్ బ్యాంటింగ్.. పాంక్రియాస్‌లోని ఇతర కణాలతో పోలిస్తే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు అంత త్వరగా పాడు కావని తెలుసుకున్నారు. అయితే, అప్పటికి ఆయన ఓ సైంటిస్ట్ కాదు. ఓ మామూలు మనిషి. అతడొక్కడి వల్ల అది సాధ్యం కాదని తెలుసుకుని.. 1920 నవంబర్ 7న యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పనిచేస్తున్న జాన్ మాక్లాయిడ్ అనే ప్రొఫెసర్‌ను ఆయన కలిశారు. వాళ్లు వెంటనే పని ప్రారంభించారు.
1921 మే 17: ఇన్సులిన్ ఎక్స్ట్రాక్షన్ కోసం బ్యాంటింగ్‌కు మాక్లాయిడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. చార్లెస్ బెస్ట్ అనే ఓ రీసెర్చ్ స్టూడెంట్ను రీసెర్చ్‌లో భాగం చేశారు. ఆ ముగ్గురూ కలిసి 1921 మే 17న తమ మొదటి ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఓ కుక్క పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్‌ను తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు తప్ప.. మిగతా కణాలను చంపేశారు. ఇన్సులిన్‌ను తయారు చేయలేని పాంక్రియాస్ ఉన్న కుక్కలకు.. ఈ పాంక్రియాస్‌ను పెట్టారు.
1921 నవంబర్ 10: వారి రీసెర్చ్ ఫస్ట్ టైం ఫలించింది. ఆ కుక్కలో ఇన్సులిన్ ఉత్పత్తి మొదలైంది. నెమ్మదిగానే సాగినా.. వారికంటూ ఓ కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. ఆ ఇన్సులిన్‌తో డయాబెటిస్ ఉన్న కుక్కకు 70 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు సాధించారు.
1921 డిసెంబర్ 12: మరింత ఎఫెక్టివ్ ఇన్సులిన్‌ను తయారు చేసేందుకు, ఉత్పత్తయిన ఇన్సులిన్‌ను శుద్ధి చేసేందుకు జేమ్స్ కొలిప్ అనే బయోకెమిస్ట్ వారికి జత కలిశారు. మనుషులపై ప్రయోగాలు చేసేందుకు వీలుగా ఇన్సులిన్‌ను శుద్ధి చేశారు. ఈసారి కుక్కల నుంచి కాకుండా పాడిపశువులనుంచి పాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్‌ను ఎక్స్ట్రాక్ట్ చేశారు.
1922 జనవరి 11: తొలిసారి మనుషులపై ప్రయోగించారు. టైప్ 1 డయాబెటిస్తో చావు అంచుల దాకా వెళ్లిన లియోనార్డ్ థాంప్సన్ అనే ఓ 14 ఏండ్ల అబ్బాయికి తొలిసారి ఆ ఇన్సులిన్‌ను ఎక్కించారు. కేవలం 24 గంటల్లోనే ఆ అబ్బాయిలో ప్రమాదకరంగా ఉన్న చక్కెర స్థాయి సాధారణ స్థాయికి వచ్చేసింది. అయితే, ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో గడ్డకట్టి.. ఎక్కువ మోతాదులో కీటోన్లు తయారయ్యాయి. ఆ ముప్పును తప్పించేందుకు కొలిన్ ఇన్సులిన్‌ను మరింత శుద్ధి చేసేందుకు రాత్రిపగలూ కష్టపడ్డారు. 1922 జనవరి 23న థాంప్సన్‌కు రెండోసారి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈసారి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండానే ఆ అబ్బాయికి చక్కెర స్థాయి తగ్గింది.
1922 మే: ఇన్సులిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఎలిలిల్లీ అనే ఫార్మా సంస్థ తొలిసారి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసింది.
1923 అక్టోబర్ 25: ఇన్సులిన్‌ను కనిపెట్టినందుకు బ్యాంటింగ్ మాక్లాయిడ్లకు కలిపి నోబెల్ ప్రైజ్ అందజేశారు. తనకు వచ్చిన ప్రైజ్ మనీలో సగం మొత్తాన్ని బెస్ట్‌కు బ్యాంటింగ్ ఇచ్చేశాడు. మాక్లాయిడ్ తన ప్రైజ్ మనీలో సగాన్ని కొలిప్కు ఇచ్చాడు.
0 Comments